Saturday 24 February 2018

ఫాల్గుణ మాసం విశిష్టత

          
                            ఫాల్గుణ మాసం

ఫాల్గుణం ..విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది. అదితి పయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందింది. ఫాల్గుణంలో గోదానం, ధనదానం, వస్త్రదానం, గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణం. ఇంతకు ముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు, వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకోసారి కనిపించడం విశేషం. సర్వదేవతావ్రత సమాహారంగా, సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది.




వసంత పంచమి నుంచి ఫాల్గుణ పూర్ణిమ వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది. చిలుకలు వాలిన జామచెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నెల రామచిలకలా కనువిందు చేస్తుంది. చలి పూర్తిగా తగ్గదు. నులివెచ్చదనం ప్రాణానికి హాయి కలిగిస్తుంటుంది. ఫాల్గుణ బహుళ పాడ్యమినాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్లాడు. ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు, లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. రావణబ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు. అంతేకాదు కురుపాండవుల్లో కొందరు ఫాల్గుణ మాసంలో జన్మించినట్లు చెబుతారు.

హరిహరసుతుడు అయ్యప్పస్వామి, పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు. ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతిలు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది. అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి ‘ఫల్గుణ’ అనే పేరుంది. ఫాల్గుణ బహుళ అష్టమినాడు ధర్మరాజు, ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజున భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనులు జన్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.


       ఫాల్గుణ మాసం శ్రీ మహావిష్ణువు ఆరాధన





శ్లో || నరాడోలా గతం దృష్ట్యా గోవిందం         పురుషోత్తమం !
        ఫాల్గుణ్యాం ప్రయతో భూత్వా గోవిందస్య పురం వ్రజేత్ !!

శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసాల్లో ఫాల్గుణం ఒకటి. పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుణి లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్ర సమీపంలో సంచరిస్తే, ఆ మాసాన్ని ‘ఫాల్గుణి’గా పరిగణిస్తారు. గోవింద వ్రతాలను విరివిగా చేస్తుంటారు. విష్ణుపూజకు ‘పయోవ్రతం’ విశిష్టమైంది. దీన్ని శుద్ధ పాడ్యమినాడు ప్రారంభించి పన్నెండు రోజుల పాటు కొనసాగిస్తారు.

సమీపంలోని నదుల్లో స్నానమాచరించి, సూర్యుడికి అర్ఘ్యమిచ్చి, విష్ణువును షోడశోపచారాలతో పూజించి, పాలను నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. పయస్సు అంటే పాలు. అదితి ఈ వ్రతం ఫలితం వల్లే వామనుడు జన్మించాడట. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియనాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు. 


ఈ మాసంలో రెండు రోజులు వినాయకుణ్ని ఆరాధిస్తారు. కాశీ, ద్రాక్షారామంలో వెలసిన డుండి గణపతికి సంబంధించిన పూజ ఇది. శుక్ల పాడ్యమి, చతుర్థినాడు అవిఘ్న, పుత్ర గణపతి వ్రతాల్ని ఆచరిస్తారు. శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరిరోజు.


ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారు.దివ్యౌషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశినాడు పూజించి, ఆ చెట్టు వద్దనే ‘అమలక ఏకాదశి’ వ్రతం నిర్వర్తిస్తారు. దీన్ని ‘అమృత ఏకాదశి’ గా పరిగణిస్తారు. మదురైలోని మీనాక్షీ సుందరేశ్వరుల కల్యాణం రోజు ఇది. అందుకే శివపూజ చేస్తారు. ఈ నెలలో విష్ణుపూజకు ప్రాధాన్యత ఉంటుంది. ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైంది వసంతోత్సవం. ఇది కాముని పండుగ, హోలికా పూర్ణిమ, కామ దహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది. శుద్ధ త్రయోదశి- కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వదినాన శివుడు, మన్మథుడు, కృష్ణుడు, లక్ష్మీదేవి పూజలందుకుంటారు.

ఫాల్గుణమాసంలో ప్రతి తిథికీ ఒక ప్రత్యేకత ఉంది. చవితినాడు ‘సంకట గణేశ’ వ్రతం ఆచరిస్తారు. బహుళ అష్టమినాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది. అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి, సీతారాముల్ని కొలుస్తారు. బహుళ అమావాస్యనాడు పితృదేవతలకు పిండప్రదానం చేసి, అన్నదానం చేస్తారు.





ఫాల్గుణ మాస ప్రాశస్త్యం


పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రయుక్తుడై ఉదయించే మాసం ఫాల్గుణ మాసం. సంవత్సరంలో చివరి మాసం అయినప్పటికీ అధిక ప్రత్యేకతలు కలిగిన మాసం. సంవత్సరంలో మిగిలిన పదకొండు నెలలలో చేసిన పూజలు, పండుగలూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంక్షిప్తరూపం ఈ మాసం.
ఈ మాసాధిపతి గోవిందుడు కావున, ఈ మాసంలో విశేషించి విష్ణుమూర్తి ఆరాధన చేయడం శ్రేయస్కరం. గోః – వేదాలు, గోవులు విందః – రక్షించేవాడు గోవిందుడు, అంటే ఈ సమస్త జీవకోటికీ పూజనీయమైన వేదాలను, గోవులను రక్షించేవాడు అంతేగాకుండా మనలని రక్షించి ఆత్మతత్త్వాన్ని తెలియచేసేవాడు. ఈ మాసంలో అచ్యుత, అనంత, గోవింద అనే నామస్మరణ ఎంతో శుభఫలితాన్ని ఇస్తుంది. వసంతఋతువు ఆగమనానికి ముందు వచ్చే ఈ మాసంలో ప్రతీ దినమూ ప్రత్యేకమే. ఈ మాసంలో ఆచరించే కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు, పర్వ దినాలూ, విశేషమైన రోజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.



ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలు ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకూ పయో వ్రతం ఆచరిస్తారు. భాగవతం అష్టమ స్కందం ప్రకారం, బలిచక్రవర్తి చేతిలో తన కుమారులు ఐన ఇంద్రాది దేవతలు పరాజయం పాలవడం భరించలేని అదితి, కశ్యపుణ్ణి బలి గర్వం అణచే కుమారుణ్ణి ప్రసాదించమని వేడుకొనగా, కశ్యపుడు ఈ పయో వ్రతాన్ని ఆమెకు ఉపదేశించాడు. ఆమె దాన్ని పాటించి వామనుడిని కుమారుడిగా పొందింది. ఈ వ్రతంలో ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలు ద్వాదశి వరకూ లక్ష్మీ నారాయణులని షోడశోపచారాలతో పూజించి, కేవలం వారికి నివేదించిన పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు. ఆ పన్నెండు రోజుల అనంతరం హోమం చేసి, బ్రాహ్మణులను పూజించి సమారాధన చేస్తారు. ఈ రోజులలో గో, వస్త్ర, ధన దానాలు శక్తి కొలదీ చేస్తారు.




ఫాల్గుణ మాసం శుద్ధ విదియ నుండీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.


ఫాల్గుణ శుద్ధ చవితి రోజు వినాయకుడిని పూజించే అవిఘ్నవ్రతం లేదా పుత్రగణపతి వ్రతం చేస్తారు. ఆ రోజున ఉపవాసం ఉండి, సాయంకాలం స్వామిని షోడశోపచారాలతో పూజించి, ప్రసాదం స్వీకరిస్తారు. ఈ వ్రతం చేయడం ద్వారా వారికి ఉన్న ఆటంకాలు తొలగుతాయి మరియు పుత్ర సంతానం కాంక్షిస్తూ చేసేవారికి స్వామి పుత్ర సంతానం ప్రసాదిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి.


ప్రతీ ఏటా తిరుమలలో ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకూ ఐదు రోజుల పాటు స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు. మొదటి రెండు రోజులూ స్వామివారికి శ్రీరాముడు, శ్రీకృష్ణుడి అవతారంలో తెప్పోత్సవం నిర్వహిస్తే తరువాత మూడురోజులూ శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్పస్వామికి నిర్వహిస్తారు.


ఫాల్గుణ శుద్ధ నవమి నాడు మధ్వులు ఆరాధించే రాఘవేంద్ర స్వామి వారి జన్మదినం.



అమలక ఏకాదశి :- ఫాల్గుణ శుద్ధ ఏకాదశిని ఆమలక ఏకాదశి అంటారు. ఆమలక లేదా ధాత్రీ ఫలం గా పిలుచుకునే ఉసిరిని విష్ణుస్వరూపంగా భావించి ఈనాడు ఉసిరివృక్షం క్రింద శ్రీమహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో పూజించిన వారికి విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని ఋషివాక్యం. ఈరోజు ఏకాదశీ వ్రతం ఆచరించి, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభపలితాన్నిస్తుంది.
ఫాల్గుణ శుద్ధ ద్వాదశినే గోవింద ద్వాదశి, నృసింహ ద్వాదశి అంటారు. ఈ నాడు గంగాస్నానం పవిత్రం. కుదరని వారు సమీపం లోని ఏదైనా నది వద్దకు వెళ్లి, గంగను స్మరిస్తూ నదీస్నానం చేయాలి. నృసింహకరావలంబ స్తోత్రంతో కానీ లేక మరేదైనా నృసింహస్వామి స్తోత్రంతో కానీ స్వామిని ఆరాధించాలి.


ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ మహా పూర్ణిమ, హోళికా పూర్ణిమ, డోలా పూర్ణిమ, కామదహనోత్సవంగా వ్యవహరిస్తారు. ఉత్తర భారత దేశంలో హోళికా పూర్ణిమ ప్రధానంగా జరుపుకుంటారు.


దక్షిణ భారత దేశంలో కామదహనోత్సవాన్ని జరుపుతారు. శివకళ్యాణం అనే మహత్తరకార్యం కోసం తపోదీక్షలో ఉన్న శివుని తపస్సుని భంగం చేసిన మన్మధుణ్ణి, తన మూడో నేత్రంతో భస్మం చేసిందీనాడే మరియు మన్మధుని భార్య రతీదేవి కోరిక మేరకు ఆమె కొక్కదానికే అతడు కనిపించేలాగా వరము ఇచ్చాడు శివుడు. మనలో ఉన్న కామక్రోధాదులనే అరిషడ్వర్గాలని దహనం చేసి, ప్రశాంతమైన జీవనం సాగించాలని కోరుతూ, శివుని ప్రార్థిస్తూ చేసే ఉత్సవమే ఈ కామదహనోత్సవం. అంతేగాకుండా రాబోయే వసంతాగమనాన్ని పురస్కరించుకుని కూడా ఉత్సవం చేస్తారు.

    ఈ ఉత్సవం వెనుక ఒక కథ ఉంది. ఒకసారి పార్వతి తన ప్రభావం చేత శివుని కళ్ళు మూతపడేటట్లు చేసింది. శివుని కళ్ళు మూతపడినందు వల్ల జగమంతా అంధకారబంధురమైంది. శివుడు కోపగించు కోవడంతో, అలిగిన పార్వతీదేవి కాంచీపురానికి వచ్చి, తిరిగి శివుని అభిమానాన్ని పొందేందుకు ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించింది.




              ఒకానొక పాల్గుణపూర్ణిమనాడు మామిడి చెట్టు కింద పార్వతీదేవి ప్రాయశ్చిత్త కర్మకాండను పూర్తిచేసింది. అప్పుడు సంతసించిన శివుడు పార్వతిని అనుగ్రహించాడు. అప్పటినుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఫాల్గుణ మాసములో ఈ విధమైన పూజలను, దానాలను చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రవచనం.


ఉత్తర భారతదేశంలో హిరణ్యకశిపుడి చెల్లెలైన హోళిక, విష్ణుభక్తుడైన ప్రహ్లాదుణ్ణి చంపబోయి తానే దగ్ధమైన సంఘటనకి గుర్తుగా, చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకుంటారు. ఆ రోజు సాయంకాలం మంటల్లో హోళికని దగ్ధం చేసే కార్యక్రమం జరిపి మరునాడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ మిఠాయిలు పంచుతూ ఆనందంగా కాలం గడుపుతారు. హోలికా పూర్ణిమ రోజు చందనంతో కూడిన మామిడి పూత (చూత కుసుమ భక్షణం) ను స్వీకరించాలని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి.


ఈ రోజు శ్రీకృష్ణుని ఊయలలో వేసి ఆరాధించే ఉత్సవంగా డోలా పూర్ణిమ చేస్తారు. తమిళనాడులోని మధురైలో మీనాక్షీ సుందరేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు కనుక కళ్యాణ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు మధురైలో అమ్మవారి అయ్యవార్ల కళ్యాణం జరుపుతారు.


ఫాల్గుణ బహుళ విదియనాడు లక్ష్మీదేవి పాలకడలి నుండి ఉద్భవించిందని చెప్పబడింది. ఆరోజు కనకధారా స్తవం చదువుకోవడం సత్ఫలితాలనిస్తుంది.


ఫాల్గుణ బహుళాష్టమి రోజునే సీతాదేవి జనకునికి నాగేటి చాలులో దొరికిందని కావున ఆనాడు సీతాదేవి జన్మదినంగా కూడా జరుపుకుంటారు. ఫాల్గుణ మాసంలోనే రామరావణ యుద్ధం జరిగింది. మహాభారతంలో కూడా అతిరథ మహారథులైన అనేకమంది వీరులు ఫాల్గుణ మాసంలోనే జన్మించారు.


ఫాల్గుణ బహుళ అమావాస్య రోజును కొత్త అమావాస్య అంటారు. ఆ రోజు కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఆ రోజు పితృ దేవతలకి తర్పణాలు ఇస్తారు.
ఇలా ఎన్నో విశిష్టతలను పొందుపరచుకున్న ఫాల్గుణ మాసంలో, భక్తితత్పరతలతో ఆ భగవానుని సేవించి ఆయన కృపకు పాత్రులమగుదము గాక !

ఫాల్గుణ శుద్ధ విదియ – యాదాద్రి లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు – 17-02-2018

ఫాల్గుణ శుద్ధ చవితి – అవిఘ్న వ్రతము/ పుత్ర గణపతి వ్రతము – 19-02-2018

ఫాల్గుణ శుద్ధ నవమి – రాఘవేంద్ర స్వామి జయంతి – 24-02-2018

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి – అమలక ఏకాదశి – 26-02-2018

ఫాల్గుణ శుద్ధ ద్వాదశి – గోవింద ద్వాదశి/నృసింహ ద్వాదశి – 27-02-2018

ఫాల్గుణ శుద్ధ పౌర్ణిమ – హోలికా పూర్ణిమ / డోలా పూర్ణిమ / కామదహనోత్సవం / కళ్యాణ పూర్ణిమ–02-03-2018

ఫాల్గుణ బహుళాష్టమి – సీతా జయంతి – 09-03-2018

ఫాల్గుణ బహుళ అమావాస్య – కొత్త అమావాస్య – 17-03-2018


                   🙏 శుభం భూయాత్ 🙏

✍️ " సాంప్రదాయం "

Friday 16 February 2018

మాఘ పురాణం :- 23 వ అధ్యాయము

 
                             మాఘ పురాణం





23 వ అధ్యాయము  :

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినిపతిః !
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ !!

మహావరాహో గోవిందాః సుషేణః కనకాంగదీ !
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః !!


 నారదుని దౌత్యము - దేవతల దైన్యము :-

గృత్నృమదమహర్షి జహ్నువుతో నిట్లనెను. పారిజాత పుష్పములకై వెళ్లిన యక్షుడింకను రాకపోవుటకు కారణమేమని యింద్రుడుని విచారించెను. పారిజాత పుష్పముపై నున్న యిష్టము అధికమగుటచే తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు దేవతలను గూడ తనతో తీసికొనివచ్చెను. సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి యింద్రుడు దేవతలు మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే స్వర్గమునకు దీసికొని పోదలచిరి. ఆ మహోత్సాహములో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో త్రొక్కిదాటిరి. ఫలితముగా దివ్యశక్తులను గోల్పోయిరి. శక్తివిహీనులైరి, ఇంద్రాదులింకను రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి పారిజాతవృక్షమును పెకలింపదలచ్చిహి యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే వారును శక్తి హీనులై పడియుండిరి.



మరునాటి ఉదయమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచిన యింద్రాదులను జూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును,విచారమును యచెందెను. వారికి నమస్కరించెను. ఇంద్రాది దేవతలారా! మీరు మానవులమైన మాకంటె గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై యిట్టి అకార్యమునేల చేసితిరి. మీరు నాకు తెలియకుండ పుష్పములను దొంగతనముగా తీసికొని పోదలచుట దోషము కాదా? అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమునకాశపడి భూమిపై వ్రాలి యవమానము నందినట్లు మేమును పారిజాత పుష్పముల కాశపడి ధర్మమును తప్పి దొంగలించి యిట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితియేమిటో యెట్టిదో చెప్పుమని యడిగిరి. సత్యజిత్తు వారికేమియు సమాధానమును చెప్పక తన యాశ్రమమునకు పోయెను.




ఇంద్రుడు మొదలగువారు ఆహారము లేక దుఃఖపడుచు నచట పదునొకండు దినములుండిరి. వారికి ఆ కాలమున అమృతాహారము లేదు. కామధేనువు యిచ్చు మధురక్షీరమును లేదు. కల్పవృక్షము, చింతామణి యిచ్చునట్టి పుష్టికరములైన భక్ష్యభోజ్యములును లేవు. మిక్కిలి దీనులై యుండిరి. సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించెను. తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించెను. తానేమి చేయవలెనో దేవతల దుస్థితి తన వలన యేర్పడినది యెట్లు తొలగునో తెలియక దీనులైయున్న దేవతలపై జాలిపడెను. అశరణ శరణ్యుడైన శ్రీహరిని యధాపూర్వకముగ పూజించుచూ తానును,భార్యయు నిరాహారులై యుండిరి. ఈ విధముగా సత్యజిత్తు కూడ పదనొకండు దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక, శ్రీమన్నారాయణుని తలచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడాకాశమున దిరుగుచు దేవతల దురవస్థను గమనించెను. వారికెట్టి సహాయము చేసిన వారి దురవస్థపోవునో అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి యిట్లు స్తుతించెను.

నారదకృత విష్ణుస్తుతి :-

ఆర్తత్రాణపరాయణాయభవతే నారాయణాయాత్మనే
గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయ చేశాయచ ||

మిత్రానేక హిమాంశుపావక మహాభాసాయ సాజ్యప్రదే
శ్రీమత్పంకజపత్ర మేత్ర నిలసత్ కృష్ణాయ తుభ్యం నమః ||

అచ్యుతాయాదిదేవాయ పురాణ పురుషాయచ
సర్వలోక నిధానాయ నమస్తే గరుడ ధ్వజ ||

నమో అనంతాయ హరయ క్షీరసాగరవాసినే
భోగీంద్ర తల్పశయన లక్ష్మ్యాలింగిత విగ్రహ ||

నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన
సర్వేశ సర్వగస్త్యంహి సర్వాధారస్సురేశ్వర ||

సర్వంత్వమేవ వృజసి నత్త్వ రూపస్త్యమవహి
పురుషాపి గుణాధ్యక్ష గుణాతీత స్స్నాతనః ||

పరబ్రహ్మసి విష్ణుస్త్యం బ్రహ్మసి భగవాన్ భవః
సృష్తిస్థితిలయాదీనాం కర్తాత్వం పురుషోత్తమ ||

త్రిగుణోసిగుణాధార స్త్రిమూర్తిస్త్యం త్రయీరమః
ఆ సీత్త్యన్మాయయా సర్వం జగత్ స్థావర జంగమం ||

త్వమేనైకార్ణవేజాతే జగత్యస్మిన్ జగత్పతే
జగత్ సహృత్యసకలం ప్రిత్వా భాబేహనే తు భాసకః ||

త్వమేవ సర్వలోకానాం మాతాత్వం నా పితా విభో
గురుస్త్యం సర్వభూతానాం శిక్షకస్పుదాయకః ||

ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావర జంగమం
ప్రసీదపాలయవిభో నమస్తే సురవల్లభ ||





నారదుని స్తుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరియేమియు నెరుగనివానివలె 'నారదా! స్వాగతము ఇప్పుడెందులకీస్తుతి? నీకేమి కావలయునో చెప్పుము. ఏమి చేసిన నీకు సుఖము అగునో అది యెట్టిదైనను దేవాదురులు సాధింపజాలనిదైనను నీకు సమకూర్చెదను చెప్పుమని యడిగెను. నారదుడును తలవంచి ఇంద్రాదులు చెడుపనిని చేసి ఆపదపాలైరి. భూమియందు పారిజాతమును వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాని యందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతి దినము దొంగలించుచుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి యిష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై యింద్రుడు దేవతలతో బాటు వెళ్లి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడుతవలె దేవతా గణముతో పడియున్నాడు. అమృతాహారులైన యింద్రాది దేవతలు పదునొకండు దినముల నుండి నిరాహారులై దీనులై పడియున్నారు. భగవాన్ శ్రీమన్నారాయణ మూర్తీ! నీవిప్పుడు వారిని దయయుంచి రక్షింపవలయునని నారదుడు కోరెను.

నారదుని మాటలను విని శ్రీహరి 'నారదా! :-

అమృతకలశము నుండి తొణికి పడిన రెండు బిందువుల అమృతమే పారిజాత వృక్షముగను, తులసిగను అయినది. అనగా ఆ రెండును అమృతము నుండి పుట్టినవి. రెండు మిక్కిలి పవిత్రములు, సత్యజిత్తనువాడు ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అదియొక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను, తులసి దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండెను, ఇట్టి యుత్తమునికి దీనులకును జీవనాధారమగు పుష్పసంపదను త్రిలోకాధిపతియగు నింద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరకాదీనుడగు సత్యజిత్తు నన్నర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో జల్లగా భోగలాలనుడగు ఇంద్రుడు నా నిర్మాల్యమును గూడ దాటెను త్రొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపతియగు ఇంద్రుడు వాని యనుచరులు శక్తిహీనులై తోటలో పడి యున్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును తెలిసికాని, తెలియకకాని దాటిన, తొక్కిన యెంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు యింద్రాదుల దైన్యమునకు బాధపడుచు నేమి చేయవలెనో తెలియక తానును భార్యతో బాటు నిరాహారుడై నన్నర్చించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు పదనొకండు దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారిని జూచి భార్యతోబాటు నిరాహారుడై యుండెను. దేవతల పుష్తికై నన్ను ప్రతిదినము అర్చించుచునే యునాడు. నేడు పదకొండవ దినము అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు నేడు కూడ ఉపవాసముండి నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు జాగరణమొనర్చినచో నేను ప్రసన్నుడై అతడేది కోరినను వెంటనే యిచ్చెదను. అతడే కాదు యెవరైనను ఏకాదశి నాడు ఉపవాసముండి
 జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికిని కోరిన దానినిచ్చెదను అని విష్ణువు సమాధానము ' నిచ్చెను. నారదుడును యేమియును మాటలాడలేక తన దారిన బోయెను అని గృత్నృమదమహాముని జహ్నువునకు చెప్పెను.



            🙏 ఓం శ్రీ అనంతపద్మనాభాయ నమః 🙏


✍️ " సాంప్రదాయం "

Thursday 8 February 2018

మాఘ పురాణం :- 22 వ అధ్యాయము


                               
                                  మాఘ పురాణం


22 వ అధ్యాయము :-

ఉద్భవ స్సుందర స్సున్దో రత్ననాభ స్సులోచనః !
అర్కో వాజసని శ్శ్రంగీ జయన్తః సర్వవిజ్జయీ !!

సువర్ణ బిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః !
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః !!

   క్షీరసాగరమధనము : -

గృత్నృమదమహాముని జహ్నుమునితో నిట్లనెను. జహ్నుమునివర్యా! వినుము, అశ్వమేధయాగము చేసినవాడును, ఏకాదశివ్రత నియమమును పాటించినవాడును, మాఘమాసవ్రతము నాచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధయాగము చేసిన వచ్చునట్టి పుణ్య ఫలమునంది తుదకు మోక్షమును గూడ పొందును. స్వర్గాధిపతియై యింద్ర పదవినందును. మాఘ ద్వాదశినాడు బ్రాహ్మణులతో గలసి పారాయణ చేయువాడు, అన్నదానము చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను.

జహ్నుముని గృత్నృమదమహాముని!  



తిధులనేకములుండగా ఏకాదశి అన్నిటికంటె శుభప్రదమైనది యెట్లయ్యెను? అనేకాశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశీ వ్రతమొక్కటే యిచ్చుటయేమి? ఎవరైనను యిట్లు చేసి యింతటి పుణ్యమునందిరా చెప్పుము అని అడిగెను. గృత్నృమదమహాముని యిట్లనెను. పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను, సంపదలను, పుత్రపౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రతకథను చెప్పెదను వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగను, సర్పరాజువాసుకిని కవ్వపు త్రాడును చేసి క్షీర సముద్రమును మధించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు మూడువరుసలుగ జుట్టి దేవతొలొక వైపునను రాక్షసులు మరియొక వైపునను పట్టితిరి.
వారిట్లు సముద్రమును మధించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణువామెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైశ్శ్రవమను అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృతకలశము మున్నగునవి సముద్రమునుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని ఇంద్రునకిచ్చెను. దేవదానవులు మరల సముద్రమును మధించిరి. అప్పుడు దేవతలు, రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరువద్దకు పోయి నమస్కరించి యిట్లు స్తుతించిరి.

దేవదానవులు చేసిన శివస్తుతి :-

నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే |
నమోగిరాం విదూరాయ నమస్తే గిరి ధన్వవే ||

నమశ్శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ |
నమోనిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే ||

త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక |
త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే ||

త్రయీధర్మైకసాధ్యాయ త్రిరూపాయోరురూపిణే |
అరూపాయ సరూపాయ వేదవేద్యాయతే నమః ||

హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే |
మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల ||

పాహ్యస్మాన్ కృపాయాశంభో విషాత్ వైస్వానరోసమాత్ ||


అని భయపీడితులైన దేవదానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడా విషమును మ్రింగి తన కంఠమును నిలిపెను. నల్లని విషము కంఠమున నిలువుటచే శివుని కంఠము నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడను పేరు అప్పటినుండి యేర్పడినది. విషభయము తొలగిపోవుటచే నిశ్చంతులైన దేవ దానవులు సముద్రమును, ధనమును మాని అమృతపాత్రను స్వాధీనము చేసికొనవలయునని యత్నించిరి, ఒకరికి దక్కకుండ మరియొకరు అపహరింపవలెనని యత్నించిరి. ఏ
ఆ విధముగా తీవ్రమైన గగ్గోలు యేర్పడినది.

మాయావియగు శ్రీమహావిష్ణువు మోహిని రూపము నందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను. మనోహరములగు నామె స్తనములు, జఘణములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వువలె నుండెను. నేత్రములు మనోహరములై విశాలములైయుండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగవంటి శరీరము కలిగి సర్వాభరణభూషితయై పచ్చని పట్టుచీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికముగ సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారాయని మధురస్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులామె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి.



ఆమె దేవదానవులను జూచి దేవతలారా, దానవులారా నేను మీ దేవదానవుల రెండు వర్గములకు మధ్యవర్తినైయుండి యీ అమృతకలశములోని అమృతమును మీ రెండు వర్గముల వారికిని సమానముగ పంచెదను.దేవతల వర్గమొక వైపునను, రాక్షసుల వర్గము మరియొకవైపునను కూర్చుండిరి. ఈమె యెవరో తెలియదు కనుక పక్షపాతము లేకుండ అమృతమును సమానముగ పంచునని తలచెను.

అందరిని మోహవ్యాప్త పరచుచున్న ఆ జగన్మోహిని అమృతపాత్రను చేత బట్టెను. ఆమె ఆ అమృతపాత్రను రెండు భాగములు చేసెను. ఒకవైపున అమృతమును మరియొకవైపున సురను(కల్లు) ఉంచెను. రాక్షసులున్నవైపున కల్లును, దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచునెవరికిని అనుమానము రాకుండ అటునిటు దిరుగుచునుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి చెవులకింపుగ ధ్వనించుచున్న పాదములయెందెల రవళితోను, హస్తకంకణముల సుమధుర నాదములతోను, ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగ మనోహర, మధురముగ దిరుగుచు అమృతమును దేవతలకును, సురను దానవులకును కొసరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రలుగ చేసి కొన్నవారై త్రాగుచుండిరి.

రాహుకేతువుల వివరణ :-

రాక్షసులపంక్తిలో కూర్చున్న యిద్దరికి దేవతల ముఖముల యందు అమృతపానముచే కళాకాంతులు తేజస్సువర్చస్సు పెరుగుట తమవారందరును సముద్ర మధనజనిత శ్రమనింకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపడిరి. అనుమానము వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతలవరుసలో కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలనుకొని వారి చేతులయందు అమృతమును గరిటతో పోసెను. రాక్షసులు ఆత్రముగ దానిని త్రాగుటతో ఆమెకు అనుమానము వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహినీ రూపముననున్న జగన్మోహనుడు తననే వంచించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించెను. వారు తాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు కాని కంఠము దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలోనుండిరి. చంద్రుదు మొదలగువారు త్వరత్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిసెను. తన వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగనే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలోనుండిరి. వారి శ్రమయంతయు యిట్లు అయ్యెనని విచారము దుఃఖమునొంది హాహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులలో నిద్దరు తమను మోసగించి అమృతమును త్రాగిరని గగ్గోలు పడిరి. దానవులు కకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యెను.



చక్రముచే నరుకబడి చావుబ్రతుకు లేని అయోమయ స్థితిలోనున్న రాక్షసులు కేశవా చావును బ్రతుకును కాని యీస్థితి మాకు దర్భరముగనున్నది. మాగతియేమి మాకాహారమేదియని దీనముగ శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతోగాని, అమావాస్యతోగాని కల సంధికాలములయందు సూర్యుని, చంద్రుని భక్షింపుడు అదియే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి.

ఇంద్రుడు మొదలగు దేవతలు అమృతకలశమును తీసికొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి. సముద్రతీరమున అమృత కలశముంచినప్పుడు రెండు అమృతబిందువులు నేలపై బడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగను మరియొక బిందువు తులసి మొక్కగను అయినది. కొంత కాలము గడిచెను. సత్యజిత్తను సూద్రుడొకడా మొక్కలకు నీరు పోసి కుదుళ్ళు కట్టి ఆ రెండిటిని సంరక్షించెను. ఆ రెండు మొక్కలున్నచోట మనోహరమైన పూలతోటగామారెను. సత్యజిత్తు సంరక్షణ వాటికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరుపోసి పెంచుచూ పారిజాతపుష్పములను తులసీదళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్పసమృద్ధమై నయనానందకరముగ నుండెను. తులసి కోమలములైన దళములతో అందముగ నుండెను.




ఇంద్రుడొకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకీయవలయునని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు దీసికొని వెళ్ళెను. శచీదేవిమున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహరములగు యీ పుష్పములు మాకు నిత్యము కావలయునని కోరిరి. ఇంద్రుడును గుహ్యకుని(యక్షుని) పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్షయజమాని నడుగ కుండ వానికి తెలియకుండ దొంగతనముగ తెప్పించుచుండెను.

పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదలచెను. తోటలో రాత్రియందు దాగియుండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొనయత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండ ఆకాశమున కెగిరిపోయెను. సత్యజిత్తు యెంత ప్రయత్నించినను వానిని పట్టుకొనుట సాధ్యముకాకుండెను. దేవేంద్రుడును 'నీవు యక్షుడవు, ఆకాశగమన శక్తికలవాడవు. మానవులకు దొరకవు. కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెను. పుష్పములు ప్రతిదినము పోవుచునే యున్నవి. సత్యజిత్తునకేమి చేయవలెనో తోచలేదు. పుష్పచోరుని ఉపాయముచే పట్టుకొనవలెనని తలచెను. శ్రీహరి పూజా నిర్మాల్యమును తెచ్చి పూలతోటకు వెలుపల లోపల అంతటను చల్లెను.

యక్షుడు యధాపూర్వముగ పారిజాతపుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడా పూలను కోయుచు శ్రీహరి పూజా నిర్మాల్యమును త్రొక్కెను. పుష్పములను కోయపోవుచు శ్రీమనన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితముగ వాని దివ్యశక్తులతో బాటు ఆకాశగమన శక్తియు నశించెను. నేలపై గూడ సరిగా నడువలేక కుంటుచుండెను. యక్షుడును యెంత ప్రయత్నించినను అచటినుండి పోలేకపోయెను జరిగినదానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని 'ఓరీ నీవెవరవు ఎవరు నిన్ను పంపిరి, మా పుష్పములను ప్రతిదినము యెందుకని అపహరించుచుంటివని చెప్పమని గర్జించెనూ నేను యక్షుడను ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పముల నపహరించి ఇంద్రునకు ఇచ్చుచుంటిని. ఇంద్రుని యాజ్ఞచేత నిట్లు చేసితిని. కాని బుధ్ధిసాలివైన నీకు చిక్కితిని అని పలికెను. సత్యజిత్తు యేమియు మాటలాడక యింటికి పోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు మూడు దినముల బందీ అయి ఆ తోటలో నుండెను.

         🙏 ఓం శ్రీ మన్నారాయణాయ నమః 🙏


✍️ " సాంప్రదాయం "

Wednesday 7 February 2018

మాఘ పురాణం :- 21 వ అధ్యాయము

   

మాఘపురాణం



21 వ అధ్యాయము :-

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః !
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః !!

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమ క్రమః !
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ !!


శ్రీమహావిష్ణువు చేసిన శివ ప్రశంస ,శివస్తుతి - నారదమహార్షి శివస్తుతి :-

గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లనెను. మరియు విష్ణువు శివుని జూచి యిట్లనెను. శంకరా! నీవు నాతో సమానుడవు. మన యిద్దరికిని భేదము లేదు. నావలెనే సర్వ పూజ్యుడవు. సర్వవ్యాపకుడవు, సర్వోత్తముడవు, సర్వవ్యాపివి, సర్వాత్మకుడవు సుమాయని యిట్లు స్తుతించెను.



విష్ణుకృత శివస్తుతి :-

శంభో భవానర్కహిమాంశు నహ్నివేత్రత్రయస్తే ఖిలలోక కర్తా |
తధాసమస్తామర పూజితాంఘ్రీః సంసేవ్యమానస్పురయోగిబందైః ||

వచాస్తికించిత్తవ మిత్ర భేదస్తే హంచ్వహం త్వం సురనాధసత్యం |
వేదాంద వేద ప్రముఖా నిశం ర్వాంసన్యాసినస్వృర్గ విముక్తి హేతుం |
వదంతి తద్వత్ సుభజంతిశంభో ప్రయాంతి ముక్తించ తివ ప్రసదం ||

సర్వభేదవినిర్ముక్తః సర్వభేదాశ్రయోభవాన్ |
త్వంత్వరిష్ఠాయలోకేస్మిన్ మహాదేవో మహేశ్వరః ||

త్వమేవ పరమానందస్త్వమే వాభయదాయకః |
త్వమక్గరం పరంబ్రహ్మ త్వమేవహినిరంజనః ||

శివస్స్ర్వగతః సూక్ష్మః ప్రబ్రహ్మవిదామసి |
ఋషీణాంచ వశిష్ఠస్త్వం వ్యాసోవేదనిదామసి ||

సాంఖ్యానాంకపిలోదేవః రుద్రాణామపి శంకరః |
ఆదిత్యానాముపేంద్రప్త్యం వసూనాం చ హిపొవకః ||

వేదానాంసామవేదస్త్యం సావిత్రి చందసామపి |
ఆధ్యాత్మ విద్యావిద్యానాం గతీనాం పరమాగతిః ||

మాయాత్వం సర్వశక్తీనాం కాలకలయతామపి |
ఓంకారస్సర్వగుహ్యానాం వర్ణానాం చ ద్విజోత్తమః ||

ఆశ్రమాణాం చ గార్హ్యస్థ్యం ఏశ్వరాణాం మహేశ్వరః|
పుంసాంత్వమేకుపురుషః సర్వభూతహృదిస్థితః ||

సర్వోపనిషదాంచేవ గుహ్యోపనిషదుచ్యతే |
కల్పానాంచమహాకల్పః యుగానాంకృత మేవచ
ఆదిత్యః సర్వమారాణాం వాచాందేవి సరస్వతీ ||

ర్వం లక్ష్మీశ్చారురూపాణాం విష్ణుర్మాయావినామసి |
సూక్తాణాం పౌరుషంసూక్తం బ్రహ్మసిబ్రహ్మవేదినాం ||

సావిత్రీచాసి జాహ్యిరాం యజుషాం శతరుద్రీయః |
పర్వతానాం మహామేరుః అనంతోయోగినామపి ||

సర్వేషాం పరబ్రహ్మచ్వన్మయం సర్వమేనహి |
యరైవాహం త్వంహి సర్వముఖ్యోషు శంకర ||


శంకరా! నీకు,నాకును భేదమే లేదు. వేదాంతవేత్తలకిది స్పష్టముగ తెలియును. నేను నారదునకు నీ మహిమను చెప్పగా నతడు నీయనుగ్రహమునకై తపమాచరించెను. నిన్ను దర్శింపనొందెను. నీవాతనిని ననుగ్రహించితివి. అతడు నిన్నెట్లు స్తుతించెనో గుర్తున్నదా? మరల స్మరింపుము.



నారదమహర్షి శివ స్తుతి :-

కూపంతనాశేష కధాభిగుప్తం అగోచరం నిర్మలమేకరూపం |
అనాదిమధ్యాంత మనంతమాద్యం నమామి దేవంతమనః పరస్తాత్ ||

ర్వాందేకపస్యంతి జగతృసూతిం వేదాంత సునిశ్చితార్థాః |
ఆనందమాత్రం ప్రణనాభిధానం చతేవరూపం శరణం ప్రపధ్యే ||

ఆశేషభూతాంతర సన్నివిష్టం ప్రభావతాయోని వియోగహేతుం |
తేజోమయం జన్మవినాశహీనం ప్రాణాభిధానం ప్రణతోస్మిరూపం ||

ఆద్యంత హీనం జగదాత్మభూతం విభిన్న సంస్థం ప్రకృతేపరస్తాత్ |
కూటస్థమవ్యక్తవపు స్తదైవ నమామిరూపం పురుషాభిదానం ||

సర్వాశ్రయం సర్వజగద్విధానం సర్వతనం సర్వతమ ప్రవిష్టం |
సూక్ష్మంవిచిత్రం త్రిగుణం ప్రసన్నం నతోస్మిలే రూపములుస్త భేధం ||

ఆద్యం మహత్త్వే పురుషార్త్మరూపం ప్రకృత్యవస్థం త్రిగుణాత్మబీజం |
ఐశ్వర్య విజ్ఞాన విరాగధర్మైస్పమన్వితం దేవనతోస్మిరూపం ||

ద్వీసప్తలోకాత్మకమంబు సంస్థం విచిత్ర భేదం పురుషైకరాధం|
అనంత భూతైరధివాసితంతే వతోస్మ్యహం తజ్జ గదంద స్థంస్థం ||

అశేష దేవాత్మక మేకమాద్యం స్వతేజసారూపితలోక భేదం |
త్రికాలహేతుం పరమార్జరూపం నమామ్యహం త్వాం రవి మండలస్థం ||

సహస్రమూర్థానమనంత శక్తీం సహస్రబాహుం పురుషం పురాణం |
శయానమంతస్పంలే తదైవ నారాయణాఖ్యం ప్రణతోస్మినిత్యం ||

దంష్ట్రాకరాళం త్రిదశాదినంద్యం యుగాంత కాలావల కాలరూపం |
అశేషరూపాండ వినాశహేతుం నమామి రూపం తవకాల సంజ్ఞం ||

ఫణా సహస్రేణ విరాజమానం భోగీంద్రముఖ్యైరభీ పూజ్యమానం |
జనార్దన ప్రీతి మహత్కరం త్వాం సతోస్మిరూపంతవ శేష సంజ్ఞం ||

అన్యాహతైస్వర్యమయుగ్మ నేత్రం బ్రహ్మమృతానంద రవజ్ఞమేకం |
యుగాంతశేషం దివిసృత్యమానం నతోస్మ్యహంత్వామె తిరుద్ర సంజ్ఞం ||

ప్రక్షీణశోకం విమలం పవిత్రం సురాసురైర్చిత పాదయుగ్మం |
మకోమలం హింద్ర సుశుభ్రదేవాం నమామ్యహాం త్వామఖిలాభినాధం ||

చతుర్భుజం శూలమృగాగ్నిపాణీం ప్రయత్నతో భక్తవర ప్రదానం |
వృషధ్వజం త్వాం గిరిజారదేహం వతోస్మ్యహందేవ కృపాకరేశం ||


శంకరా! నారదుడు చేసిన అమోఘమైన యీ స్తుతిని విని నీవు మిక్కిలి సంతోషించితివి. మునులందరు స్తోత్రమును చదువుచు నిన్ను సేవించిరి కదా. కావున నీకును, నాకును, బ్రహ్మకును భేదము లేదు. మనకు భేదమున్నదని తల్చు మూఢులు నరకమున బడుదురు సుమా అని శ్రీమన్నారాయణుడంతర్థానము నందెను.

జహ్నుమునీ! విష్ణు ఏ విధముగ రజస్తమోగుణ భేదము వలన వివాదపడిన బ్రహ్మను, శివుని శాంతపరచి లోకములకి వినయముగ నీ విధముగ తెలిపెను. వస్తుతః ముగ్గురికి భేదములేకున్నను భేదమున్నదని తలచివాదించు, అహంకార పండితులకొరకీ సంఘటన జరిగినది. మాఘమాసవ్రతము నాచరించు వారి విషయమును తప్పక గ్రహింపవలయును. అజ్ఞానముచే నాలోచించి దోషమునకు ఓడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులై ముక్తినందవలెను. అజ్ఞానులు మాఘమాసవ్రతము నాచరించి జ్ఞానులై యిహపరముల యందు సుఖింపవలయును సుమా వృధాపదములు బుద్ధిహీనులకే గాని బుద్ధిమంతులకుగాదని తెలుపుటకే యీ సంఘటన జరిగినది లెనిచో సర్వాధికులు,సర్వాధారులు, సర్వోత్తములునగు త్రిమూర్తులకు కలహమేమి యెక్కువ తక్కువలేమి? మూర్ఖుడైనను భక్తితో మాఘమాసవ్రతము నాచరించిన జ్ఞానియై సుఖించును.

అహంకారము దుఃఖమును కలిగించునని అది త్రిమూర్తులంతటి వారికైనను తప్పదని దీని భావము. గర్వమని అశక్తుడైన వాని నాక్షేపింతురు. సర్వసమర్థుడైన వానికేది అయినను వానిశక్తికి లోబడినదే. పరమాత్మకు అహంకారమెట్లుండును ఉండదు. ఏదియును అయనను మించినది లేదుకదా. జ్ఞానము కలుగవలెనని భగవంతుడే యిట్టి సంఘటన నేర్పరచి మనవంటి మూఢులకు అహంకూడదని తెలిపెను. కావున గర్వమును, సిగ్గును, అభిమానమును విడిచి బుద్ధిమంతుడు మాఘమాసవ్రతము నాచరించి విష్ణుకథలను విని తరింపవలెను. యధాశక్తి దానములాచరించి సాటివారియందు ప్రేమనుచూపుచు సర్వాత్మకుని దయా విశేషము నందవలయును అని గృత్నృమదమహర్షి జహ్నుమునికి మాఘమాస మహత్త్యమును భగన్మహిమను బోధించెను.


       🙏 ఓం శ్రీ శివ కేశవాయ నమః 🙏

✍️ " సాంప్రదాయం "

Tuesday 6 February 2018

మాఘ పురాణం :- 20 వ అధ్యాయము


                             మాఘ పురాణం





 20వ అధ్యాయము :-

చతుర్మూర్తి శ్చతుర్భాహుః చతుర్వ్యూహః చతుర్గతిః !
చతురాత్మా చతుర్భావః చతుర్వేదవిదేకపాత్ !!

సమావర్తో నివృతాత్మా దుర్జయో దురతిక్రమః !
దుర్లభో దుర్గమో దుర్గో దురావాపోదురారిహా !!


శివ బ్రహ్మల వివాదము  :-

గృత్నృమద మహర్షి మరల యిట్లు పలికెను. శ్రీమహవిష్ణువు తత్త్వమును మహత్త్యమును వివరించు మరియొక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరు ఒకప్పుడు యెవరికివారు తానే ప్రధానుడనని యనుకొనిరి. సర్వలోకకర్తను, దేవతల కిష్తుడైన యధిపతిని నేనే మరియొకరు నాకంటే ఉత్తములు లేరని యెవరికి వారే తలచిరి. ఎంతకాలము గడచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడచుచునేయున్నది వివాదము పెరుగుచునేయున్నది.

ఇట్లుండగా వారి యెదుటనొక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యులకాంతి కలిగి తేజోమయమై యుండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమైయుండెను. దివ్యము మనోహరము అనంతమునగు ఆ రూపము శ్రీమహవిష్ణు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందేవారు చూచిరి. బ్రహ్మ, శివుడు ఆ రూపము చెవులలోనుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును జూచి శివబ్రహ్మలిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడదలచిరి. ఆ రూపము యొక్క ఆద్యంతములు నెరిగిన వారే తమ యిద్దరిలో నుత్తములని తలచిరి, ప్రయాణమైరి, నాలుగుదిక్కుల క్రిందను, పైనను చిరకాలము సంచరించిరి. ఆరూపమును మొదలునుగాని, చివరనుగాని చూదలేకపోయిరి, తాము ఇద్దరమును దానిని కనుగొనుటకు అశక్తులమని గమనించిరి. అప్పుడారూపము నిట్లు తలచిరి.

ఈ పురుషుడే జగత్కర సృష్టిస్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు. గుణాధికుదు. గురువు రక్షించువాడు సర్వేశ్వరుడు, స్వయంప్రకాశుడు, సర్వప్రాణులయందు నివసించువాడు, సర్వప్రాణులను తనయందే నిలుపుకొనువాడు, మనము వీనికంటె అధికులముకాము. మన వలన నేమియు జరుగుట లేదు. ఇట్టి యధార్థ పరిజ్ఞానము కలిగి శ్రీమహావిష్ణువు నిట్లు స్తుతించిరి.

    బ్రహ్మ శివకృత విష్ణు స్తుతి :-

అనంతమూర్తీ! సర్వాద్యమూ, సర్వాధారమూ, అనంత ప్రకాశమూ సర్వమనోహరమూ అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్సమనట్లు చేయుము. సర్వాత్మకా! సర్వేశ్వరా! సర్వప్రాణి నమస్కృతా!  అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు నీ తేజమనంతము, నీవందరికిని అన్నిటికిని యిచ్చువాడవు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్తరూపుడవు అనుచునిట్లనిరి.

హేవిషోవంతమూర్తే తవఘవ విఖిలాకారమాద్య స్వరూపం|
సర్వాధారం సురేశందినపతి హత భుక్కోటి సూర్యప్రకాశం ||

అవాభ్యమత్రి దృష్టం సకలముని మనోవాసమబ్జాయతాక్షం |
చిమ్రావేం స్వాత్మశక్త్యాకురు నిఖిలగురో సర్వరూపంత్విదానం ||

నమస్తే విశ్వాత్మన్ విధిహరసురేంద్రాది విబురై |
త్రయీ శాత్త్రాలాపైః విగదితన వ్యాంఘ్ర్యంబుజయుగం ||

పరంమత్రంయంత్రం పరమపద బీజం జ్వలతియః |
ససాక్షాత్పారూప్యం వ్రజతి తవదేవేశసతతం ||

త్రిలోక కర్తా భివదస్యభర్తా హరే మహద్రూపమనేక తేజాః |
గురుర్గుర్ణాం నరదోవరాణాం మహార్ణవాంబూపల జస్త్వమేర ||

త్రిదేవ దేవాసుర రాజయష్ట శిష్టేష్ట తుష్ట త్రిదివే వినిష్ట |
దృష్టామృతాస్వాద్యమిరాశు పాణిః సురాసురాణామఖిలేశ్వరరస్త్వం ||

లక్ష్మీపతి స్త్వంతు సుగుహ్యగోప్తా గుహాశయః పంకజ పత్రనేత్ర |
త్వంపంచ వక్త్రశ్చ చతుర్ముఖశ్చ చరాచరేశో భగవన్నమస్తేః ||


సృష్టించ విశాలాం సృజసిత్వమేవ చైశ్వర్యవాన్ సర్వగుణశ్చదేవ |
త్వమేవ భూర్భూరికృత ప్రవేశః తధాద్య భూతం విదధాసియత్తత్ ||

త్వమగ్ని సూర్యౌ పవనస్త్యమేవ యమోభవాన్ వైశ్రవణస్త్వమేవ |
త్వమేవశక్ర స్పురలోకనాధః నాధాబిమస్త్వం భగవన్ నమస్తే ||

పరమం పరాణాం పరమంపవిత్రం పురాణ కర్తారమనం తమాశ్రయం |
త్వాం వేదమోహుః కవయః సుబుద్ద్వా నమోస్తుతే పన్నగవైరి కేతో ||

వేదాశ్చవేద్యశ్చ దిగంతరాళం యష్ఠాసురసానమపి త్వమేవ |
కర్మాణ్యనంతాని సుఖప్రదాని ఋదశ్చవాతో నిగమాశ్చసర్వే ||

నదీషు గంగాహిమవాన్ నగేషు మృగేషు సింహో భుజగోష్వంతః |
రత్నేషు వజ్రంజలజేషు చంద్రః క్షీరోదధశ్చాపి యధాతథాత్వం ||

అహం ప్రభు స్తద్వరహం ప్రభుశ్చ సంస్పర్ద మానౌ బహువర్ణానాం |
తస్నాదదావీం పరిహర్తు మేవం స్వయం ప్రభుస్త్యం కరుణైకరాసి ||

తేనాత్రతే దర్శనబుద్ది రాసీత్ కృపాలో భగవన్నమస్తే |
తూర్ణం జగనాథ మహత్స్వరూపం భూత్వాపున స్చామ్య వపుఃప్రసీద ||

ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీమహా విష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారికిట్లనెను. బ్రహ్మేశ్వరులారా! మీరిద్దరును చిరకాలము వివాదపడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను యిట్టి విరాట్రూపమును ప్రదర్శించితిని. మీరును నా విరాట్ రూపమును గమనింప నశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంతబుద్దులై నన్ను స్తుతించిరి. మీ వివాదమునకు కారణమును నేనెరుగుదును. ఆ వివాదము నెవరును పరిష్కరింపలేరు. సత్వరజస్తమోగుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడినవారికి యదార్థము తెలియదు. స్త్త్వగుణము నిర్మలము స్వయంప్రకాశకము అనామయము. సుఖసంగముచే దేహినిబంధించును. పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై ఆశక్తిచే ప్రబలమగును. జీవికి కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూపజ్ఞానమును కప్పి, యిహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనులయందు ప్రవర్తింపజేయును. తమోగుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీని వలన ప్రమాదము కలుగును. ప్రమాదమనగా చేయవలసినదానిని మరచుట ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్దసరిగా లేకపోవుట, శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగును. నిద్రయనగా నీ యజ్ఞానముచే, చేయవలసిన దానిని వీడి నిద్రించుట, కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జీవితములు జీవగుణ త్రయబద్దుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొందితిని. దీనిని పొందగలను, నేను చేయగలను నాకెవరును సాటి ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమోగుణముల ప్రభావము.

మీకును యీగుణ ప్రభావము వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదట నంతయు చీకటిగ నుండినది పంచభూతములప్పటి కేర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలెనుంటిని. తరువాత నవయవము లేర్పడినవి. తరువాత మన ముగ్గురము యేర్పడితిమి. మనము ముగ్గురము సృష్టిస్థితిలయములకు కర్తలమైతిమి. బ్రహ్మసృష్టికర్తగను, నేను పోషకునిగను, శివుదు లయకర్తగను మనము ముగ్గురము అయితిమి. కావున ఒకే దానినుండి వచ్చిన మనకు మొదట భేదములేదుకదా!

అని బ్రహ్మకు శివునికి శ్రీమహావిష్ణువు తత్త్వమును స్మృతికి తెచ్చెను, మరియు బ్రహ్మతో నిట్లనెను, బ్రహ్మ! నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు. సర్వప్రాణులను సృషించినవాడవు. దేవతలకు ప్రభువువు. వేదములకు స్థానము అన్ని యజ్ఞములకును అధిపతిని. సర్వలోకములకు సంపదనిచ్చువాడవు. స్వశక్తితోడనే పరమాత్మయోగమునందినవాడవు. సర్వ రక్షకుడవు. నా నాభి కమలమందు బాలార్కునివలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు, ఏకత్వములో నున్న నేనే అనేకత్వము నందితిని.మనమిద్ధరమొకటే. నీవును నా వలెనే సమస్త దేవతలకు పూజనీయుడవు. అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగ తత్త్వమును బోధించెను. అని గృద్నృమదమహర్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను.


     🙏 ఓం శ్రీ లక్ష్మీవల్లభాయ నమః 🙏


✍️ " సాంప్రదాయం "

మాఘ పురాణం :- 19 వ అధ్యాయము


                                   మాఘ పురాణం


 19వ అధ్యాయము :-

ఆర్తావిషణ్ణాశ్శిథిలాశ్చభీతాః ఘోరేషుచవ్యాధిషువర్తమానాః !
సంకీర్త్యనారాయణశబ్దమాత్రం విముక్తదుఃఖాఃసుఖినోభవన్తి !!

యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ !
తత్సర్వం క్షమ్యతాం దేవ! నారాయణ! నమోస్తుతే !!



మునుల వాగ్వాదము :-

గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లు పలికెను. ఓయీ వినుము గోమతీ నదీ తీరమున పవిత్రమైన నైమిశారణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్షగుల్మము లెన్నియోయున్నవి. అచట నుత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసికొనుచుండిరి. జ్ఞానము, వైరాగ్యము, యింద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువయనగ నేనేయక్కువయను వివాదము కలిగెను. భృగుమహర్షి, నేను తపోనిష్టుడను యోగీశ్వరుడను నన్ను మించిన వారెవరున్నారని యనెను. గౌతముడును నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పము పూర్తియగు వరకు తపమును చేసినవాడను. నేనే గొప్పవాడనని పలికెను. లోమశుడను ముని నాకు సమానుడు లేడు. నేను మునులకు గురువునని ప్రకటించెను. గార్గ్యుడను ముని సభలో నిలబడి వేదశాస్త్రాదులన్నియు నాకు వచ్చును. కావున నేనే ఉత్తముడనని యనెను. మాండవ్యుడు నేను కర్మలను యేమరకుండ యధాకాలముగ చేయుదును. నిత్కర్మలనాచరింతును, అన్ని శాస్త్రములను చదివినవాడను నాకంటె ఉత్తముడెవడని గర్జించెను. శంతనుడను ముని నేను యోగాభ్యాసము చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రతకలవాడను నన్ను మించిన వాడెవడు లేడని పలికెను. పాలస్త్యుడను ముని లేచి, నేను వేదములు, శాస్త్రములు అన్నియు నేర్చినవాడను. పెద్దలు కూడ నన్నే గౌరవింతురు. కావున నేనే అధికుడననియనెను. శౌనకుడును ఆత్మనేత్తలలో నేను మొదటివాడను, నాకంటె పూజ్యులెవరును లేరనెను. ఆ మునివరులు తమ గొప్ప ధనమును బిగ్గరగా యెవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్లు బిగించి కొట్టిరి. ఒకరినొకరు ధూషించుకొనుచు, కొట్టు కొనుచు వారి దండములను, ఛత్రములను లాగుచు కోలాహలమును పెంచిరి.

ఇట్లు వారు పరస్పరము వివదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను, కలహించుకొనుచున్నవారిని మరింత ఉద్రేకపరచెను. వైకుంఠమును చేరి శ్రీహరికి యీ విషయమును విన్నవించెను. శ్రీహరియు 'నారదా! ఆ మునులు జ్ఞానులైనను నామాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదము ఉపాయముచే ఉపశమింపజేయవలెను. నాకిష్టులైన సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురును యెల్లప్పుడును అయిదు సంవత్సరములవారుగనే యుందురు. వీరి బాల్యమున చతుర్యుగములెన్నియో మార్లు గడచినవి. వీరితో బాటు వృద్ధుడు, బుద్ధిశాలియగు మార్కండేయుని గూడ పంపుదును. అతదు సప్తమహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారదా నీవును అచటకు పోయి చూడుము అని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని జూచి వివాదపదుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును వారినందరిని కుశల ప్రశ్నాధికముతో శంతపరచెను. ఇట్లు కొంతకాలము గడచెను.

కొంతకాలము గడచిన తరువాత బ్రహ్మజ్ఞానులగు సనక సనందాది మునులు నలుగురును అచటకు శ్రీహరిని కీర్తించుచు వచ్చిరి. మార్కండేయ మహర్షియు వారిని జూచి యెదురువెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాధ్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని తన తలపై జల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయుని జూచి సనకాది మునులాశ్చర్య పడి యిట్లనిరి. మార్కండేయ మునీంద్రా! నీవు వయో వృద్ధుడవు మునులలో నుత్తముడవు, సప్త మహాకల్పములు నీ ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై జల్లుకొనుచున్నావేమి?  వృద్దులు బాలురకు యెదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శ్రుతివాక్యమున్నది కదా మేము అయిదేండ్లవారమే కదా! అని పలికిరి.

ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి యిట్లనెను. భగవద్గావలాలమలారా! ఒకొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము, కుండ నుండి స్రవించు నీరువలె తగ్గిపోవుచున్నది. ఇరువది యొక్క కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇందసత్యము లేదు. యెక్కువ వయస్సు ఉండుటవలన ప్రయోజనమేమి వేదశాస్త్రములను చదువుటచేత లాభమేమి, యోగమును పాటించుటచే, ఉపయోగమేమి? తపముచేత, కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు చిరంజీవియైనచో వచ్చిన ప్రయోజనమేమి? నిరర్దకముగ కాలము గడచుటచే దుష్టుల జీవనము గడచిపోవుచున్నది. జ్ఞానమును సంపాదించు వాడే యెక్కువగ వ్యర్థముగ అజ్ఞానియై యెక్కువ కాలము గడిపిన వాని గొప్పదనమేమున్నది వినాశకాలము దాపురించినప్పుడు ప్రాణిలోకము భయమునంది తాను చేసిన కర్మఫలముననుభవించి మరల జన్మించును. నిత్యముకాని దేహముతో విష్ణుకథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది.

మహాత్ములైన సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులారా! మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు, నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి యెల్లప్పుడును నీ హృదయపద్మములందే యుండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము. శ్రీహరి ప్రసంగములను కూడ చేయము. విష్ణు కథను విడువని బాలువాడైనను వృద్ధుడే, నిరంతరము హరి కథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే, హరికథా ప్రసంగములేని వారెంత వృద్ధులైనను బాలురే కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానము నిచ్చెను. మార్కండేయుని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను  వినుచున్న మునులు తమలో తాము యెక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి. వారందరును మార్కండేయ మహర్షికి, సనకాది మునులకును పాదాభివందనము చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువను తెలిసికొంటిమి. కావున విష్ణు భగవానుని మహిమ నెరుగశక్తి యుండని ప్రార్థించిరి.

నారదుడును శ్రీహరి వద్దకేగి జరిగిన దానిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి వ్యాస రూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించెను. సూతునివలన మునులు మొదలగు వారందరును శ్రుతులసారము నెరిగిరి. శౌనకుడు మునులును అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంతచిత్తులై పరమేశ్వర జ్ఞానము, పరమేశ్వర చింతనము కలిగియుండిరి. హరకేయూరాది భూషణములు తమ తమ విభిన్నరూపములనందినను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషము ననుసరించి వివిధరూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును. వేదవేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్త్యము నెరిగి పరమాత్మ చింతనమును చేసి భగవదనుగ్రహము నందుటయే జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతములు భగవచ్చింత నేను నిరంతరముగ అలవాటు చేసి జీవులను తరింపజేయును. జహ్ను మునీశ్వరా! మాఘమాస వ్రతాచరణ భగవచ్చింతనమును జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి యిహలోక సుఖములను పరలోకములను దుష్కర్మక్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును. మునుల అహంకారమును మార్కండేయ ముని వినయవివేకములను, సనక సనందనాదుల మహత్త్యమును, పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చింతనమును జ్ఞానఫలములని యెరిగి ఆచరించి భవసాగరమును దాటవలెను సుమా అని గృత్నృమద మహర్షి వివరించెను.


      🙏 ఓం శ్రీ ఆదిదేవాయ నమః 🙏


✍️ " సాంప్రదాయం "

Saturday 3 February 2018

మాఘ పురాణం :- 18 వ అధ్యాయము



                              మాఘ పురాణం




  18వ అధ్యాయము :-

వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః !
సర్వపాపవిశుద్ధాత్మ యాతి బ్రహ్మసనాతనమ్ !!

న వాసుదేవభక్తానామశుభం విద్యతే క్వచిత్ !
జన్మమృత్యుజరావ్యాధిభయం నైవోపజాయతే !!

 ఇంద్రుని శాపవిముక్తి :-

శ్రీమహా విష్ణువు దేవతలతో మరల నిట్లనెను. దేవతలారా! మాఘమాస మహిమను యెంత చెప్పినను చాలదు. మాఘపూర్ణిమనాడు మాఘస్నానము, పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నియు నశించును.మాఘ వ్రతము నాచరించినవారు నాకిష్టులు వారు దేవతలై వైకుంఠమును చేరుదురు.

మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించువారిలో గొప్పవాడు. అశ్వర్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను(విష్ణువు) ఉత్తముడును. వేద అములు శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో రామతారకము ఉత్తమము. స్రీలలో లక్ష్మి దేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. మేరువు పర్వతములలో గొప్పది. అన్ని  దానములలో ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వ ఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరీ ఇలా సర్వనదులయందును పది సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యము, మూడు దినములు అరుణోదయ సమయమున చేసిన మాఘస్నానము వలన వచ్చును. మాఘ స్నానము చేసి పూజ  మున్నగువానితో వివిధ పుష్పములతో సాలగ్రామరూపమున నున్న నన్ను పూజించిన మోక్షము వచ్చును, అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించెను.

దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి యింద్రుని వెదకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెదకుచున్నవారికి చిన్న పాదములు, పెద్ద శరీరము కల విచిత్రమైన తొండయొకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ యొక రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి.ఎంత ప్రయత్నించినను ఆ తొండ కదలలేకపోయినది. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీమహావిష్ణువు చెప్పిన మాట యెట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘస్నానాదికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి.

పవిత్రోదకముచే తడిసిన తొండ దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరివని ఆమెనడిగిరి. ఆమెయు శాపవిముక్తికి సంతసించుచు. దేవతలకు నమస్కౌరించి యిట్లు పలికెను. నేను సుశీలయను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున నా భర్త పెండ్లి జరిగిన నాల్గవనాడు మరణించెను. మా తల్లితండ్రులు చాలా యెక్కువగా దుఃఖించిరి. నా తండ్రి "మనుష్య జన్మము కష్ట ప్రదము, స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకొన్న ఈమెను చూడజాలను, ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుటమేలని" తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లితండ్రులిద్దరును వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి.

నేనును బంధువుల వద్దనుంటిని, వారి నిరాదరణ ఫలితముగ చూచువారెవరును లేకపోవుటచే భిక్షాటనముచే జీవించుచుంటిని. నిలువయున్నదానిని భుజించుచు బిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి, వ్రతము మున్నగువానిని ఎరుగను. ఉపవాసమనేమో తెలియదు. ఏకాదశీ వ్రతము చేయువారిని చూచి పరిహాసము చేసితిని. ధనమును దాచి సంపాదనపరురాలనైతిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు, నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచారవంతురాలనై జీవితమును గడిపితిని, తరువాత మరణించి నరకమును చేరితిని. అచట పెక్కు రీతుల శిక్షింపబడితిని.

పులి, కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మనందితిని, పెక్కు బాధలను పడితిని. ఒకనాతి జన్మలో అయిదు దినముల క్రిందటి ఆహారమును ఆకలి కల వానికి పెట్టితిని, ఆ చిన్న మంచి పని వలన మీరు దయయుంచి నాకు శాపవిముక్తిని కలిగించిరి అని పలికెను మాఘ మాస పవిత్ర నదీజలస్పర్శచే ఆమె దేవతత్వమునంది దేవప్రియ అను పేరును పొందెను. దేవతలలో ఒకరామెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదుకసాగిరి. పద్మగిరి గుహలలో వికారరూపముతో తిరుగుచున్న యింద్రుని జూచి బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను, లోనికిపారిపోయెను. దేవతలను ఇంద్రుని జూచి వెంబడించి వానిని ఊరడించి ధైర్యము చెప్పిరి. నీవు చేసిన పాపములను పొగొట్టుకొనుటకు మహావిష్ణువు నీ శాపవిముక్తికి మార్గమును సూచించెను, ఆ ప్రకారము చేయుదము రమ్మని తుంగభద్రాతీరమునకు తీసికొని వచ్చిరి. మాఘమాసమంతయు వానిచేత మాఘస్నానము చేయించిరి. ఇంద్రుడును శాపవిముక్తుడయ్యెను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెను.

ఇంద్రుడును దేవతలతో కలసి స్వర్గమునకెగెను. రాక్షసులను జయించి సుఖముగనుండెను. గృత్నృదమదమహర్షి జహ్నుమునికి యీ విధముగ మాఘమాస స్నానమహిమను వివరించెనని పలుకుతుండగా జహ్నుముని, స్వామీ! యీ విష్ణు కథామృతము ఇంకను వినవలెననున్నది ఇంకను చెప్పుడని కోరెను. గృత్నృమదుడిట్లనెను పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలదు. ధనసంపాదనము తప్ప ధనవినియోగము నాతదు చేయలేదు. పూజ, దానము మున్నగు మంచిపనులను గూడ చేయలేదు. అందువలన మరణించిన తరువాత నరలోకమును చేరెను. అచట కొంతకాలముండి దరిద్రుడై జనించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై పంపాతీరమున మఱ్ఱిచెట్టు పైనుండి అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠమహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మఱ్ఱిచెట్టు సమీపమున నివసించుచు మాఘస్నానము పూజ మున్నగు చేయ్చు శిష్యులకు మాఘ్మాస మహత్త్యమును వివరించుచుండెను, అతదు మాఘస్నాన మహిమను వివరించుచు నొకనాడు మాఘస్నానము చేసిన వారి సర్వపాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును. మాఘస్నానము చేయనివాదు నరకమునపోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలని శుభములను, చేయకపోవుటవలని అశుభములను వివరించుచుండెను. ఆ సమయమున పిశాచరూపము పైనుండి క్రిందపడింది. ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై జల్లుచు పంపాజలమున మాఘస్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరి కథలను వినుట వలన, మాఘ స్నానము వలన వాని పిశాచరూపముపోయి దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన వైకుంఠమును చేరెను.



   🙏 ఓం శ్రీ మహావిష్ణుమూర్తియే నమః 🙏


✍️ " సాంప్రదాయం "

మాఘ పురాణం :- 17 వ అధ్యాయము


                             మాఘ పురాణం

                       



17వ అధ్యాయము :-

త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ !
సన్య్సాసకృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణమ్ !!

శుభాంగః శాంతిదః స్రష్ఠా కుముదః కువలేశయః !
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః !!


ఇంద్రునికి కలిగిన శాపము :-

వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల ఇట్లనెను. రాజా! మాఘమాస మహిమను వివరించు మరియొక కథను చెప్పెదను వినుము. పూర్వము గృత్నృమదుడను మహర్షి గంగాతీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాదికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహా విష్ణువు మహత్మ్యమును వివరించుచుండెను. జహ్నువనుమహాముని మాఘమాసస్నాన మహిమను వివరింప కోరగా గృత్నృమదమహర్షి యిట్లు పలికెను. సూర్యుడు మకరరాశిలో నున్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును. అట్టి  మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశము కూడ అగుచున్నది. మాఘమాసమున ప్రాతఃకాలమున నదీస్నానము చేసిన వరు ఇంద్రుడు మహా పాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు ఆ విషయమును వినుడు.

పూర్వము తుంగభద్రా నదీతీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని యొకడు ఆశ్రమమును నిర్మించుకొని యుండెను. మిత్రవిందుని భార్య అతిలోకసుందరి, ఆమె యొకనాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడిబట్టలు కట్టుకొని కేశములనారబెట్టు కొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో గలసి యాకాశ మార్గమున పోవుచున్న యింద్రుడామెను చూచి మోహపరవశుడయ్యెను. అమెనెట్లైన పొందవలయునని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగివచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమముపై భాగమున నుండి మిత్రవిందముని భార్య అందమును, ఆమె చేష్టలను గమనించుచుండెను.

మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేదపఠనము చేయింపవలయునని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్లెను. ఇంద్రుడును ఆశ్రమములోనికి రహస్యముగ ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను, విడిపించుకొని పోవుచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామ పరవశయై యింద్రునిపొందు అంగీకరించెను, కోరిక తీరిన యింద్రుడు ఆశ్రమము నుంది వెళ్ల యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవెవడవని యడిగెను. నేనింద్రుడనని సమాధానమిచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవై  స్వర్గమునకుపోలేక భూలోకముననే యుండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయిపై పడియుండుమని శపించెను. ఆ చోటున్ విడిచి గంగాతీరమును చేరి అచట తపమాచరించి యోగశక్తిచే దేహమునువిడిచి పరమాత్మలో లీనమయ్యెను.

ముని శాపమువలన యింద్రుని ముఖము మాత్రమే గాడిద మిగిలిన శరీరము మామూలుగనేయుండును. అచటనుండుటకు సిగ్గుపడి పద్మగిరియను పర్వతమును చేరి అచటి గుహలోనుండి యెచటనున్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు పన్నెండు సంవత్సరములు గడపెను. రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు యింద్రుని వెదుకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరల వారిని తరిమి కొట్టిరి. దేవతలు యింద్రుని వెదకుచు నదీతీరములయందు సముద్రతీరమునందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసమగుటచే మాఘమాసమున నదీస్నానము చేసి తీగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి, మునులు వారికిట్లనిరి.

దేవతలారా వినుడు మేము చేయువ్రతము మాఘమాసవ్రతము సూర్యుడు మకర రాశి యందుండగా ప్రాతఃకాలమున నా/తటాకదులందు స్నానము చేయుట శ్రీమహావిష్ణుపూజ, పురాణ పఠనము, యధాశక్తి దానము. దీనివలన దుర్లభమైన మోక్షము కూడ సులభమగును. మాఘ్మాసమున చేసిన మాధవస్మరణ సర్వపాపములను నశింపచేయును. మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయు వారి యదృష్టమనంతము. మాఘశుద్ధ చతుర్దశియందు గోదానము, వృషోత్పర్జనము, తిలదానము ఆవూప దానము, పాయసదానము, వస్త్రకంబళములదానము, విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీమహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములైయుండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలును దివ్యమునులు మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీమహ విష్ణువు నర్చించిరి. వారికి శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీమహా విష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగియుండెను. శంఖచక్ర గదాపద్మములను నాలుగు చేతులయందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగ నుండెను. కంకణములు వారములు వైజయంతీమాలమున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీమహావిష్ణువును డేవతలిట్లు స్తుతించిరి.

స్వామీ: నీవు జగములకే గురువువు వేదవేద్యుడవు నీయనుగ్రహము లేనిదే యెవరును నిన్నెంతటి వారైనను యెరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాస మహర్షిని పాదముల మహిమను స్తుతించి కృతార్థులైరి. అట్టి నీకు మా నమస్కారములు స్వామీ! నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు సమస్తమును నీవే వ్యాప్తమైయున్నది. నీవు సచ్చిద్రూపుడవు సత్యవాక్కువు స్వామీ! యిట్టి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితిలయముల నిర్వహించుచున్నావు. సర్వసృష్టి నశించి జలమయ మైనప్పుదు మఱ్ఱి ఆకుపై పరుండి చిదానంద స్వరూపడువైయుందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్పమరెవరును యెరుగజాలరు. కర్మప్రకృతి గుణభేదముల ననుసరించి సృష్టించి  వాని యాందాసక్తుడవై యున్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయరూపమున నున్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడవైన నిన్నెవరును యెరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నింటిని సృష్టించిన వాడవు నీవే ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉర్దవుడు మొదలగు ఉత్తమపురుషులు మాత్రమే నన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములును నీవే మాట మనస్సు మున్నగువానికి అందని నీరూపమును నిన్ను స్తుతించుట తప్పయేమియు చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని గోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము. అని దేవతలు పలు రీతుల శ్రీమహావిష్ణువును స్తుతించిరి.

దేవతలయందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై యిట్లనెను. దేవతలారా యింద్రుడు ముని శాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద మొగము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగియున్నాడు. అతదు ముని భార్యను మోహించి ఆమెననుభవించి దోషము చేసి మునిశాపమునందెను. పద్మగిరి దోకర్ణ సమీపముననున్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్దభ ముఖుడైన ఇంద్రునిచే నదీస్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖముకవాడై, పూర్వమువలె దివ్య శక్తులను పొంది మమ్ము రక్షింపగలడు, కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయపుణ్యకాలమున నదీస్నానము చేయింపుడని చెప్పెను.

దేవతలు శ్రీమహావిష్ణువు మాటలనువిని విస్మితులైరి. స్వామి ముని శాపపీడితుడైన ఇంద్రుడు కేవల మాఘస్నానముచే స్వ్స్థుడగునా? విచిత్రముగ నున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా! మాఘమాసస్నాన మహిమను మీరెరుగకపోవుటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యధా పూర్వరూపమును పొందుటలో ఆశ్చర్యము, సందేహము అక్కరలేదు. పూర్వము విస్వామిత్ర మహర్షియునింద్రుని వలె పాపమును చేసి కపిముఖుడై మాఘస్నానము చేసి పూర్వ స్థితి నందెనని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత యాశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణువిట్లు పలికెను. వినుడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగాతీరమునకు వచ్చెను. మాఘమాసకాలమగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి. అట్లు వచ్చిన దంపతులులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీస్నానము చేయుచు భార్యను కూడ నదీస్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగాతీరమును చేరిన ఆమె ఈ చలిలో నకీచన్నీటి స్నానము బాదాకరము నేను స్నానము చేయజాలను. మీకు శక్తి యిష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడెంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు. స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో గలసి స్నానము చేసెను. గంధర్వును భార్య మాఘస్నానమును ధూషించి నిరాకరించుటచే ఆమె దివ్య శక్తులను కోల్పోయెను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్లుసందడిలో గంధర్వుని భార్యను మిగిలినవారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగాతీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను.

ఆమె అడవిలో తిరుగుచూ విస్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి, యవ్వనానికి విస్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే యిద్దరూ  కామక్రీడలలో తెలియాడుచుండగా, మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా, విస్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీదించుచుందిరి. ఆ దృస్యమును చూచి మందిపడుచు తపస్వివై యుండి కూడా యిలా కామతృష్ణ కలవాడవైనందున, నీకు కోతి ముఖము కలుగుగాకయని విస్వామిత్రుని, పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విస్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, " విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి, నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము", అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి, విష్ణువును ధ్యానించి, కమండలముతో నీరు తెచ్చి, పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ శ్త్రీ రూపమును పొంది, గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నందిన విస్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.

దేవతలారా! మాఘస్నానము మహిమ మాటలకు అందదు చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో నున్న ఇంద్రునిచే మాఘస్నానమును చేయింపుడు. అప్పుడు అతనికి శాపవిముక్తి యగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు యింద్రుని శాపవిముక్తికి ఉపాయమును సూచించెను.


          🙏 ఓం వైకుంఠపురాధీశాయ నమః 🙏


✍️ " సాంప్రదాయం "