Sunday 25 March 2018

శ్రీ రామ నామ మహిమ



                      శ్రీరామ నామ మహిమ



శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం |
అజానుబాహుం మరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి ||

జానకీ సహితుడైన రాఘవుని, దశరథుని కుమారుని, అప్రమేయుని (కొలతలకు అందనివానిని) సీతాపతిని, రఘువంశంలో రత్నదీపంలా ప్రకాశించే వానిని, ఆజానుబాహుని, పద్మదళాలవలె విశలమైన కన్నులు గలవానిని, రాక్షసులను నశింపజేసినవానిని, శ్రీరామచంద్రునికి నమస్కరించుకుంటున్నాను.

శ్రీరామచంద్రముర్తి చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నాలుగవ పాదాన కర్కాటకలగ్నంలో మధ్యాహ్నం పూట శ్రీమహావిష్ణువు అవతారంగా జన్మించాడు. అసలు శ్రీమహావిష్ణువు దశావతారాలను పరిశీలించినపుడు, ఆయన ధరించిన పది అవతారాల్లో, మూడు అవతారాలు చైత్రమాసంలోనే ప్రాదుర్భవించినట్లు తెలుస్తోంది. మత్స్య, వరాహ, శ్రీరామ అవతార జయంతులు చైత్రమాసంలోనే వస్తుంటాయి. అలాగే దశావతారాలలో శ్రీరామావతారం ఏడవది అయినప్పటికీ, ప్రతి సంవత్సరం పది జయంతులు ముగిసిన పిదప, మరలా సంవత్సర ప్రారంభంలో మొదటగా వచ్చే జయంతి పండుగ శ్రీరామనవమే!

దశావతార జయంతులు :-

️ 1. మత్స్య - చైత్రబహుళ పంచమి,
⚜️ 2. కూర్మ - వైశాఖ శుద్ధ పూర్ణిమ,
⚜️ 3. వరాహ - చైత్ర బహుళ త్రయోదశి,
⚜️ 4. నారసింహ - వైశాఖ శుద్ధ ద్వాదశి,
⚜️️ 5. వామన - భాద్రపద శుద్ధ చతుర్దశి,
⚜️ 6. పరశురామ - వైశాఖ శుద్ధ ద్వాదశి,
⚜️ 7. శ్రీరామ - చైత్రశుద్ధ నవమి,
⚜️ 8. శ్రీకృష్ణ - శ్రావణ బహుళ అష్టమి,
⚜️ 9. బుద్ధ - వైశాఖ శుద్ధ పౌర్ణమి,
⚜️ ️10. కల్కి - భాద్రపద శుద్ధ విదియ

శ్రీరాముడు పుట్టినరోజునే శ్రీరామ కల్యాణోత్సవాన్ని జరుపుకుంటుంటాం. ఈ విషయమై కొంతమంది, పుట్టినరోజునే కల్యాణోత్సవం ఏమిటన్న వితండవాదం చేస్తుంటారు. అవతార పురుషుడు శ్రీరాముడు ఈ లోకాన అవతరించడమే మంగళప్రదం. అందుకే ఆనందదాయకమైన ఆరోజున లోక కల్యాణాన్ని ఉద్దేశించి సీతారాముల కల్యాణోత్సవం జరపాలని పెద్దలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆ కల్యాణరాముని చరితను ఊరూరా, వాడవాడలా పారాయణం చేస్తూ ధన్యులవుతుంటారు. ఆనందోత్సాహంలో తేలిపోతుంటాము.

అసలు శ్రీరామనామ జపమే సమస్త తాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషదం. శ్రీరామనామం త్రిమూర్తులకు ప్రతీక. అందుకే పార్వతీ వల్లభుడు కూడ,

శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

అంటూ శ్రీరామనామం విష్ణుసహస్రనామాలకు సమానమైనదని చెప్పాడు. విష్ణుమూర్తి యొక్క ఒక్కొక్క నామం సర్వదేవతల కంటే అధికమైంది. అటువంటివి వేయినామాలు ఒక్క రామనామానికి సమం. రామనామం బ్రహ్మహత్యాది అనేక పాతకముల నుండి రక్షిస్తుంది.

'రామ నామాత్పరో మంత్రః నభూతో న భవిష్యతి' అని అన్నారు. అంటే, రామనామాని కంటే గొప్పమంత్రం ఇదివరలో లేదు. భవిష్యత్తులో కూడా ఉండబోదని చెప్పబడింది. మంత్రాలలోకెల్లా గొప్పదైన గాయత్రీ మంత్రానికి, రామమంత్రానికి మధ్య భేదమేమీ లేదు. 'రామ' నామాన్ని చెబితే గాయత్రీమంత్రాన్ని చెప్పినట్లే.

ఆ, ఉ, మ ల సంగమమే ఓంకారమని మనకు తెల్సిందే. అ= విష్ణువు, ఉ= మహాలక్ష్మీ, మ= జీవుడు. రామనామం ప్రణవం నుంచే ఉద్భవించిందని రామాయణం పేర్కొంది. శ్రీరామనామ మహిమను తెలియజేసే ఎన్నో ఉదాంతాలు మనకు కనబడుతున్నాయి. అందులో ఓ ఉదాంతం:

రావణ వధానంతరం సీతాసమేతంగా అయోధ్యకు చేరుకున్న రాముడు, నీండుసభలో కొలువైయుండగా నారదమహర్షి ప్రవేశించాడు. నారదమునితో పాటు విశ్వామిత్రుడు, వశిష్ఠాదిమహర్షులు విచ్చేశారు. అక్కడ ఒక దార్మిక విషయమంపై చర్చ కొనసాగుతున్న విషయాన్ని గమనించిన నారదుడు, సభాసదులందరినీ ఉద్ధేశించి, "సభకు వందనం, ఇక్కడ సమావేశమైన వారందరినీ ఒక విషయమై ప్రార్థిస్తున్నాను. భగవంతుని నామం గొప్పదా? భగవంతుడు గొప్పవాడా? ఈ విషయమై అభిప్రాయాన్ని చెప్పండి" అని పలికాడు. నారదుని అభ్యర్థన విన్నవెంటనే సభలో చర్చలు ఊపందుకున్నాయు. ఎంతగా వాదోపవాదాలు జరిగినప్పటికి రాజసభలోని ఋషిగణం ఓ నిర్ణయానికి రాలేకపోయింది. కలకలం చెలరేగింది. చివరకు నారదుడే తన తుది నిర్ణయాన్ని వ్యక్తీకరిస్తూ, ఖశ్చితంగా భగవంతుని కంటే భగవంతుని నామమే శ్రేష్ఠమైనదని చెప్పాడు. సభ ముగియడానికి ముందుగానే ఈ విషయం ఋజువవుతుందని పలికాడు.

అనంతరం నారదుడు, ఆంజనేయునితో, "హనుమా! నువ్వు మాములుగానే ఋషులకూ, శ్రీరామునికీ నమస్కరించు. విశ్వామిత్రునికి తప్ప" అని చెప్పాడు. అందుకు హనుమంతుడు అంగీకరించాడు. ప్రణామ సమయం రాగానే హనుమంతుడు ఋషులందరికీ నమస్కరించాడు గాని, విశ్వామిత్రునికి మాత్రం నమస్కరించలేదు. దాంతో విశ్వామిత్రుడు కోపగించుకున్నాడు. అప్పుడు నారదుడు విశ్వామిత్రుని సమీపించి, "మునీశ్వరా! హనుమంతుని పొగరును గమనించారా? నిండుసభలో మీకు తప్ప అందరికీ నమస్కరించాడు. మీరు అతన్ని తప్పక శిక్షించాలి. అతనికి ఎంత గర్వాతిశయమో చూశారా? " అని చెప్పడంతో విశ్వామిత్రుడు మరింత కోపావేశానికి గురయ్యాడు. విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తిని సమీపించి, "రాజా! నీ సేవకుడైన హనుమంతుడు అందరికి నమస్కరించి, నన్ను అవమానించాడు. కనుక రేపు సూర్యుడు అస్తమించేలోగా, నీ చేతులతో అతనికి మరణదండన విధించాలి" అన్నాడు. విశ్వామిత్రుడు శ్రీరామునికి గురువు. కనుక, రాముడు అతని అదేశాన్ని పాలించవలసిందే. ఆ క్షణంలో శ్రీరాముడు నిశ్చేష్టుడైపోయాడు. కారణం స్వయంగా తన చేతులతో అనన్య స్వామిభక్తుడైన తన మారుతికి మరణదండన విధించాలి. ఈ విషయం క్షణకాలంలో నగరం అంతా వ్యాపించిపోయింది.

హనుమంతునికి కూడా మహాదుఃఖం కలిగింది. అతడు నారదమునిని సమీపించి "దేవర్షీ! నన్ను రక్షించండి. శ్రీరామచంద్ర భగవానుడు రేపు నన్ను వధిస్తాడు. నేను మీరు చెప్పినట్లే చేసినందులకు ఫలం అనుభవించినాను. ఇప్పుడు నేనేమి చేయాఅలి?" అనగా దేవర్షి, "ఓ హనుమంతా! నిరాశపడకు. నేను చెప్పినట్లు చేయి. బ్రహ్మ ముహూర్తంలో లేచి సరయూనదిలో స్నానమాచరించి చేతులు జోడించి, "ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ" అన్న మంత్రాన్ని జపించు. అంతే. విశ్వాస పూర్వకంగా చెబుతున్నాను. నీకే భయం రాదు" అన్నాడు.

మరునాడు తెల్లవారింది. సూర్యోదయానికి పూర్వమే హనుమంతుడు సరయూనదికి చేరాడు. స్నానం చేసి దేవర్షి చెప్పిన ప్రకారం, చేతులుజోడించి భగవంతుని నామాన్ని జరిపించసాగాడు. ప్రాతఃకాలం కావడంతో హనుమంతుని కఠినపరీక్షను తిలకించాలని ప్రజలంతా గుంపులు గుంపులుగా వచ్చేశారు. శ్రీరామచంద్రుడు హనుమంతునికి దూరంలో నిలబడి తన పరమ సేవకుణ్ణి కరుణార్ధ్ర దృష్ఠితో చూడసాగాడు. కాలం ఆసన్నం కావడంతో అనిచ్చా పూర్వకంగానే హనుమంతునిపై బాణాలను వర్షింపజేయసాగాడు. కాని, ఒక్క బాణం కూడా హనుమంతుని బాధించలేకపోయింది. ఆ రోజల్లా బాణాలు వర్షింపబడుతున్నాయి. కాని, అవి హనుమంతునిపై పడడం లేదు. కుంభకర్ణాది రాక్షసుల్ని వధించటంలో ప్రయోగించిన భయంకర అస్త్రాలను కూడా ప్రయోగించాడు. అంతంలో శ్రీరామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని ఎత్తాడు. హనుమంతుడు ఆత్మసమర్పణ చేసి పూర్ణభావంతో మంత్రాన్ని తీవ్రముగా జపిస్తున్నాడు. అతడు రామునివైపు చిరునవ్వుతో చూస్తున్నాడు. స్థిరభావంతో నిలబడిపోయాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తూ హనుమంతునికి జయజయకారాలు పలుకసాగారు. అట్టిస్థితిలో నారదమహర్షి విశ్వామిత్రుని సమీపించి - "ఓ మహర్షీ! ఇక మీరు విరోధాన్ని ఉపసంహరించుకొనెదరు గాక! శ్రీరామచంద్రుడు అలసివున్నాడు. విభిన్న ప్రకారాలైన బాణాలు కూడ హనుమంతుని ఏమీ చేయలేకపోయాయి. హనుమంతుడు మీకు నమస్కరించక పోతే పోయినదేమున్నది? ఈ సంఘర్షణ నుండి శ్రీరాముని రక్షించండి. ఈ ప్రయాస నుండి అతణ్ణి నివృత్తుణ్ణి చేయండి. మీరంతా శ్రీరామ నామ మహత్త్యాన్ని చూచినారు కదా!" ఆ మాటలకు విశ్వామిత్రమహర్షి ప్రభావితుడైపోయాడు. "రామా! బ్రహ్మాస్త్రాన్ని హనుమంతునిపై ప్రయోగించవద్దు" అని ఆదేశించాడు. దానితో హనుమంతుడు వచ్చి, తన ప్రభువు యొక్క చరణ కమలాలపై వ్రాలిపోయాడు. విశ్వామిత్రుడు అత్యంత ప్రసన్నుడై హనుమంతుని అనన్య భక్తిని గురించి విశేషంగా ప్రశంసించాడు.

హనుమంతుడు సంకట స్థితిలో ఉండగా నారదమహర్షి ప్రప్రథమంగా అతనికి రామమంత్రాన్ని ఉపదేశించాడు.

'శ్రీరామ' - ఈ సంబోధన శ్రీరామునికై పిలుపు. "జయరామ" ఇది అతని స్తుతి. 'జయజయరామ'- ఇది అతని విషయంలో పరిపూర్ణ సమర్పణ. మంత్రాన్ని జపించే సమయంలో ఈ భావాలే వుండాలి. ఓ రామా! నేను నిన్ను స్తుతిస్తున్నాను. నీ శరణుజొచ్చినానన్న భక్తులకు శ్రీఘ్రమే శ్రీరామభగవద్దర్శనం జరుగుతుంది.
సమర్థ రామదాసస్వామి ఈ మంత్రాన్ని 13 కోట్లు జపించి, శ్రీరాముని ప్రత్యక్షదర్శనాన్ని పొందాడు. రామనామ శక్తి ప్రభావం అమితమైనది. అందుకే రామనామాన్ని నిత్యం భక్తులు జపించి తరిస్తుంటారు. స్వర్గంలో దేవతలకు అమృతం ఎలాగో, ఈ భూలోకంలో మానవులకు రామనామం అటువంటిది. రామనామాన్ని నిత్యం జపించేవాడు, తులసీమాలను ధరించినవాడు, రామా అని స్వామి వారిని నోరార పిలిచినవాడు ధన్యుడు. ఈ రామనామము తారకమంత్రమని చెప్పబడుతోంది. వేరొక మంత్రాన్నితారకమంత్రమని అనరు. అంత్యకాలంలో మరణం సమీపించినపుడు, స్వయంగా శివుడే వచ్చి మరణాన్ని చేరుకునే వ్యక్తి చెవిలో రామనామాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి.

ఎలాగైతే అత్యంత సూక్ష్మమైన మర్రివిత్తనం నుండి బ్రహ్మాండమైన వృక్షం ఉద్భవిస్తుందో, అలాగే రాం అనే బీజం నుండి ఈ చరాచర జగత్తంతా ఏర్పడింది. కాబట్టి ఈ కనబడే ప్రపంచమంతా రామమయమే. మట్టి నుండి ఏర్పడిన కుండ, పిడత, బుంగ, తొట్టి, ప్రమిద ఎలాగ మృత్తికాస్వరూపమో, అలాగే ఈ జగమంతా రామ స్వరూపమే. శ్రీరామ నామాన్ని నిత్యం జపించే భక్తులకు ఎటువంటి ఆపదలు దరిచేరవు. నిత్యం రామ నామామృతంతో వారి జీవితాలు పునీతమయి, సర్వ సుఖాలు లభిస్తాయి


🙏 || జై శ్రీ రామ్ || 🙏



✍️ " సాంప్రదాయం "


శ్రీ రామ చంద్రుడు

                    

      శ్రీ రామ చంద్రుడు

  


రాముడిలో ఏమంత గొప్పదనం ఉంది?

మాయలు మంత్రాలు చూపించలేదు.
విశ్వరూపం ప్రకటించలేదు.
జీవితంలో ఎన్నో కష్టాలు... జరగరాని సంఘటనలు...
చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు...

పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు...
తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు...

కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు...
అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షస       వధ చేశాడు...

అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు.
లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా  అహం దశరథాత్మజః - దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే’ అని ప్రకటించాడు…



అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది?

ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు. లోకానికి ఒకేఒక్కడుగా నిలిచాడు.


💠   శాస్త్ర ధర్మం :-



తండ్రి మాట కోసం వనవాసానికి సీత, లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించారు. మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య. పెద్దకుమారుడినైనా తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయానని బాధపడతాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది. తాను దశరథుడినని, పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది. కానీ, రాముడు ఇందుకు ఒప్పుకోడు. శాస్త్రప్రమాణాలు అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచుతాడు. నిజంగా నీవు దశరథుడవే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలు స్వీకరించు. నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటిస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్నసమయంలో కూడా శాస్త్రధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి ఒక్కడే.

💠   స్నేహ ధర్మం :-

 మాయలేడి కారణంగా సీతమ్మను వదలి, పర్ణశాలను దాటి చాలా దూరం వస్తారు రామలక్ష్మణులు. ఇదే అదనుగా భావించిన రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడు. ఇదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగిస్తాడు. విశాలమైన తన రెక్కలే ఆయుధంగా చేసుకుని, రావణుడిని ముప్పుతిప్పలు పెడతాడు. సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికివేస్తాడు. రెక్కలు తెగిన ఆ పక్షిరాజు  నేలకూలుతాడు. కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం పూర్తిగా చెప్పి, రాముడి చేతిలోనే ప్రాణం విడుస్తాడు. తనకు క్షేమం కలిగించటానికి ప్రాణాలకు తెగించిన జటాయువును ఆప్తమిత్రుడుగా స్వీకరించి, అతడికి ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహిస్తాడు రామయ్య. తాను క్షత్రియుడు. చేస్తున్నది వనవాసం. మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా ఉత్తరక్రియలు చేసి, స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడా మహనీయుడు.

💠    యుద్ధ ధర్మం :-

వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. తమ్ముడి భార్య కోడలితో సమానం. మామగారు తండ్రితో సమానం. తండ్రిలాగా కాపాడాల్సిన తమ్ముడి భార్యను కామంతో వాలి కోరుకున్నాడు. అంతేకాదు.. వాలి వనచరుడు. క్రూరత్వం కలిగిన వనచరాలను వేటాడటం క్షత్రియధర్మం. అంతేకాదు, ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంటుంది. దాన్ని ధరించిన సమయంలో వాలి ఎదుట ఎవరు నిలిచినా వారి శక్తి క్షీణిస్తుంది. కాబట్టే రాముడు చెట్టుచాటున దాగి, వాలిపై బాణాన్ని ప్రయోగించాడు. ఇది యుద్ధధర్మం. వాలి వధ ఘట్టంలో రాముడు క్షత్రియ, యుద్ధ ధర్మాలను పాటించాడు.

రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడుగుతాడు. అప్పుడు రామచంద్రుడు

మరణాంతాని వైరాని నివృత్తం నః ప్రయోజనం | క్రియతామద్య సంస్కారః మమాప్యేష యథా తవ ||

‘విభీషణా! శతృత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు. ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు. నాకూ అన్నగారే’ అంటాడు... ఇదీ రాముడి ధర్మవర్తన.


💠     దయా ధర్మం :-


సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి రాజ్యబహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు. సముద్రతీరంలో అపారమైన వానరసేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయిస్తాడు విభీషణుడు. మరో ఆలోచన లేకుండా విభీషణుడికి అభయం ఇస్తాడు రామయ్య. అంతేకాదు, రావణుడిని చంపి విభీషణుడిని లంకా రాజ్యానికి రాజును చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. కానీ, సుగ్రీవుడు మొదలైన వారికి ఇదంతా ఇష్టం లేదు. ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్లి, విభీషణుడిని నమ్మవద్దని చెబుతారు. అతడు రావణాసురుడి దూత అంటూ హెచ్చరిస్తారు. అంతా విన్న రాముడు విభీషణుడే కాదు... చివరకు రావణుడే తనను ఆశ్రయించినా.. అతడికి కూడా అభయం ఇస్తానంటాడు. ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించటం క్షత్రియధర్మం. దయాధర్మం కూడా. వనవాసంలో ఉన్నా, చివరకు యుద్ధభూమిలో ఉన్నా దయాధర్మాన్ని రామయ్య విడిచిపెట్టలేదు.

💠      మనుష్య ధర్మం :-  

రామరావణ సంగ్రామం ముగుస్తుంది. రావణుడు నేలకు ఒరుగుతాడు. ముల్లోకాలూ ఎంతో ఆనందిస్తాయి. వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవుతారు. రాముడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపంగా స్తుతిస్తారు. ‘నీది విష్ణు అంశ. వాస్తవానికి నువ్వు నిరాకారుడివి. అయినా సాకారుడిగా ఉన్నావు. సృష్టి, స్థితి, లయలు నీవే నిర్వహిస్తావు...’ అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పినా రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు. తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు.

ఆత్మానం మానుషం మన్యే... దశరథాత్మజః’



అంటూ తాను కేవలం దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే. సాధారణ వ్యక్తిని మాత్రమే’ అంటాడు. ఇదీ రామయ్య పాటించిన మనుష్యధర్మం. రామయ్య ఎక్కడా మాయలు, మంత్రాలు ప్రకటించలేదు. తాను దైవాన్నని చెప్పుకోలేదు. సాధారణ పౌరుడిలాగే రాజ్యభోగాలతో పాటు సుఖదుఃఖాలూ అనుభవించాడు. మనుష్యధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన అవతారమూర్తి శ్రీరాముడు.

💠      సోదర ధర్మం :-

రావణ వధ జరిగింది. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావలసిందిగా విభీషణుడుకి వర్తమానం పంపించి, విశ్రాంతిగా కూర్చున్నాడు రామయ్య. దూరంగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన వైపే వస్తోంది. ఆమె ఎవరై ఉంటుంది? రాముడి ఆలోచన సాగుతుండగానే ఆమె  ఎదురుగా వచ్చి నిలుచుంది. అమ్మా! నీవెవరు? ఎందుకిలా వచ్చావు? రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే నీకు భయంగా అనిపించటం లేదా? నా వల్ల ఏదైనా సాయం కావాలా? అంటూ రామయ్య ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడు. అందుకామె సమాధానం ఇస్తూ, రామచంద్రమూర్తీ! నన్ను మండోదరి అంటారు. నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను. రామా! నీవు ధర్మమూర్తివనీ, ఏకపత్నీవ్రతుడవనీ,  సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలచవనీ విన్నాను. నా భర్త అనేకమంది స్త్రీలను చెరపట్టాడు. నీవంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుడిని చూడాలనే కుతూహలంతో వచ్చాను. పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే నీ ఔన్నత్యం అర్థమైంది. రామా! ధన్యురాలను. ఇక సెలవు. అంటూ నిష్క్రమించింది. ఇదీ.. పరస్త్రీల పై రామయ్య చూపించే సోదరధర్మం.

పవిత్ర జీవితం కోసం, ముక్తి కోసం సాధన చేసే యోగులు రామునిలా జీవించాలని అనుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు. ఎలాగైనా ఉండొచ్చు. నిరీక్షించి.. కాలపరీక్షను ఎదుర్కోవడం వివేకవంతుల లక్షణం. రాముడూ అదే చేశాడు. ఎప్పుడూ ప్రణాళిక బద్ధంగానే జీవితం నడుస్తుందని భావించలేం. మన ప్రమేయం లేకుండా చికాకులు కలుగుతాయి. వాటికి కుంగిపోతే జీవితం గతి తప్పుతుంది. గుచ్చుకున్న ముల్లును నెమ్మదిగా తొలగించి ముందుకెళ్లాలి. అలా చేయగలిగితే అద్భుతమైన అనుభూతి మిగులుతుంది. ఏ విషయాన్నైనా సక్రమంగా నిర్వర్తించే సామర్ధ్యం పెరుగుతుంది. రాముడిని ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆరాధన కోసం కాదు. మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది అందులోని పరమార్థం. త్యాగం, ధర్మం, దయ, పరాక్రమం రామునిలోని గొప్ప లక్షణాలు. వీటిని పెంపొందించుకోవాలని చెప్పేదే రామాయణం.


            🙏🙏🙏 జై శ్రీ రామ్ 🙏 🙏🙏


✍️ “ సాంప్రదాయం “

శ్రీ రామ నవమి ప్రాముఖ్యత

                  

  శ్రీ రామ నవమి  ప్రాముఖ్యత




దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు. భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.

💠 శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత 💠

శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్య మైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను జరుపుకుంటారు .

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.

ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలం యందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ-జిహ్వే కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై, సుందర, సుమధుర, చైతన్య రూపమై, కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు.

శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు.

సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం.

శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడ గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి.

భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టభిషేకం రామునికి జరిగింది.

కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా....శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్టాభిషేకం సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి, హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు.

శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు.

ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతందనేది భక్తుల విశ్వాసం.

       


పానకం, వడపప్పు :-

శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోను బెల్లం పానకం ... పెసర వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. సీతారాములకు జరిపే కళ్యాణ వైభవంలో మార్పులు వచ్చినా, తీర్థ ప్రసాదాలుగా ఆనాటి నుంచి ఈనాటి వరకూ పానకం ... వడపప్పును పంచడం వెనుక పరమార్థం లేకపోలేదు. శ్రీ రామనవమి నాటికి ఎండలు బాగా ముదురుతాయి. వేసవి తాపం వలన శరీరంలోని ఉష్ణోగ్రత పెరగడం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు తలెత్తుతుంటాయి. శరీరంలోని శక్తి చెమట రూపంలో బయటికి ఎక్కువగా పోవడం వలన నీరసం రావడం జరుగుతుంది.

ఇలాంటి అనారోగ్యాలను నివారించడం కోసమే ఈ రోజున బెల్లం పానకం ... పెసర బేడలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. బెల్లం పానకం ... పెసరబేడలతో వడపప్పును స్వీకరించడం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంటాయి. శరీరానికి కావలసిన చల్లదనాన్ని... పోషకాలను అందిస్తూ ఉంటాయి.

జీర్ణ సంబంధమైన ... మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా, వాత .. పిత్త ... కఫ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలా ఇవి పనిచేస్తుంటాయి. అందువలన బెల్లం పానకం ... వడపప్పే గదా అనే చులకన భావనతో ఇవి తీసుకోకుండా ఉండకూడదు. ఈ రోజున వీటిని తీర్థ ప్రసాదాలుగా స్వీకరించడం వలన సీతారాముల అనుగ్రహంతో పాటు ఆరోగ్య పరమైన ఔషధం లభించినట్టు అవుతుందని చెప్పొచ్చు.

మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా,ఆయా ఋతువులను,దేహారోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవే . వడపప్పు – పానకం కూడా అంతే. శరదృతువు, వసంత ఋతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఋతువులో వచ్చే గొంతువ్యాధులకు… పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని వైద్యశాస్త్రం చెబుతోంది.

పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని కూడా చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ దెబ్బ’ తగలకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. అందుకని ఒక్క శ్రీరామనవమి రోజునే కాకుండా ఈ వేసవి లో వడపప్పు ,పానకం తీసుకుంటే మంచిది .

శ్రీరామనవమి "శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము" జరుగుతున్న శుభ సందర్భంగా...వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.

శ్రీరామ ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ,
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...
అజ మహారాజ వర్మణః పౌత్రాయ...
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ...
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.

సీతాదేవి ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం...
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...
జనక మహారాజ వర్మణః పుత్రీం...
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం...

ఈ వివరాలు తెలుసుకున్న వారికి, తెలియజేసినవారికి వంశాభివృద్ధి..గోత్రాభివృద్ధి కలుగుతుంది.


                        🙏 || జై శ్రీ రామ్ || 🙏



✍️ “ సాంప్రదాయం “


Thursday 22 March 2018

హనుమంతుడు



హనుమంతుడు


హనుమ స్తోత్రం :-

మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ |
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ||

బుద్ధిర్బలం యశొధైర్యం నిర్భయత్వ-మరోగతా |
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్-స్మరణాద్-భవేత్ ||




హనుమంతుడు సీతారాములకు దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు,హనుమాన్, భజరంగబలి, మారుతి, అంజని సుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు.

                          వానరజాతి

ప్రాచీన కాలంలో వానర జాతి ఉండేది. ఆ వానర జాతి వారు మనుషుల్లాగానే నాగరికత కలిగి పట్టణాల్లో జీవించేవారు. పెళ్ళిళ్ళు చేసుకొని సంసారం కొనసాగించేవారు. వారిలో కొందరు వేదాలు , పురాణాలు చదువుకొన్న మహా పండితులు కూడా ఉండేవారు. మనషులకు మించిన శక్తి యుక్తులు వారి సొంతం. వారికి ప్రత్యేకత ఏమంటే వెనక ఒక తోక ఉండేది. సభ్యత సంస్కారం కలిగిన వానరులకు ఒక రాజు కూడా ఉండేవాడు. అంటే పేరుకు వానరులయినా మేధస్సులో మనుషులకు తీసిపోని జాతి అది.

                         వివిధ గాధలు

హనుమంతుని జీవితం గురించి వివిధ గాధలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాధలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాధలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాధ క్లుప్తంగా ఇవ్వబడింది.

                        జననం, బాల్యం


పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. కేసరి అనే అతను చాలా బలవంతుడు. అతను మాల్యవంతమనే పర్వతం మీద ఉండేవాడు. మాల్యవంతం అక్కడ ఉన్న పర్వతాల్లో కెల్ల శ్రేష్టమైనది.శంబసాదనుడనే ఒక రాక్షసుడు యజ్ఞయాగాలుకు భంగం చేస్తూ దేవ ఋషులను హింసించేవాడు. దేవ ఋషులు బలవంతుడిగా పేరుబడ్డ కేసరిని పిలిచి శంబసాదనుణ్ణి చంపమని ఆజ్ఞాపిస్తారు. మునులకోరికపై శంబసాదనుడితో యుద్ధం చేసి అతన్ని నిర్జించి దేవ ఋషులకు పీడ తొలిగిస్తాడు. సజ్జన స్వభావం గల అతనికి అంజన అనే భార్య ఉంది. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజన కొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను. పుట్టుకతోనే దివ్యతేజస్సు కలిగిన ఆ బాలుడిని అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు.

జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధం తో ఆ బాలునిదవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి, వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.

ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుని మునులు శపించడం వలన అతని శక్తి అతనికి తెలియకుండా అయింది.

                         వజ్ర ఘాతం


ఆంజనేయుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒంటరిగా నిద్రపోతున్న ఆంజనేయుడిని ఇంటి వద్ద వదిలి పెట్టి పళ్ళు తీసుకొని రావడానికై అడవికి వెడుతుంది అతని తల్లి. ఆకలి వేసి మెలుకువ వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరుచేసరికి ఎదురుగా ఎర్రని సూర్య బింబం కనిపిస్తుంది. ఆ ఎర్రని బింబాన్ని చూసి పండుగా భ్రమించి పట్టుకు తినడానికి ఒక్కసారి ఆకాశం పైకి ఎగురుతాడు. రివ్వుమని వాయు మనో వేగాలతో సూర్యుడి వైపు దూసుకుపోతున్న ఆ బాలుడిని దేవతలు , మునులు, రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు. మహాశక్తిమంతుడైన ఆంజనేయునికి సూర్యుడి వలన వేడి తగలకుండా వాయువు అతనిచుట్టూ చల్లబరుస్తుంది. సూర్యుడు కూడా ఒక్క సారిగా తనవైపుకు దూసుకొస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడయిన తరువాత అనేక ఘనకార్యాలు చేసే మహత్తరవీరుడిగా గుర్తించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకొన్నాడు. ఆరోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుడ్ఫి పట్టుకోవడానికి రాహువు వేగంగా సమీపిస్తునాడు. అతనికి అపరిమితమైన వేగంతో బాణంలా దూసుకువస్తున్న హనుమంతుడు కనిపించాడు. ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు వెలవెల పోయాడు. ఆంజనేయుడు రాహువుకు మరో రాహువులా కనపడ్డాడు. వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్ళి తాను చూసింది చెప్పాడు. ఇంద్రుడు వెంటనే ఐరావతం ఎక్కి వజ్రాయుధం తీసుకొని రాహువుతో వచ్చి నిరుపమాన వేగంతో పోతూన్న ఆంజనేయుడిని చూసాడు. వేగంగా వెడుతున్న ఆంజనేయుడికి ఐరావతం తెల్లగా ఒక పండులా కనిపించింది. దాన్ని చప్పున అందుకోబోయాడు. ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడి మొహం పైకి విసిరాడు. ఆ వజ్రాయుధఘాతానికి ఆంజనేయుడి ఎడమ చంపకు బాగా నొప్పికలిగి స్పృహ తప్పి కిందకు జారి ఒక పర్వతం పై పడిపోతాడు. వాయుదేవునకు ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలిగింది. లోకాలలో గాలి లేకుండా ఉపసమ్హరించాడు. సకల ప్రాణులు ప్రాణవాయువులేక దేహాలు స్థంబించిపోయాయి. దేవతలందరూ వెళ్ళి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మ దేవుడికి వివరించారు. బ్రహ్మ అంజనీ దేవి వద్దకు వారిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఆమె బాల హనుమంతుడిని ఒడిలో పెట్టుకొని పెద్దగా ఏడుస్తూ ఉంది. బ్రహ్మను చూసి వాయుదేవుడు పాదాలకు నమస్కరించాడు. బ్రహ్మ అతడిని దీవించి తన హస్తాలతో బాల హనుమను ఒక్క సారి నిమురగానే అతని శరీరం పై గాయాలు మాయమై దేహం ప్రకాశవంతమైంది. బ్రహ్మ స్పర్శలోని మహత్తు వల్ల అతడు నిద్ర లోంచి లేచినవాడి వలె లేచాడు. వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలలోకి పంపించి ప్రాణులను రక్షించాడు. లోకంలో వ్యవస్థ మళ్ళీ సక్రమంగా పని చేయడం జరిగింది.
అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు.ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల హనుమ గాయపడ్డాడు కావున హనుమంతుడిగా పిలువబడతాడని, వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్పాడు. సూర్యుడు తన తేజస్సులో నూరోవంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలూ నేర్పిస్తానన్నాడు. వరుణుడు నీటి వల్ల మరణం సంభవించ దన్నాడు. యముడు తన కాలదండం ఇతనిని ఏమీ చేయదని, మృత్యువు లేదని వరం ఇవ్వగా కుబేరుడూ , ఈశానుడూ, విశ్వకర్మ కూడా వరాలిచ్చారు. బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం ఇతనిని కట్టిపడవేయలేదని మాటిచ్చాడు. శత్రువులకు భయాన్ని , మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామ రూపం ధరించగలవాడని అని దీవించి దేవతలని వెంటపెట్టుకొని తిరిగి బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు.

                        విద్యాభ్యాసం


హనుమంతుడు సూర్యునివద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తానూ ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోను, వ్యాకరణంలోను పండితుడయ్యాడు.నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునకిచ్చి వివాహం చేశాడనీ, ఐనా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదనీ కూడా కథ.

హనుమంతుడు మహా శక్తిమంతుడు బలశాలి అయినా సహజ సిద్ధమైన వానర లక్షణాలవల్ల కొంటెపిల్లవాడుగా మారి అల్లరి చేసేవాడు. మునుల నారచీరలు చింపివేయడం , అగ్ని హోత్రాలు ఆర్పివేయడం చేస్తూ వారిని విసిగించేవాడు. అప్పుడు మునులు హనుమంతుని శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలిసివస్తుందని అంటారు. అందువల్ల ఆగడాలు తగ్గి హనుమంతునికి చదువు ధ్యాస పట్టింది.

గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు. సుగ్రీవుడు, అతని అన్న వాలి కిష్కింధలో ఉన్న వానరులు.

                               ఉద్యోగం

విద్యముగిసింది. ఇక ఉద్యోగం వెతుక్కోవాలి. అప్పుడు వానరులకు ఋక్షరజనుడు రాజై కిష్కంధను రాజధానిగా చేసుకొని పాలించేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు. వాలి, సుగ్రీవులు. వాలి రాజైన తరువాత సుగ్రీవునికి ఆంతరంగికుడుగా ఆంజనేయుడు పనికి కుదిరాడు.

                       వాలి సుగ్రీవులకు వైరం

వాలి మహాబలసంపన్నుడు. రావణాసురుడంతటి వాడే అతని శక్తి ముందు తలవంచి స్నేహితుడిగా మారిపోయాడు. ఒక సారి మాయావి అనే రాక్షసుడు వాలితో యుద్ధం చేయడానికి కిష్కింధకువచ్చి గలాబా స్రుష్టించాడు. వాలి ,సుగ్రీవులు అతని ముందుకొచ్చారు. వారిని చూడగానే మాయావికి పై ప్రాణాలు పైకి పోయాయి. భయపడి పారిపోయినాడు. వాలి అతన్ని వదలక అనుసరించినాడు. మాయావి ఒక బిలంలోకి దూరి మాయమయ్యాడు. వాలి, సుగ్రీవునితో " నువ్వు ఇక్కడే నాకోసం వేచిఉండు. వాడెక్కడున్నా సరే. వాడిని చంపి గాని తిరిగిరాను. " అని బిలంలోకి దూరాడు. ఏడాది పాటు ఆ బిలం దగ్గరే గడిపాడు. ఇంతలో రాక్షసుల ఆర్తనాదాలు, ఏరులై పారుతూ రక్తం బిలం నుంచి బయటకు వచ్చింది. సుగ్రీవుడు రాక్షసుల చేతిలో చని పోయాడని భావించి వాలిని జయించిన రాక్షసుడు తిరిగి బయటకు వస్తే తమ జాతి మనుగడకే ప్రమాదమని భావించి బిలాన్ని ఒక పెద్ద రాతితో మూసి విచారిస్తూ కిష్కింధకు పోయి జరిగిన సంగతి చెప్పి వాలికి అంత్యక్రియలు చేసాడు. వానర పెద్దలు సుగ్రీవుడిని రాజు చేసారు. కొన్నాళ్ళకు బిలం ముందు ఉన్నరాయిని కాలితో తన్ని కిష్కింధకు వస్తాడు వాలి.అతనికి జరిగిన సంగతి సుగ్రీవుడు చెప్పబోగా వినక తన్ని చంపడానికి సిధ్ధమవుతాడు వాలి. ఇక అక్కడ ఉంటే ప్రమాదమని భావించి సుగ్రీవుడు అరణ్యాలకు పారిపోతాడు. తన జాడ వాలికి తెలిసినప్పుడల్లా వేరే తావుకు పారిపోయి తల దాచుకొనేవాడు అతనికి కష్టకాలంలో ఉన్న నలుగురు మంత్రులలో హనుమంతుడు ఒకడు.

              హనుమంతుడి మంత్రిత్వం

నిజానికి వాలి కంటే హనుమంతుడు బలవంతుడు. మునుల శాపం వల్ల తన బలం గుర్తురానందువల్ల అతను సుగ్రీవునితో పాటు అడవులలోకి పారిపోవలసి వచ్చింది. ప్రతీ రోజు ప్రాణ భయంతో విలపిస్తున్న సుగ్రీవుడితో ఒక రోజు ఇలా అన్నాడు" మీ అన్న ఒక సారి దుందుభి అన్న రాక్షసుడిని చంపాడు. వాలి అతన్ని ఎత్తి పడవేయగా ఋష్యశృంగ పర్వతం మీద తపస్సు చేస్తున్న మాతంగ మహర్షి మీద ఆ కళేబరం పడింది. కోపంతో మాతంగ ముని ఈ పర్వతానికి వాలి వస్తే తలపగిలిచస్తావని శపించాడు. మీ అన్న అక్కడకు రాడు. మనం అక్కడ ఉండడం ఎంతో క్షేమం" అని.సుగ్రీవుడికి ఆ సలహా నచ్చింది. హనుమంతుడిని మెచ్చుకొని అక్కడ సుఖంగా ఉండసాగాడు.

                   రామ లక్ష్మణులతో స్నేహం



రామ లక్ష్మణులు అడవిలో ఉంటుండగా సీతను రావణుడు అపహరించుకొని లంకకు తీసుకొనిపోతాడు. ఆమె జాడకై వెతుకుతూ వారు ఆ పర్వతాన్ని చేరుకొంటారు. వారిని చూసి వాలి తనకోసం ఇద్దరు వీరులను పంపించాడని భావించి హనుమంతుడిని వెళ్ళి సంగతి కనుక్కోమని కోరాడు.

హనుమంతుడు బిక్షువుగా రూపం మార్చుకొని రామలక్ష్మణులకు అతిధి పూజ చేసి " అయ్యా! మీరు మహాపురుషులని చూస్తేనే తెలుస్తుంది ధనుర్ధారులై ఇక్కడ సంచరించడానికి కారణం ఏమిటి? నేను సుగ్రీవుడి మంత్రిని. వానరుడిని. కామరూప విద్య తెలిసినవాడిని కావటాన ఈ రూపంలోకి మారాను." అందుకు రాముడు" చూసావా లక్ష్మణా! మనమే సుగ్రీవుని కలవాలని భావించాం. అతని దూత మన వద్దకు వచ్చాడు. ఇతడి సంభాషణలో ఒక్క అపశ్రుతీ లేదు. మహా వ్యాకరణ పండితుడని తెలుస్తుంది. ఎవరినైనా ఇట్టే మాటలతో ఆకట్టుకోగలడు. " అని మెచ్చుకొని తన వృత్తాంతం అంతా చెప్పాడు.



అలాగే హనుమంతుడు కూడా సుగ్రీవుని గురించి చెప్పి వారిద్దరినీ తీసుకొని సుగ్రీవునికి పరిచయం చేసాడు. సీతాన్వేషణలో తాము సాయం అందించటానికి అలాగే వాలిని వధించి సుగ్రీవుడిని రాజును చేసే విషయంలో రాముడు సహకరించడానికి ఒప్పందం చేసుకొని అగ్ని సాక్షిగా సుగ్రీవుడు ,రాముడు స్నేహితులయ్యారు. అనతి కాలంలోనే రాముడు వాలిని వధించి సుగ్రీవుడిని రాజును చేసాడు. రాజయిన తరువాత సుగ్రీవుడు భోగాలను రుచి చూసి రాముడికిచ్చిన మాటను మరచిపోగా లక్ష్మణుడు కిష్కింధకు వచ్చి హెచ్చరించాడు. అప్పుడు సుగ్రీవుడు వానర వీరులను చేర పిలిచి ఒకొక్కరినీ ఒకొక్క గుంపుకు నాయకుడిని చేసి ఒకొక్క దిక్కుకు పంపుతూ కొందరు వానర వీరులతో హనుమంతుడిని దక్షిణ దిక్కుకు పంపాడు. నెల రోజుల గడువులో సీత జాడ కనుగొనాలని షరతు విధిస్తాడు.

హనుమంతుడి దళంలో అంగదడుకూడా ఉన్నాడు. అంగదుడు కిష్కింధకు యువరాజు. అలా వెళ్ళిన వారు చెట్టులు పుట్టలు అడవులు కొండలు గాలిస్తూ అలసిపోయారు. సుగ్రీవుడు పెట్టిన గడువు నెల రోజులు ఇట్టే అయిపోయాయి. కానీ వారికి సీత జాడమాత్రం తెలియలేదు. ఆకలిదప్పులతో కదలలేని స్థితికి చేరుకొన్నారు.

                   స్వయంప్రభా దర్శనం

అలసి పోయి ఉన్న వారికి ఒక బిలం కనిపిస్తుంది , ఆ బిలంలో నుండి వస్తున్న హంసలు మొదలైన పక్షులు కనిపించాయి. పక్షులొస్తున్నాయి గనక నీరు చెట్లు సమృధ్ధిగా ఉండే చోటు అని ఊహించి అంతా బిల మార్గంలో ప్రవేశించి వెళ్లారు. యోజనం పైగా నడిచినా వారికి అక్కడ ఏమీ కనపడక ప్రాణాలు కడగంటే స్థితికి వచ్చారు. అలా దీనంగా ఉన్న వేళ వారికి ఒక అద్భుతమైన పూల గుత్తెలు, విమానాలు, బంగారు సోపానాలు కలిగిన మణిమయ మండపాలు స్వర్ణ వర్ణంతో ఉన్న తాబేళ్ళు చేపలు, నిర్మలమైన నీరు, పళ్ళు ఉన్న స్థలం కనిపించింది. అక్కడ అగ్నిలా ప్రకాశిస్తున్న ఒక తపస్విని ఉన్నది. హనుమంతుడు ఆమెకు చేతులెత్తి నమస్కరించి తమ వృత్తాంతం చెప్పుకొన్నాడు. ఆమె వారికి అతిధ్యం ఇచ్చి.తన పేరు స్వయం ప్రభ అని హేమ స్నేహితురాలినని ఇది విశ్వకర్మ నిర్మించిన ప్రదేశమని, ఇక్కడకు వచ్చిన వారు తిరిగి పోలేరని చెప్పి వానరులపై దయతో బిలం దాటించి వారికి పరిసరాల వివరాలు తెలిపి జాగ్రత్తలు చెప్పింది. వారు బయటకు వచ్చి సీతను చెప్పిన గడవులో వెతికి గుర్తించలేందుకు చండశాసనుడైన సుగ్రీవుడు మరణ దండన విధించి తీరుతాడు గనక ఇలా ఆకలి దప్పులతో మరణించడమే మంచిదనిపించింది. వానర మూకను సంపాతి అనే పక్షి గమనించి చాలా కాలానికి తనకు ఆహారం సమృధ్ధిగా దొరికిందని వారితో అని భక్షించడానికి పూనుకొన్నది. అప్పుడు అంగదుడు హనుమతో" చూసావా హనుమా! జటాయువులా మనకు దురదృష్టకరమయిన మరణం రాసిపెట్టి ఉన్నది." అన్నాడు. సంపాతికి జటాయువు సోదరుడు. సంపాతి వారితో" ఓయీ! జటాయువును నీవు ఎరుగుదువా?" అని ఆసక్తిగా అడిగింది. అప్పుడు హనుమ సీతాన్వేషణం దాకా మొత్తం కథను చెప్పాడు. అది విని సంపాతి" నాయనా! జటాయువు నా సోదరుడు. అతని మరణానికి కారణమైన రావణుడిపై వృధ్ధుడనై, సూర్యతాపం వలన రెక్కలు కాలినందున పగ తీర్చుకొనలేను.కానీ నాకు యోజనాల దూరం ఇక్కడనుంచే చూసే శక్తి ఉన్నది. సీత సముద్రానికి ఆవల విషణ్ణవదనయై లంకానగరంలోని అశోక వృక్షం కింద భర్తకోసం విలపిస్తున్నది. సముద్రాన్ని దాటి వెళ్ళి ఆమెను రక్షించండి " అన్నాడు.

ఇక నూరు యోజనాల విస్తారమున్న సముద్రాన్ని ఎలా దాటాలన్న ప్రశ్న తలెత్తతింది. చివరకు జాంబవంతుడు హనుమంతుడే ఈ పనికి తగినవాడనీ, తన శక్తి తనకు తెలియదు గనుక హనుమంతుడు మౌనంగా ఉన్నాడనీ చెప్పాడు. ఆ ఆపదనుండి అందరినీ కాపాడడానికి హనుమంతునకే సాధ్యమని చెప్పాడు.
హనుమంతుడు పర్వకాల సముద్రం లా పొంగిపోయాడు. వంద ఆమడల వారాశి ని గోష్పదం లా దాటేస్తాననీ, సీతను చూచి వస్తాననీ అందరికీ ధైర్యం చెప్పి మహేంద్రగిరి పైకి ఎక్కాడు.

                            సుందర కాండ

హనుమంతుని కార్య దీక్ష, సాఫల్యతలు సుందరకాండ లో పొందుపరచబడినాయి. సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నములు తొలగి కార్యములు చక్కబడతాయని, విజయాలు చేకూరుతాయనీ విస్తారమైన విశ్వాసం చాలామందిలో ఉంది. సుందరకాండ లో అనేక శ్లోకాలు ప్రార్ధనా శ్లోకాలుగా వాడుతారు.




హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరి పై నుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాత పరీక్షను దాటి,సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు.

చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకినాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధంగాలేడు.

రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనం లో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపం వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.

అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. రెండు నెలలు మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకొన్నది.
వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామ లక్ష్మణులు సీతను తీసికొని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.




ఇంక ఆలస్యము చేయరాదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.




హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తనచూడామణి ని ఆనవాలుగా ఇచ్చినది. రెండు నెలలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.




ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తువేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరి పై వ్రాలాడు.

"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.

                          యుద్ధ కాండ




హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను . తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. లంకానగరం స్వరూపాన్ని, భద్రత ఏర్పాట్లను వివరంగా రాముడికి హనుమంతుడు చెప్పాడు.

శరణు జొచ్చిన విభీషణుని మిత్రునిగా ఆదరించమని హనుమంతుడు సలహా ఇచ్చాడు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపి సేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది.
వానరవీరులకు, రాక్షస సేనకు మధ్య మహాభీకరమైన యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధంలో అనేకమంది రాక్షసులుహనుమంతుని చేతిలో మరణించారు. అలా హనుమ చేత నిహతులైన రాక్షసులలో ధూమ్రాక్షుడు, అకంపనుడు,దేవాంతకుడు, త్రిశిరుడు, నికుంభుడు వంటి మహావీరులున్నారు.


రావణుని శక్తితో మూర్ఛిల్లిన లక్ష్మణుని హనుమంతుడు జాగ్రత్తగా ప్రక్కకు తీసికొని వచ్చాడు. తరువాత రాముడుహనుమంతుని భుజాలమీద ఎక్కి రావణునితో యుద్ధం చేశాడు. కుంభకర్ణుడు కూడా హతమైన తరువాత ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వల్ల చాలా మంది వానరులు హతులయ్యారు. రామ లక్ష్మణులు, మిగిలిన వానరసేన వివశులయ్యారు. వారిని విభీషణుడు, హనుమంతుడు వెదుకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది సంజీవని ఓషధులను తీసుకు రమ్మని హనుమను కోరాడు.




జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామ చంద్రునికీ, సాగరునికీ నమస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శనంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశమార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్లి ఓషధులకోసం వెదకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్ని సమూలంగా ఎత్తిపట్టుకొని, నింగిలో మరో సూర్యునిలా, యుద్ధరంగానికి వచ్చాడు. రామ లక్ష్మణులూ, మిగిలిన వానరులూ సృహలోకి వచ్చారు. విగతులైన వానరులు కూడా పునరుజ్జీవితులైనారు. తరువాత మళ్ళీ పర్వతాన్ని తీసికొని వెళ్ళి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు.


తరువాతి యుద్ధంలో లక్ష్మణుని చేతి లో ఇంద్రజిత్తు మరణించాడు. మరునాటి యుద్ధంలో రావణుని శక్తికి లక్ష్మణుడు మూర్ఛిల్లాడు. రాముడు దుఃఖితుడయ్యాడు. సుషేణుని కోరికపై హనుమంతుడు మరలా హిమాలయాలలో ఉన్న ఓషధుల పర్వతం సంజీవని ని తీసుకొని రాగా ఆ ఓషధులను ప్రయోగించి సుషేణుడు లక్ష్మణుని స్వస్థునిగా చేశాడు.




ఆపై జరిగిన భీకర సంగ్రామంలో రామునిచేత రావణుడు అంతమయ్యాడు. యుద్ధానంతరం రాజ్యాభిషిక్తుడైన విభీషణుని ఆజ్ఞతో హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతకు విజయ వార్త చెప్పాడు. సీత అగ్ని ప్రవేశానంతరం సీతారామలక్ష్మణులు అయోధ్యకు వచ్చారు. వైభవంగా పట్టాభిషేకం జరిగింది.


శ్రీరాముడు సీతకొక నవరత్నాలూ పొదిగిన ముత్యాల దండను ఇచ్చాడు. అప్పుడు సీత శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒకజత గొప్ప విలువైన వస్త్రాలూ, గొప్ప ఆభరణాలూ హనుమంతునకిచ్చింది. అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతబట్టుకొని ఒకసారి రాముడినీ, మరొకసారి వానరుల్నీ చూడసాగింది. సీత మనసు తెలిసికొన్న శ్రీ రాముడు "జానకీ! బలమూ, పరాక్రమమూ, బుద్ధీ ఉండి, నీకు అమితానందం కలిగించినవారికి ఆ ముత్యాలసరం ఇమ్ము" అన్నాడు. అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మతల్లి హనుమంతుని చేతిలో పెట్టింది. హారం తో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు. తరువాత హనుమంతుడు ఆ దండను పిచ్చి దండలా తుంచి వేసెను. సభలోని వారందరూ ఆశ్చర్యపోయిరి. లక్ష్మణునికి కోపము వచ్చినది. ఆంజనేయా! నీవు ఏమి చేయుచుంటివి అని ప్రశ్నించెను. హనుమంతుడు మాత్రం "శ్రీరాముడు లేని ఈ దండ నాకు అనవసరం" అని పలికెను. అప్పుడు లక్ష్మణుడు మరింత కోపోద్రిక్తుడై "శ్రీరాముడు నీలో ఉన్నాడా?" అని ప్రశ్నించెను.అప్పుడు హనుమ తన హృదయ పలకంలో కొలువైన శ్రీ సీతారాములను చూపించెను.హనుమ రామ భక్తి చూసి అందరూ పరవశులైనారు.




🙏 జై శ్రీ రామ్ 🙏


✍️ " సాంప్రదాయం "