Tuesday 14 August 2018

శ్రావణ మాసం



                            శ్రావణ మాసం

పండుగలకు గృహ శోభ కి విశేష మాసం


*సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే*              
*శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే*

తాత్పర్యము:-

*మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై,సర్వ మంగళ నామధేయురాలవై,అన్ని అర్థములను సాధించి,శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే,ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ,ఓ! దుర్గాదేవీ,ఓ! నారాయణీ..నీకు నమస్కరిస్తున్నాను.*

శ్రావణ మాస విశిష్టత ......

వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమే. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి వైశిష్ట్యం చాలా ఉంది. లక్ష్మీ దేవికి ఇష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయని పూర్వీకుల ఉవాచ. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మానం ఇదే.

శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి ,నాగ పంచమి పుత్రాదా ఏకాదశి ,దామోదర ద్వాదశి ,వరహ జయన్తి ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.

శ్రావణ సోమవారం……



శివారాధనకు ఎంతో విశిష్టత కలిగిన మాసం..
శ్రావణమాసంలోని దక్షిణయానంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు కూడా విశిష్టమైన మాసం. శ్రావణమాసం ముఖ్యంగా భగవారాధనలో శివ, కేశవ బేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ మాసంలో చేసే ఏ చిన్న కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుంది. ఈ మాసంలో సోమవారాలు పగలంత ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రభిషేకాలు, బిల్వార్చనలు జరిపినట్లయితే సకల పాపాలు కూడా నశిస్తాయాని శస్త్ర వచనం. సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థాం ఈ వ్రతాన్ని (ఉపవాసదీక్షను) చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా ఉపవాసం ఉండి దీక్షను పూర్తిచేయాలి. అలా సాధ్యం కానీ పక్షంలో రాత్రి సమయంలో పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని బుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అనేక శుభఫలితాలు కలుగుతాయి. వీటికి తోడు శ్రావణశుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఈ పక్షంలోని ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేదశాస్ర్తాలు చెబుతున్నాయి. భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉటుందంటున్నారు పండితులు. అందుకే శ్రావణమాసంలోని అన్ని సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంటుంది.

శ్రావణ మంగళవారం - మంగళగౌరీ వ్రతం…...



కొత్త పెళ్లికూతురు శ్రావణమాసంలో వచ్చే ప్రతిమంగళవారం ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. మంగళగౌరీ అనుగ్రహం తో అష్టైశ్వర్యాలు, నిండు ముత్తెదుతనం పొందుతారు.
శ్రీ కృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసం లో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లి కి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకొంటారు.

శ్రావణ శుక్రవారం - ‌వరలక్ష్మీ వ్రతం…...



ఈ మాసం లో పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవిని షోడసోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అయిదవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని పెద్దలు చెప్పారు. లక్ష్మి దేవి భక్త శులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్ట శక్తులని అష్టలక్ష్ములు గా ఆరాదిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటిని రక్షించేవాడు, ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మి దేవికి అత్యంతప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నిచేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఓ ప్రత్యకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతి లో ఆచరించిన సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మి దేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం
శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాని పటించాలి.

శ్లో: బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం |
పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే ||

అని పటిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే మంత్రాలను పటిస్తూనే ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మాంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి..

శ్రావణ శనివారాలు…...



ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పు ని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది.

శ్రావణ పౌర్ణమి…...




శ్రావణ పౌర్ణమి , జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి ని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి .
జంధ్యాన్ని యగ్నోపవీతమని , బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వెదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు.

నాగుల చవితి…...




నాగుల చవితి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే చతుర్ధి ని నాగదేవతలకు ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం, నాగ దేవతలకు పాలు పోస్తే సంతానానికి సంబంధించిన దోషాలు అన్ని తొలుగుతాయి. సర్పదోషాల నుంచి విముక్తి లభిస్తుంది.

నాగపంచమి…...




శ్రావణ పౌర్ణిమకు ముందుగా వచ్చే పంచమిని నాగపంచమి అంటారు. ఈరోజున ఉదయాన్నే లేచి పాముపుట్టల వద్దకు వెళ్లి ఆ నాగేంద్రునికి పాలు పోస్తారు.


శ్రీ సంతోషిమాతా వ్రతం…...




శ్రావణ పూర్ణిమ రోజుని శ్రీ సంతోషీ మాతా జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున సంతోషిమాతా వ్రతం చేయటం వలన విశేషమైన ఫలితం లభిస్తుందని నమ్మకం. శ్రీ సంతోషిమాతా వ్రతాన్ని ఆచరించడం ద్వారా అన్నిశుభాలు కలుగుతాయని, ధన, కనక, వస్తు, వాహన యోగంతో పాటు నిండు ముతైదుతనం లభిస్తుందని మహిళలు భావిస్తారు. .

రక్షా బంధనం…….




శ్రావణ పూర్ణిమని రాఖీ పూర్ణిమ అని కూడా అంటారు. మహిళలు తమ అన్నదమ్ములకు, సోదర సమానులకు రాఖీని కట్టి వారి క్షేమం కోరుకుంటారు. శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికీ అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయం లో కట్టడం చేయాలి. అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 దాటాక , కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటి నుండి వస్తున్నా సంప్రదాయమేనని తెలుస్తోంది.

హయగ్రీవ జయంతి…...




శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవ జయంతి అని పురాణాల్లో ఉంది. ఈ రోజు విష్ణు ప్రీతిగా చేసే అర్చన, ఆరాధన, వ్రతాలు, విశేష ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈ రోజున హయగ్రీవుల వారి ద్వారా ఉపదేశించిన శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం పారాయణ చేసి గుగ్గిళ్లు నైవేద్యం పెట్టటం మంచిది. మనలో ఉండే అహంకారం తొలగిపోయి అందరిలో సమ భావన కలిగి ఉంటారు.


శ్రీ కృష్ణాష్టమి…...




ఈమాసంలోనే శ్రీకృష్ణ జన్మాష్టమి. అందరూ ఎంతో భక్తిశ్రద్దలతో శ్రీకృష్ణుని పూజించి, చిన్నారులు శ్రీకృష్ణ వేషధారణలు ధరించి ఉట్టికొట్టి ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు.

మతత్రయ ఏకాదశి…...




శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు  మహావిష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది అని పురాణాలు చెపుతున్నాయి.

శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు కూడా ఈ మాసంలోనే ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.

పొలాల అమావాస్య …...



ఈ వ్రతం శ్రావణ మాసం చివరి రోజున చేసుకుంటారు.ఇది పెళ్ళయిన ఆడవాళ్ళుపిల్లల(శ్రేయస్సు)కోసంచేస్తారు శ్రావణ మాసం చివరగా వొచ్చే అమావాస్యరోజున జరుపుకుంటారు.పండగపూట కందమొక్కకు పూజ చేస్తారు.  

ఇన్ని పండుగలు అన్ని ఈ మాసంలోనే వస్తాయి కాబట్టి శ్రావణమాసం అంటే సందడే సందడి. మనశక్తి ని బట్టి భక్తితో,మనసులో, మనస్పూర్తిగా ఆ భగవన్నామ స్మరణ చేసుకుంటూ… వీలైనన్ని పూజలు చేసుకుని ఆ లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది, అమ్మ ఆశీస్సులతో సకల సౌభాగ్యాలు పొందుదాము.

శ్రావణ లక్ష్మి - సౌభాగ్యదాయిని……



పుణ్యాల రాశి... సర్వజగత్తుకూ కల్పవల్లి... దారిద్య్ర వినాశిని... సౌభాగ్యదాయిని...పాలకడలిలో పుట్టిన దీపశిఖ...శ్రీమహాలక్ష్మి... లోకాలన్నిటికీ సర్వ శుభాలనూ చేకూర్చే ఆ తల్లి ఎవరింట ఉంటుందో ఆ ఇంట్లో తానూ ఉంటానని పరమాత్ముడు చెప్పారు. సిరి,హరి కలిసి ఉన్న ఆ ఇంట్లో లేనిదేముంటుంది. మరి సిరి ఎక్కడుంటుంది? సత్కర్మలలో, సదాశయాల్లో, సదాచారాల్లో, నీతినియమాల్లో అమ్మవారు కొలువుంటారని మార్కండేయ పురాణం చెబుతోంది. వ్యసనాలు, సత్ప్రవర్తన, శారీరక, మానసిక శుద్ధి లేని వారింటిని శ్రీమహాలక్ష్మి విడిచిపోతుందని జైమినీ భారతం తెలియజేస్తోంది. అందుకే డబ్బుకన్నా ముందు మంచి గుణగణాలను ఇమ్మని అమ్మను ప్రార్థించాలి.  లక్ష్మీ విభూతుల్లో మనిషి చెమట చిందించే చోటు ప్రముఖమైన లక్ష్మీ స్థానంగా చెప్పారు. అంటే శ్రమే సంపద. శ్రమ జీవికి జగమంతా లక్ష్మీ నివాసమే.

లక్ష్మీదేవి సకల సంపదలకు ప్రతీక. సకల సౌభాగ్యాలకూ చిహ్నం. మనిషి సుఖమైన, శుభప్రదమైన జీవితం గడపడానికి కావాల్సిన సమస్త అంశాలను సంపదగానే పరిగణిస్తారు. ధనధాన్యాలు, సంతానం, ఆరోగ్యం, జ్ఞానం వంటివన్నీ కోరేవారంతా లక్ష్మీకటాక్షం కోసం ఎదురు చూస్తుంటారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి... వగైరా పేర్లతో వారివారి అభీష్టం మేరకు ఆరాధిస్తారు.

లక్ష్మీ స్తోత్రాల్లో ‘దారిద్య్ర ధ్వంసినీం దేవీం సర్వ ఉపద్రవ వారిణీమ్‌’ అని ప్రార్థన ఉంటుంది. లోకంలోని సకల దారిద్య్రాలను పారదోలే దేవత శ్రీ మహాలక్ష్మి. సర్వ ఉపద్రవాలను నివారించగల దేవత ఆమె. అందుకే ఆమెను శంకర భగవత్పాదులు ‘సంపత్కారిణి’ అనీ, ‘త్రిభువన భూతకరీ’(ముల్లోకాలకు ఐశ్వర్యాన్నిచ్చేది) అనీ సంబోధించారు. రుగ్వేదంలోని ప్రధాన సూక్తాల్లో శ్రీసూక్తం దేవీ తత్త్వాన్ని మనకు అందించింది. సృష్టిలోని సంపదల్లో దాగున్న అమ్మ రూపాన్ని అపురూపంగా పదిహేను రుక్కుల్లో మనకు వివరించింది. ఇందులో

పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజావిగోరథమ్‌ |
ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మామ్ ||

పుత్రపౌత్రులు, ధనధాన్యాలు, ఏనుగులు, ఇతర సంపదలను అనుగ్రహించు తల్లీ... నాకు ఆయుర్ధాయాన్ని ప్రసాదించమని అంటోందీ రుక్కు. ఇందులో ఆయుష్షును ప్రత్యేక సంపదగా పేర్కొంటోంది. మిగిలిన సంపదలు అనుభవించాలంటే మొదట ఆయుర్ధాయం కావాలి. దానికి ఆరోగ్యం కావాలి. ఈ సూక్తాన్నిబట్టే ఆరోగ్యమే మహాభాగ్యమని... అది కూడా లక్ష్మీ స్వరూపమని తెలుసుకోవాలి. వనాలు, ఆకులు, సుగంధ ద్రవ్యాలు, ఆవుపేడ, బిల్వ వృక్షం... ఇవన్నీ శ్రీలక్ష్మికి నివాసాలు. అడవులు, నదులు, పర్వతాలు, ప్రకృతిలో ఉన్న అమ్మను ప్రసన్నురాలిని చేసుకోవడమే మన ప్రగతికి శ్రీకారంగా గుర్తించాలి.

ఏమికోరినా  అనుగ్రహించే తల్లి కాబట్టి ఆమెను వరలక్ష్మిగా సంబోధించారు. ‘వ్రతవ్యే అనేన అనయావా అతి వ్రతం...’ జీవితాంతం ఒక దీక్ష మాదిరిగా దేన్ని పాటిస్తామో అది వ్రతం అవుతుంది. ఈ నేపథ్యంలోనే శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఒక్కరోజు మాత్రమే నిర్వహించే వరలక్ష్మీ పూజను మన పెద్దలు వ్రతంగా పేర్కొనడం గమనించాల్సిన విషయం.

అమ్మవారు ఫాల్గుణమాసం ఉత్తరానక్షత్రంలో పౌర్ణమివేళ నాలుగు చేతులతో అవతరించారు. అందుకే అమ్మవారికి శుక్రవారం ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఏటా శ్రావణమాసంలో ప్రతి శుక్రవారాన్ని విశేషమైన పండగగా చేసుకుంటారు. ముఖ్యంగా మహిళాలోకంలో శ్రావణశుక్రవారానికి విశేష ప్రాధాన్యం ఉంది.
సిరులిచ్చే శ్రీలక్ష్మి అనుగ్రహం పొందడానికి పూజలు, వ్రతాలు, స్తోత్రాలు ఉపకరించవచ్చు. వాటికి ఆ తల్లి ఆనందించనూ వచ్చు. అయితే భక్తుడి ఇంట ఎప్పటికీ తానుండాలంటే మరికొన్ని నియమాలను కూడా పాటించాలని ఆమె చెప్పినట్లు మహాభారతం శాంతి పర్వంలో ఉంది. లక్ష్మీదేవి తానెక్కడెక్కడ ఉంటానో స్వయంగా ఇంద్రుడికి చెప్పినట్లు అందులో ఉంది. ఆమె మాటలను తిక్కన సీసపద్యంలో ఇలా వర్ణించారు. అవే లక్ష్మీస్థానాలుగా పరిగణిస్తారు.
గురుభక్తి నిరతులు, సురపితృపూజన
పరులును, సత్యసంభాషణులును,
దానశీలురుఁ, బరధనపరదారప
రాఙ్ముఖచిత్తులు, బ్రాహ్మణప్రి
యులు, దివానిద్రావియుక్తులు, వృద్ధదు
ర్బలదీన యోషిత్కృపారతులును
శౌచులు, అతిథిభోజనశిష్టభోజులు
నేను మెచ్చు జనంబు; లిట్లుగాక
* ఎక్కడ గురుభక్తి కలవారుంటారో అక్కడ
* ఎక్కడ తల్లిదండ్రులను పూజించే వారుంటారో అక్కడ
* ఎక్కడ దానగుణం కలిగిన వారుంటారో అక్కడ
* ఎక్కడ ఇతరుల ధనం ఆశించని వారుంటారో అక్కడ
* ఎక్కడ బ్రాహ్మణులను ఆదరించే వారుంటారో అక్కడ
* ఎక్కడ పగటి పూట నిద్రించని వారుంటారో అక్కడ
* ఎక్కడ వృద్ధుల, దీనుల ఆదరణ  ఉంటుందో అక్కడ
* ఎక్కడ శుచీ, శుభ్రత ఉంటాయో అక్కడ
* ఎక్కడ అతిథి, అభ్యాగతుల సేవ జరుగుతుందో అక్కడ తానుంటానని... అలా ఉండేవారిని తాను అనుగ్రహిస్తానన్నది లక్ష్మీదేవి మాట.
అలాగే తన అనుగ్రహం పొందలేని వారి గురించి కూడా ఆమె చెప్పింది...
ధర్మ మెడలి, కామంబు క్రోధంబుఁ జాలఁ;
గలిగిగర్వులై బలియు భైక్షంబునిడక
పరుష వాక్కులఁ గ్రూరంపుఁ జరితములను।
మిగిలి వర్తించువారు నా మెచ్చుగారు
* ధర్మాలను పాటించని వారు
* కామక్రోధాలు ఎక్కువగా ఉన్నవారు
* గర్వం ఉన్నవారు
* పేదలకు భిక్ష, పూజా సామగ్రి ఇవ్వని వారు
* కఠినమైన మాటలాడేవారు
* క్రూర మనస్తత్వం ఉన్నవారు

శ్రావణ వంటలు - ఆరోగ్యప్రదాయము……

ఆషాఢ మాసము వెళ్ళిపోయి శ్రావణము వచ్చిందంటే మహిళలకు సందడే సందడి . వరలక్ష్మికి తొలిపూజ చేయడం ద్వారా తకము సౌభాగ్యము , ఐశ్వర్యము కలగాలని కోరుకుంటారు . అయిటే ఇందులో అంతర్లీనము గా ఆరోగ్య రహస్యము కూడా ఇమిడి ఉంది . వర్షాకాలము ప్రారంభం లో సాదారణము గా ప్రబలే పలు రకాల వ్యాధుల నుంచి తప్పించుకునేందుకు అవసరమైన రోగనిరోధక శక్తి ఈ వ్రతాల ద్వారా లభిస్తుంది . వరలక్ష్మీ పూజలో తొమ్మిది రకాల పిండివంటలు , ఈ ఋతువులో లభించే పండ్లు , వివిధ పుష్పాలు నివేదించి కుటుంబ సభ్యులంతా ప్రసాదం గా తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులవుతారు . ఇంకా కుటుంబ సభ్యులలో సహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది . మహిళలు పేరంటం పేరుతో ఇరుగుపొరుగు వానిని ఆహ్వానించి పరస్పరము వెళ్ళి వాయినాలను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా స్నేహభావము పెరుగుతుంది .



తొమ్మిది రకాల పిండివంటలు :-

పూర్ణం బూరెలు : సెనగపప్పుతో తయారు చేసిన ఈ బూరెలు తినడం ద్వారా ప్రోటీన్లు సమంద్దిగా లభిస్తాయి .
పులగం : బియ్యం , పెసరపప్పులను కలిపి తయారు చేస్తారు . గ్లాసుడు బియ్యంలో అరగ్లాసు పెసరపప్పు , తగినంత పంచదార , జీలకర్ర వేస్తారు .. ఇది భుజించడం ద్వారా మేధస్సు వికసిస్తుంది .
గారెలు : మినపపప్పు , కొద్దిగా సెనగపప్పు వేసి తయారు చేస్తారు . గారెలంటే అందరికీ ఇస్టము . ఇందులొ ఎన్నో ప్రోటీన్లు ఉన్నాయి .
పరమాన్నము : పాలను మరిగిస్తూ దానిలో నెయ్యి కలిపిన బియ్యాన్న, పంచదార .. వేయడం ద్వారా పరమాన్నము గా తయారవుతుంది . దీన్ని తినడం వల్ల కాల్షియం లభిస్తుంది .
చెక్కెర పొంగలి : బియ్యము , పాలు , నెయ్యి . పెసరపప్పు , జీడిపప్పు , కిస్ మిస్ , మిరియాలు వేసి తయారవుతుంది గాన మెదడు , ఇతర అవయవాలు చురుగా పనిచేసి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి .
పులిహోరా : బియ్యము , పసువు , జీడిపప్పు , వేరుసెనగ పప్పు , ఇంగువ వేసి తయారవుతుంది . దీనిని తినడం వల్ల శరీరము లో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది .
చిట్టి బూరెలు : మునపపప్పు ముద్దగా చేసి కొద్దిగ మజ్జిగ కలిపి వేయించి చేస్తారు . ఇవి పిల్లలకు చాలా ఇస్టము . చలువ చేస్తుంది .
పెసర బూరెలు : పెసర పప్పుతో తయారు చేసిన ఈ బూరెలు లలో ప్రోటీన్లు లభిస్తాయి .
గోధుమ ప్రసాదము : గోధుమ నూక , పంచదార , నెయ్యి , మిశ్రమముతో తయారుచేస్తారు . ఇది బలమైన ఆహారము



No comments:

Post a Comment