Thursday 17 May 2018

అక్షయ తృతీయ

                      

     అక్షయ తృతీయ



వైశాఖ శుద్ధ తదియను అక్షయతృతీయ అని అంటారు. “అక్షయము”అంటే క్షయం లేనిది, లెక్కలేనిది అని అర్థాలు ఉన్నాయి. ఈ రోజునే కృతయుగం ప్రారంభం అయింది అని పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టే కృతయుగాదే అక్షయతృతీయగా వ్యవహారంలోకి వచ్చిందని పండితులు చెబుతున్నారు.


శ్లో ||  "వైశాఖ శుక్ల పక్షేతు తృతీయా రోహిణి యుతా,
        దుర్లభా బుధచారేణ సోమనాపి యుతా తథా"


           అక్షయతృతీయ రోజునే శ్రీమన్నారాయణుడి ఆరవతారం పరశురాముడు జన్మించాడు అని పురాణాలు చెబుతున్నాయి. అక్షయతృతీయ రోజున ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో చందనోత్సవం జరుపుతారు. అంటే సంవత్సరంలో ఒకసారి మాత్రమే సింహాచల అప్పన్న నిజరూప దర్శనం కలుగుతుంది. మిగిలిన రోజులలో స్వామివారిని చందనంతో అలకరిస్తారు. అక్షయతృతీయ రోజున స్వామివారికి కొత్తగా చందనాన్ని పూస్తారు. శ్రీనృశింహస్వామి తన భక్తుడైన ప్రహ్లాదుడిని అనుగ్రహించింది అక్షయతృతీయ రోజునే అని పురాణాలు వెల్లడిస్తున్నాయి.

          మత్స్య పురాణంలోని అరవై ఐదవ అధ్యాయం ప్రకారం, ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయతృతీయ వ్రతం గురించి తెలిపాడు. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసేటటువంటి ఎలాంటి వ్రతమైనా, జపం అయినా, హోమం అయినా, దానాలు ఏవైనా దాని ఫలితం అక్షయం అవుతుంది. అక్షయతృతీయ రోజున తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. ఈ రోజున ఉపవాసం చేసి, ఎటువంటి పుణ్య కార్యం చేసినా దానికి సంబంధించిన ఫలితం అక్షయంగానే లభిస్తుంది. అక్షయతృతీయ తిథి రోజున అక్షయుడైన శ్రీమహావిష్ణువు పూజింపబడతారు. అక్షయతృతీయ రోజున ఆక్షతోదకంతో స్నానం చేసి, అక్షతలను శ్రీమహావిష్ణువు పాదాలపై పెట్టి ఆచరించిన తరువాత ఆ బియ్యాన్ని చక్కగా మరొకసారి ఏరి బ్రాహ్మణులకు దానం ఇచ్చి, మిగిలిన వాటిని దైవ సంబంధిత, బ్రాహ్మణ సంబంధిత ఇష్టంగా తలపోసి వాటిని ప్రసాదంగా స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పకుండా కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు.

          వైశాఖ శుక్ల తదియ రోజున నియమంతో, నిష్ఠతో అక్షయతృతీయ వ్రతాన్ని ఆచరించిన తరువాత పన్నెండు మాసాలలో శుక్ల తృతీయ రోజున ఉపవాసం ఉండి విష్ణువును భక్తిపూర్వకంగా అర్చిస్తే రాజసూయ యాగం చేసిన ఫలితం కలుగి అంత్యంలో శ్రీహరి సన్నిధికి చేరుకుంటారు. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి తప్పకుండా గంగా స్నానం చేయాలి అలా కాని పక్షంలో 'ఓం గంగాయై నమః' అని మనసులో జపిస్తూ స్నానం చేయాలి. అక్షయ తృతీయ రోజున మట్టిని పూజించాలి. ఈ రోజు మట్టిని పూజించడం వలన ధనలక్ష్మీ, దాన్యలక్ష్మీ, వైభవలక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అక్షయతృతీయ రోజున విత్తనాలు చల్లాలి లేదా ఒక మొక్క నాటాలి అని సంప్రదాయం చెపుతుంది. అక్షయతృతీయ పితృదేవతలకు తర్పణాలు విడిచినట్లయితే వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. అక్షయతృతీయ రోజున విసినకర్రలు, గొడుగు, నీళ్ళు, గోదానం చేయాలి.


          “ అక్షయ తృతీయ” : కుబేర లక్ష్మీ పూజ !


అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కుబేర లక్ష్మీ పూజ చేయాలని పండితులు అంటున్నారు. కాబట్టి సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి పూజామందిరమును శుభ్రపరచి, దేవుని పటాలకు పసుపు కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత దీపాలను కూడా పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించుకుని దీపాలు వెలిగించుకోవాలి. పూజామందిరాన్ని అందంగా రంగవల్లికలతో తీర్చిదిద్దుకోవాలి.

అనంతరం రంగవల్లికపై ఓ పీటను ఏర్పాటు చేసి దాని పైన పసుపు, బియ్యం, నాణేలు పెట్టాలి. ఈ విధంగా కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశానికి ముందు అరటి ఆకును వేసి బియ్యాన్ని వేసి దానిపై వెలిగించిన దీపాన్ని ఉంచాలి. పసుపుతో వినాయకుడిని చేసి.. దానికి కుంకుమ, పువ్వులు పెట్టుకోవాలి. కొత్త వస్త్రాలు, బంగారం వుంటే కలశానికి ముందు పెట్టాలి. చక్కెర పొంగలి, పాలతో పాయసం నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇలా పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయి.

అక్షయ తృతీయ మనం చేసే దానాలు మంచి ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభించడంతో పాటు సత్ఫలితాలు చేకూరుతాయి. ఇంకా అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి పటానికి ముందు నేతి దీపమెలిగించి లక్ష్మీస్తుతి,కనకధార స్తోత్రము చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

               "అక్షయ తృతీయ" దానధర్మాలు !



వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది. ఇంకా "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు.

      అటువంటి పవిత్ర పర్వదినమైన "అక్షయ తృతీయ" ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటున్నారు. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు. ఇంకా గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.

        అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.

        అక్షయ తృతీయ రోజున కందిపప్పు, బియ్యం వంటి ధాన్యాలు కొనడం మంచిదని పండితులు చెబుతున్నారు. బంగారం, వెండితో పాటు ఎరుపురంగు చీర లేదా ఎరుపురంగు వస్తువులు అనాధలకు, వృద్ధులకు, పేద రైతులకు ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

        అక్షయ తృతీయ తెల్లవారుజామున గోమాతను పూజ చేయడం విశేషం. గోమాతకు గోధుమలు, పొట్టు, బెల్లం, అరటిపండు కలిపిన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున పసుపు, కుంకుమలు ఇతరులకు ఇవ్వడం మంచిది.

        అన్నదానం చేయడం ద్వారా దేవతలకే అన్నం పెట్టిన ఫలితం దక్కుతుందని విశ్వాసం. అక్షయ తృతీయనాడు పండ్లు దానం చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది. ఉన్నత పదవులు లభిస్తాయి. చెప్పులు, విసనకర్ర, గొడుగులు దానం చేస్తే సుఖమయ జీవితం లభిస్తుంది.
ఈ రోజున పేదలకు కావాల్సిన వస్తువులను దానం చేస్తే రాజయోగం లభిస్తుందని భక్తుల విశ్వాసం. వస్త్రాలు దానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. రోగాలు దరిచేరవు. మజ్జిగ లేదా నీటిని దానం చేస్తే విద్య ప్రాప్తిస్తుంది. పెరుగుదానం చేస్తే పాప విమోచనం లభిస్తుంది.ఆహార ధాన్యాలు దానం చేస్తే ప్రమాదాలు, అకాలమరణాలు వంటివి దూరమవుతాయి. గోమాతలో దేవతలందరూ ఉంటారు కాబట్టి అరటిపండు ఇవ్వడం మంచిది.

గోధుమ బియ్యంతో ప్రసాదం :-
అక్షయ తృతీయ నాడు సాంబా గోధుమను బాగా ఉడికించి లక్ష్మీ దేవికి నైవేద్యంగా సమర్పించడం మంచి ఫలితాలిస్తుంది. కుబేరలక్ష్మి, లక్ష్మీ నారాయణన్, లక్ష్మీ నరసింహ పటాల ముందు నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే గోధుమతో చేసే స్వీట్లు నైవేద్యంగా సమర్పించవచ్చును.
అలాగే పుణ్య తీర్థాల్లో స్నానమాచరించడం వల్ల వేయి గోమాతలను దానం చేసిన ఫలితం దక్కుతుంది. ఇంకా పెద్దలచే ఆశీస్సులు పొందడానికి ఇది ఉత్తమమైన రోజని పండితులు చెబుతున్నారు.
"అక్షయ తృతీయ" అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే "తృతీయ" తిథి అని పురోహితులు అంటున్నారు. ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.



         🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏


✍️ “ సాంప్రదాయం “


వైశాఖ మాసం


                   వైశాఖ మాసం ప్రారంభం


మన సంస్కృతి ఉత్కృష్టమైనది. మనకు ఈ ప్రకృతి.. అందులోని చరాచరాలన్ని పూజనీయాలే! అంతేకాకుండా మనం కాలగణనకు ఉపయోగించే తిథులు, నక్షత్రాలు, వారాలు, మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని, ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివే. చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి. ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి.

కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం. ఈ నెలలోనే పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది. ఆద్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖమాసానికి ప్రత్యేక స్థానం ఉంది.

ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాకరమైన నెల. అందువల్లనే వైశాఖ మాసానికి మాధవమాసం అని పేరు. అత్యంత పవిత్రమైన మాసంగా
పేరుపొందిన వైశాఖమాస మాహత్మ్యంను పూర్వం శ్రీమహావిష్ణువు స్వయంగా శ్రీమహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖమాసంలో ప్రతిదినమూ పుణ్యదినమే.

అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణా గ్రంధాల్లో వివరించబడ్డాయి.ముఖ్యంగా స్నాన, పూజ, దానధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం.

వైశాఖమాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిలో గంగ, గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లోగానీ, చెరువులోగాని, బావుల వద్దగానీ అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి నీటియందు సకల దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.

వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులను గురిచేస్తూ ఉంటాయి. కనుక వేడిమినుంచి ఉపసమనం కలిగించేవాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం, నీరు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం, చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది.

సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించవలెను. శ్రీమహావిష్ణువు వైశాఖమాసం మొదలుకొని మూడునెలలపాటూ ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు. అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీదళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతున్నది.



                   వైశాఖ మాసం విశిష్టత     

     
పున్నమిచంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్న మాసానికి వైశాఖ మాసం అని పేరు వచ్చింది. మాసాలు అన్నింటి కంటే వైశాఖ మాసం విష్ణు భక్తులకు ఉత్తమమైనది. వైశాఖ మాసానికి మరొక పేరు మాధవ మాసం. శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో తులసిదళాలతో శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని కలిపి పూజించినవారికి ముక్తిదాయకం అని పురాణాలలో తెలుపబడింది.  వైశాఖ మాసం మొదలుకొని మూడునెలలపాటు శ్రీమహావిష్ణువు భూమి మీద సంచరిస్తూ ఉంటారు. వైశాఖ మాసం యొక్క మహత్యాన్ని శ్రీమహావిష్ణువే లక్ష్మీదేవికి వివరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ మాసంలో ఒంటిపూట భోజనం, నక్తం ఆయాచితంగా భుజించడంవైశాఖ మాసంలో సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేయాలి. అటువంటి వారు ఉత్తమగతులు పొందుతారు కాబట్టి వైశాఖ మాసం పరమేశ్వరుడికి ధార పాత్ర ద్వారా అభిషేకం చేసినట్లయితే శుభఫలితాలు పొందుతారు. రావిచెట్టు మొదళ్ళను ఎక్కువ మొత్తం నీటితో తడిపి ప్రదక్షిణాలు చేసినవారి పూర్వీకులు అందరూ తరిస్తారు. ఎంతో శ్రేష్ఠమైనదని తెలుపబడింది. వైశాఖ మాసంలో దేవతలతో సహా అందరికీ పూజనీయమైనదని, యజ్ఞాలు, తపస్సులు, పూజలు, దానధర్మాలకు, నదీ స్నానాలకు ఉత్తమమైన మాసం.

              మాసాలలో వైశాఖమాసం ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పబడుతోన్న కారణంగా ఈ మాసాన్ని మాధవమాసమని కూడా పిలుస్తుంటారు. అనేక శుభకార్యాలకు దైవ కార్యాలకు వేదికగా ఈ మాసం కనిపిస్తుంది. పరమపవిత్రమైన ఈ మాసంలోనే పరశురాముడు జన్మించాడు. దశావతారాలలో పరశురాముడి అవతారానికి ఒక ప్రత్యేకత వుంది. తండ్రి మాటను జవదాటని కుమారుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న పరశురాముడు, అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠించి ఆయా క్షేత్రాల అనుగ్రహం భక్తులకు లభించేలా చేశాడు.

             శ్రీమహావిష్ణువు ఆదేశంమేరకు దేవతలందరూ తెల్లవారుజామున నీటిలో ఉంటారనీ, అందువలన ఆ సమయంలో స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. వీలైతే సముద్ర స్నానం. లేదంటే నదీస్నానం .. అందుకు అవకాశం లేకపోతే బావి నీటినే పవిత్ర నదీ జలాలుగా భావించి స్నానం చేయాలని స్పష్టం చేస్తోంది. ఈ మాసమంతా కూడా శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో అర్చిస్తూ ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తూ దానధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన సకలశుభాలు చేకూరడమే కాదు, మోక్షాన్ని సాధించడానికి అవసరమైన అర్హత కలుగుతుందని చెప్పబడుతోంది.
             
           వైశాఖ మాసం- వైశాఖ స్నానం- వైశిష్ట్యం

మనము -వైశాఖ స్నానం-వైశాఖ వైశిష్ట్యం- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం :-

స్నానము ఎప్పుడు చేసినా ఎలా చేసినా శరీర మలినాలను తొలగించుకునే మార్గాలలో ఒకటి. ఆది మానవుడు ఆచరించడానికి స్నానానికి దైవత్వాన్ని మిలితం చేసి మన పూర్వికులు మనకందించిన ఆత్యాద్మిక ఆరోగ్యసూత్రాలే ఈ స్నానవ్రతాలు .

సాధారణంగా నీటికి గల శక్తులు పరమ పావనమైనవి. స్నానం, పానం జలానికి ఉపయోగాలు. కల్మషాలను కడిగేది, దాహాన్ని తీర్చేది నీరు. స్నాన, ఆచమనాలనే మార్గాల్లో జలశక్తి మానవులకు మేలు చేస్తుందని వేదవాక్కు.

సాధారణ స్నానం దేహాల్ని శుద్ధిచేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి శాంతాన్ని, స్థిరత్వాన్ని కలిగిస్తుందంటారు. అందుకే స్నానం నిత్యవిధి అని విజ్ఞులు చెబుతారు. పొద్దున్నే నిద్రను వదిలి స్నానాదులుచేసి రావిచెట్టుకు నీరు పోసి ప్రదక్షిణలు చేసి మాధవుని తులసీదళాలతో పూజించడం అనేది ఈ వైశాఖమాసానికి ఉన్న ప్రత్యేకత. మాసాల్లో వైశాఖం మహావిష్ణువుకు ప్రీతికరమైనదని చెబుతారు.

జపహోమాది కర్మలకు, పితృ దైవ కార్యాలకు శారీరక స్నానం చేతనే అధికారం కలుగుతుంది. వివిధ కార్యక్రమాలకు చేసే స్నానాలను నిత్యస్నానం, నైమిత్తికస్నానం, కామ్యస్నానం, క్రియాంశస్నానం, అభ్యంగనస్నానం, క్రియాస్నానం అని ఆరు విధాలుగా చెబుతారు. వైశాఖ, కార్తీక, మాఘ మాసాల్లో ప్రత్యేక ఫలితాలను ఆశిస్తూ ఆచరించే స్నానాలు, యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాల్ని 'కామ్యస్నానాలు'గా వ్యవహరిస్తారు.

యోవై దేవాన్పితౄ న్విష్ణుం గురు ముద్దిశ్య మానవ: |
నస్నానాది కరోత్యద్ధా ముప్యశాప ప్రదా వయమ్‌ ||

నిస్సంతానో నిరాయుశ్చ నిశ్శ్రేయస్కో భవేదితి |
ఇతి దేవా వరం దత్త్వా స్వధామాని యయు: పురా ||

తస్మాత్తిథి త్రయం పుణ్యం సర్వాఫ°ఘ వినాశనమ్‌ |
అంత్యంపుష్కరిణీ సంజ్ఞం పుత్రపౌత్రాది వర్థనమ్‌ ||

యా నారీ సుభగా పూపపాయసం పూర్ణిమా దినే |
బ్రాహ్మణాయ సకృద్దద్యాత్‌ కీర్తిమంతం సుతం లభేత్‌ ||

గీతా పాఠంతు య: కుర్యాత్‌ అంతిమేచ దినత్రయే |
దినే దినేశ్వమేధానాం ఫలమేతి నసంశయ: ||

    దేవతలను, పితురులను, విష్ణువును, గురువునుద్దేశించి స్నానాదికములను చేయనివానికి మేము శాపమును ఇచ్చెదము. సంతానము లేనివానిగా, ఆయుష్యము లేనివానిగా, శ్రేయస్సు లేని వానిగా కమ్మని శాపమును ఇచ్చెదము. ఇట్లు దేవతలు వరములను ఇచ్చి తమ తమ నెలవులకు వెళ్ళిరి. కావున ఈ తిథిత్రయము పుణ్యము.
     సర్వపాప సమూహములను నశింపచేయునది. ఈ తిథి త్రయము అంత్యము పుష్కరిణీ అనబడును. పుత్రపౌత్రులను వృద్ధి పొందించును. పూర్ణిమా దినమున అపూప పాయసములను చేయు సౌభాగ్యవతి ఒకసారి బ్రాహ్మణునకు ఆ అపూపపాయసాదికముల నిచ్చినచో కీర్తిమంతుడైన పుత్రుడు కలుగును. ఈ అంతిమ దిన త్రయమున గీతా పాఠమును చేసినచో ప్రతి దినమున అశ్వమేధ ఫలము లభించును.


వైశాఖమాసంలో జలదానము మిక్కిలి శ్రేష్ఠమైనది. అందుకే వైశాఖ మాసంలో చలివేంద్రాలు కట్టించి, దాహమేసిన వారికి దాహము తీర్చిన సమస్త పాపాలూ నశిస్తాయ్.  దప్పిక తీర్చుటకు జలం గానీ, ఎండకు గొడుగును గానీ, పాదరక్షలుగానీ , శరీరతాపం తగ్గుటకు విసనకర్రను గానీ దానమిస్తే సమస్త పాపాలూ తొలిగిపోతాయట. వైశాఖ మాసం ఆరంభం కాగానే ఒక బీద బ్రాహ్మణునకు కలశం నిండా జలం పోసి దానం చేసి నమస్కరిస్తే అన్ని దానాల కన్నా ఈ దానం మిక్కిలి ఫలము పొందుతాడు. ఈ మాసంలో ఒక బ్రాహ్మణుడికి గొడుగును దానం చేస్తే విష్ణుమూర్తి సంతోషించి సకలైశ్వర్యాలూ ఇస్తాడు.

         సాధారణంగా నీటికి గల శక్తులు పరమ పావనమైనవి. స్నానం, పానం జలానికి ఉపయోగాలు. కల్మషాలను కడిగేది, దాహాన్ని తీర్చేది నీరు. స్నాన, ఆచమనాలనే మార్గాల్లో జలశక్తి మానవులకు మేలు చేస్తుందని వేదవాక్కు. సాధారణ స్నానం దేహాల్ని శుద్ధిచేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి శాంతాన్ని, స్థిరత్వాన్ని కలిగిస్తుందంటారు. అందుకే స్నానం నిత్యవిధి అని విజ్ఞులు చెబుతారు.


               వైశాఖమాసం- వ్రతం- ఆచరణం

వైశాఖ మాసం ఆధ్యాత్మిక సాధనకి అద్భుతమైన మాసాలలో ఒకటి. వైశాఖము, మాఘము, కార్తికము – ఈ మూడింటినీ ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు. ఏవిధంగా అయితే కార్తీక పురాణం, మాఘ పురాణం ఉన్నాయో అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు. ఆధ్యాత్మికంగా భగవదనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్ని విధాలా అనుకూలమైనది. సాధనా మాసంగా దీనిని నిర్వచించవచ్చు. వసంతఋతువులో రెండవ మాసం ఇది. దీనికి వైదిక నామం మాధవ నామము. మధు అని చైత్రమాసానికి, మాధవ అని వైశాఖ మాసానికి అంటారు. వైశాఖమాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది.

వైశాఖంలో రకరకాల వ్రతాలు చెప్పారు :

🔶 వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం నారాయణుని తులసితో ఆరాధించడం చేయాలి. ఆ తులసి కూడా కృష్ణ తులసి సమర్పిస్తే శ్రేష్టం అని ధర్మశాస్త్రం చెప్తున్నది.

🔶 విష్ణుసహస్రనామ పారాయణ వైశాఖం అంతా చాలా    ప్రశస్తమైనటువంటిది.

🔶 అనునిత్యం కూడా అశ్వత్థ వృక్షానికి సమృద్ధిగా జలం పోసి ప్రదక్షిణలు చేయడం, వైశాఖం అంతా చేసినట్లయితే అభీష్ట సిద్ధి లభించడమే కాక పితృదేవతలు తృప్తి చెందుతారు అని చెప్తున్నారు.

🔶 గళంతిక ఆరాధన – శివునకు ఈ మాసమంతా అభిషేకం చేస్తే చాలా ప్రసిద్ధి. అనునిత్యం శివారాధన అభిషేకంతో చేయాలి. అది ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదైవిక తాపత్రయాలను తొలగించి మనశ్శాంతినిస్తుంది. అందుకు శాంతి కోసం శివునికి అభిషేకం చేస్తారు. శివాలయాలలో శివునకు పైన గళంతికను ఏర్పాటు చేయడం కూడా చాలా మంచిది. దీనినే దారాపాత్ర అంటారు. నిరంతరం శివుడి మీద ధార పడేటట్లుగా ఒక పాత్రను ఏర్పాటు చేయాలి. ఇలా నెలంతా శివునిపై ధార పడేటట్లు చేసినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి వేదనలు, తాపాలు, అరిష్టాలు నశిస్తాయని ధర్మశాస్త్రములు చెప్తున్న విషయం.

🔶 వైశాఖంలో ఉదకుంభ దానము. అంటే నీటితో నింపిన పాత్రను దానం చేయడం. బాటసారులకు చలివేంద్రములు ఏర్పాటు చేసి జలాన్ని ఇవ్వడం వైశాఖంలో ప్రసిద్ధి.


వైశాఖ మాసంలో ఏవి దానం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది?

💠 మామిడిపళ్ళు    పితృదేవతలు సంతోషిస్తారు,    పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది.

💠 పానకం కుండ    పితృదేవతలకు వంద సార్లు                 గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యఫలం దక్కుతుంది.

💠 దోస, బెల్లం, చెరుకు   సర్వపాపాలు నశిస్తాయి.

💠 మంచం       సుఖసంతోషాలు అభివృద్ధి చెందుతాయి.

💠 వస్త్రాలు    ఆయుష్షు వృద్ధి, ముఖ్యంగా తెల్లవస్త్రాన్ని దానం చేస్తే పూర్ణాయుష్షు  పొంది అంత్యంలో ముక్తిని పొందుతారు.

💠 కుంకుమ    స్త్రీలకు పూర్ణ ఆయుష్షు కలిగిన భర్త లభిస్తాడు, ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.

💠 గంధం    తరచుగా ప్రమాదాలకు గురికాకుండా తప్పించుకోగలరు

💠 తాంబూలం      అధిపతులు అవుతారు.

💠 కొబ్బరికాయ    ఏడు తరాల పితృదేవతలను నరకభాదల నుండి విముక్తులను చేస్తారు

💠 మజ్జిగ   సరస్వతీదేవి అనుగ్రహంతో విద్యాప్రాప్తి  కలుగుతుంది.

💠 చెప్పులు     నరకబాధల నుండి విముక్తి లభిస్తుంది.

💠 గొడుగు  సమస్త దోషాలు నివారింపబడతాయి, కష్టాల నుండి విముక్తి పొందుతారు, మృత్యుబాధ ఉండదు.

💠 ఫలాలు    జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

💠 బియ్యం  అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యం ప్రాప్తిస్తుంది.

💠 ఆవునెయ్యి   అశ్వమేథయాగం చేసిన పుణ్యం లభిస్తుంది, విష్ణు సాయుజ్యం పొందుతారు.  పితృదేవతలకు వదిలినవారికి దారిద్ర్య                       బాధ ఉండదు.

💠 అన్నదానం   విశేష ఫలితం పొందుతారు, సమస్త దేవతల ఆశీస్సులు పొందుతారు, సర్వధర్మాలను                                                                                         ఆచరించిన ఫలితం పొందుతారు.

💠 పెరుగు అన్నం  చేసిన కర్మలు తొలగి పుణ్యం లభిస్తుంది.


వైశాఖ శుద్ధ తదియ - అక్షయ తృతీయ
తృతీయనాడు కృతయుగం ఆరంభమైందని, కనుక ఈ కృతయుగాదినే అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుతారని అంటారు. ఈ అక్షయ తృతీయ గురించి భవిషోత్తర పురాణం చెప్తోంది. సౌభాగ్యాన్ని వృద్ధి చేసే ఈ అక్షయ తృతీయనాడు బదరీ నారాయణుని దర్శించితే సకల పాపాలు నశిస్తాయని అంటారు. అక్షయ తృతీయనాడు లక్ష్మీదేవిని పూజించే ఆచారం కూడా కొన్నిచోట్ల కనిపిస్తుంది. ఈ రోజు మొదలుకొని అన్నీ పర్వదినాలే.

వైశాఖ శుద్ధ తదియ - సింహాచల చందనోత్సవం
 ఈ శుక్ల తదియనాడు సింహాచలేశుడు తన భక్తులకు నిజరూప దర్శనాన్ని కలుగచేస్తాడు. తదియనాడు ఆ సింహాచల వరాహ నృసింహుని చందనోత్సవాన్ని జరుపుతారు. లోకాలన్నీ కూడా చందనమంత చల్లగా ఉండాలనీ కోరుకొని ఈ చందనోత్సవంలో జనులందరూ పాల్గొంటారు.

వైశాఖ శుద్ధ తదియ - బలరామ జయంతి

ఈ శుద్ధ తదియనాడు శ్రీకృష్ణుని సోదరుడైన బలరాముడు కూడా రోహిణీ దేవికి జన్మించిన కారణాన బలరామ జయంతిని జరుపుకొంటారు.

వైశాఖ శుద్ధ తదియ - పరశురామ జయంతి

తండ్రి మాటలను జవదాటకుండా పితృవాక్య పరిపాలకునిగా పేరుతెచ్చుకొన్న జమదగ్ని పుత్రుడు ఈ భూమిని ఏలే రాజుల దాష్టీకాన్ని చూడలేక పరశువును పట్టుకొని 21సార్లు రాజులపై దండయాత్ర చేసాడు. అటువంటి పరశురాముడు దశరథ తనయుడు శివచాపాన్ని విరచాడన్న వార్త విని ఆ రాముని బలమేమిటో తెలుసుకొందామని వచ్చి రామునికి తన అస్త్రాలన్నింటినీ సంతోషంతో ధారపోసి మహేంద్రగిరికి తరలిపోయాడు.

వైశాఖ శుద్ధ పంచమి - ఆది శంకరాచార్య జయంతి

          పంచమినాడు అద్వైతాన్ని లోకంలో అక్షయంగా నిలిపిన ఆదిశంకరాచార్యుని జయంతి. ఆ ఆదిశంకరుడు చిన్ననాడే దరిద్రనారాయణులను చూసి కరుణాసముద్రుడై లక్ష్మీదేవిని స్తోత్రం చేసి వారిళ్ళను సౌభాగ్యాలకు నెలవు చేసాడు. ఆ లక్ష్మీ స్తోత్రమే కనకధారస్తోత్రంగా ఈనాటికీ విరాజిల్లుతోంది.

వైశాఖ శుద్ధ షష్టి - రామానుజ జయంతి

    ఆ తర్వాత బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్పిన రామానుజాచార్యుడు షష్ఠినాడు జన్మించిన కారణంగా రామానుజ జయంతిగా విశేషపూజలు చేస్తారు. తిరుక్కోటి యార్నంబి దగ్గర మోక్షపాప్త్రి కోసం తీసుకొన్న రహస్య మంత్ర రాజాన్ని లోకులందరినీ పిలిచి రామానుజుడు ఆనందంగా చెప్పేశాడు. రహస్యమైన దాన్ని బహిరంగ పరిచాడనే గురాగ్రహాన్ని కూడా లోకులకోసం భరించడానికి సంసిద్ధమైన రామానుజాచార్యుని గొప్పతనం తెలుసుకొని ఆ మార్గంలో నడవాల్సిన అవసరం నేటి మానవులకు ఎంతైనా ఉంది అని జ్ఞప్తి చేయడానికే ఈ రామానుజాచార్య జయంతి జరుపుతారంటారు.

వైశాఖ శుద్ధ  సప్తమి - గంగావతరణం

      తన పినతండ్రులు కపిల ముని కోపావేశానికి కాలి బూడిద అవ్వడం చూసి సహించలేని భగీరథుడు ఎన్నో ప్రయత్నాలు చేసి తపస్సులు చేసి కైలాసనాథుడిని మెప్పించి ఆకాశగంగను భువిపైకి తీసుకొని వచ్చాడు. ఈ గంగోత్పత్తి కూడా వైశాఖమాస సప్తమినాడే జరిగింది. ఈ గంగోత్పత్తిని పురస్కరించుకొని గంగాస్తుతిని చేసినవారికి పతితపావన గంగ సకలపాపపు రాశిని హరిస్తుందని పండితులు చెప్తారు.


వైశాఖ శుద్ధ ఏకాదశి - మోహినీ ఏకాదశి

ఈ మాసంలో వచ్చే ఏకాదశే మోహినిఏకాదశి అని అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించినవారికి మహావిష్ణువు అక్షయంగా సంపదలు ఇస్తాడని, వారు ఇహలోక ఆనందాన్ని అనుభవించిన పిమ్మట వారికి విష్ణ్ధుమ ప్రవేశం కలుగుతుందని పురాణ ప్రవచనం.

వైశాఖ శుద్ధ చతుర్దశి - శ్రీనృసింహజయంతి

తన భక్తుని కోరిక మేరకు సర్వాన్ని ఆక్రమించిన మహావిష్ణువు నృసింహుడై స్థంభంనుంచి ఆవిర్భవించి లోకకంటకుడైన హిరణ్యకశపుడిని సంహారం చేసి లోకాలన్నింటిని కాపాడినరోజు శుద్ధ చతుర్థశిగా భావించి నృసింహ జయంతిని చేస్తారు.హిరణ్యకశిపుడిని అంతమొందించడానికి శ్రీమహావిష్ణువు అవతరించినది ఈ దినమే. ఈ దినం ఉపవాసంను పాటించి స్వామివారిని పూజించడం లేదా స్వామివారి వ్రతం చేయడంతో పాటు స్వామివారు ఉద్బవించిన స్తంభం, ఇంటిగడపలను పూజిస్తారు.

వైశాఖ పూర్ణిమ - మహావైశాఖి

వైశాఖ పూర్ణిమకి మహావైశాఖి అని పేరు. దశావతారాల్లో ద్వితీయ అవతారమైన కూర్మరూపంను శ్రీమహావిష్ణువు ఈనాడే ధరించాడు.అలాగే హిరణ్యకశిపుడిని అంతమొందించి ఉగ్రరూపంలో తిరుగుతూ ఉండిన నృసింహస్వామి ఉగ్రరూపాన్ని తొలగించేందుకు శివుడు శరభుడిగా అవతరించిన దినమూ ఇదే.


వైశాఖ బహుళ దశమి - హనుమజ్జయంతి

వైశాఖ బహుళ దశమి హనుమజ్జయంతిగా చెప్పబడుతూ ఉన్నది. ఈ రోజు ఆంజనేయస్వామి వారిని సింధూర, తమలపాకులతో పూజించడంతో పాటూ వడమాలను ధరింపచేసి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించవలెను.
ప్రభు భక్తికి ప్రతీకగా నిలిచిన హనుమంతుడు జన్మించిన కారణంగా, హనుమజ్జయంతి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే జరుగుతాయి.

గౌతమ బుద్ధుడి జన్మదినం కూడా ఈరోజే. ఇంతటి విశిష్టమైన ఈనాడు సముద్రస్నానం చేయడం విష్ణువును పూజించడంతో పాటు సత్యనారాయణస్వామి వ్రతం చేయడానికి ఈ దినం ఉన్నతమైనది. అలాగే శ్రీవాసవీకన్యకాపరమేశ్వరీ, కూర్మజయంతి,నారద జయంతులు కూడా వైశాఖంలోనే కావడం ఈ మాస విశిష్టత. ఈ మాసంలో ఆచరించాల్సిన విధులన్నీ ఆరోగ్యరహస్యాలు కావడం విశేషం. బుద్ధపూర్ణిమ, సంపద్ గౌరీ వ్రతం వంటి పర్వదినాలు ఉన్నాయి. వైశాఖ మాసంలో అన్నదానాలు, వస్త్ర దానాలు, బియ్యం, మంచం, మామిడిపళ్ళు, మజ్జిగ, ఆవునెయ్యి, చెరుకురసం, అరటిపళ్ళు దానం చేసిన వారు అనంతమైన పుణ్యఫలాలు పొందుతారు.ఎందరో మహానుభావుల జయంతులు జరిపే ఈ వైశాఖం నుంచి మనం కూడా లోకకల్యాణకారకమైన పనులు చేయాలనే భావనను ఏర్పరుచుకోవాలి. ఇక కార్తీక మాసం. మాఘ మాసాల మాదిరిగానే ఈ మాసంలో చేసే నదీ స్నానం విశేషమైన ఫలితాలను ఇస్తుందని చెప్పబడుతోంది.

తతస్సతు మహాతేజా: శ్రుతదేవో మహాయశా: |
సంతుష్ట: పరమప్రీత: యయౌ ధామస్వకం ముని: ||

త్రయోదశ్యాం చతుర్దశ్యాం పౌర్ణమాస్యాం చ మాధవే |
స్నానం దానం పూజనంచ కథాశ్రవణమేవచ ||

వైశాఖ ధర్మనిరత: సవై మోక్షమవాప్నుయాత్‌ |
ధనశర్మా బ్రాహ్మణశ్చ ప్రేతశ్చైవయధాపురా ||

నారద ఉవాచ – నారదుడు పలికెను

ఇత్యేతత్పర మాఖ్యానం అంబరీస తవోదితమ్‌ |
శ్రవణాత్సర్వ పాపఘ్నం సర్వసంపద్విధాయకమ్‌ ||

తేన భుక్తించ ముక్తించ జ్ఞానం మోక్షం చ విందతి |
ఇతి తస్య వచశ్శ్రుత్వా అంబరీషో మహాయశా: ||

ప్రహృష్ణాంతర వృత్తిశ్చ బాహ్య వ్యాపారవర్జిత: |
ప్రణనామ తతో మూర్ధ్నా దండవత్పతితో భువి ||

      అంతట మహాతేజస్వి అయిన మహాయశస్వి అయిన శ్రుతదేవుడు సంతోషించి మరమప్రీతిని చెంది తన ఇల్లును చేరుకొనెను. త్రయోదశినాడు చతుర్దశనాడు పూర్ణిమనాడు వైశాఖ మాసమున స్నానము దానము పూజనము కథాశ్రవణములను చేయుచు వైశాఖ ధర్మనిరతుడైనవాడు మోక్షమును పొందును. ధనశర్మ బ్రాహ్మణుడు, ప్రేత కూడా మోక్షమును పొందియున్నారు. ఇలా చెప్పిన నారదుడు అంబరీషునితో ఇట్లు అంటున్నాడు. వినుట వలన అన్ని పాపములను నశింపచేయునది, సకల సంపదలను అందించునది. అట్టివాడు భుక్తిని, ముక్తిని, జ్ఞానమును, మోక్షమును పొందును. ఇట్లు నారదమహర్షి మాటలను వినిన మహాయశస్వి అయిన అంబరీషుడు అంతరంగమున సంతోషప్రవృత్తి కలవాడై బాహ్య వ్యాపారములను విడిచినవాడై భూమిపై దండము వలె పడి శిరస్సు వంచి నమస్కరించెను.


       🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏


✍️ “ సాంప్రదాయం “

Saturday 5 May 2018

వైశాఖ పురాణం స్నాన సంకల్పము



                      వైశాఖమాస స్నాన సంకల్పము


శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||
సర్వపాపహరం పుణ్యం స్నానం వైశాఖకాలికం |
నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమోస్తుతే ||
వైశాఖః సఫలోమాసః మధుసూదన దైవతః |
తీర్థయాత్రా తపోయజ్ఞ దానహోమఫలాధికః ||
వైశాఖః సఫలం కుర్యాత్ స్నానపూజాదికం |
మాధవానుగ్రహేణైవ సాఫల్యంభవతాత్ సదా ||
మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరరౌ |
ప్రాత స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ ||

ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా శ్రీ శివశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే  శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా/గంగా/గోదావర్యోః మధ్యదేశే అస్మిన్(ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, ఉత్తరాయనే, వసంతఋతౌ, వైశాఖమాసే, ....పక్షే , ....తిధౌ, ......వాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, గంగావాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాశేః పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతుఫలావాప్త్యర్థం, ఇహజన్మని జన్మాంతరేచ బాల్య యౌవ్వన కౌమారవార్ధకేషు, జాగ్రత్ స్వప్నసుషుప్త్యవస్ధాను జ్ఞానతో జ్ఞానతశ్చకామతో కామతః స్వతః ప్రేరణతయా సంభావితానాం, సర్వే షాంపాపానాం అపనోద నార్ధంచ గంగా గోదావర్యాది సమస్త పుణ్యనదీ స్నానఫల సిద్ధ్యర్ధం, కాశీప్రయాగాది సర్వపుణ్యక్షేత్ర స్నానఫలసిద్ధ్యర్థం, సర్వపాపక్షయార్ధం, ఉత్తరోత్తరాభివృద్ధ్యర్ధం మేషంగతేరవౌ మహాపవిత్ర వైశాఖమాస ప్రాతః స్నానం కరిష్యే.

సంకల్పము చెప్పుకొనుటకు ముందు చదువవలసిన ప్రార్థనా శ్లోకము


గంగాగంగేతియోబ్రూయాత్ యోజనానాంశతైరపి
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి ||
పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకాభయంకరి
మృత్తికాంతే ప్రదాస్యామి ఆహారార్దం ప్రకల్పయ ||
అంబత్వద్దర్శనాన్ముక్తిర్నజానే స్నానజంఫలం
స్వర్గారోహణ సోపాన మహాపుణ్య తరంగిణి ||
విశ్వేశం మాధవండుంఢిం దండపాణీం చ భైరవం
వందేకాశీం గుహం గంగాం భవానీం మణికర్ణికాం ||
అతితీక్షమహాకాయ కల్పాంత దహనోపమ
భైరవాయనమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి ||
త్వంరాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పితా
యాచితో దేహిమే తీర్థం సర్వపాపాపనుత్తయే ||
యోసౌసర్వగతో విష్ణుః చిత్ స్వరూపీనిరంజనః
సేవద్రవ రూపేణ గంగాంభో నాత్రసంశయః ||
నందినీ నళినీ సీతా మాలినీ చమహాసగా
విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపధ గామినీ ||
భాగీరధీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ
ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే
స్నానకాలేపఠేత్ నిత్యం మహా పాతక నాశనం ||
సమస్త జగదాధార శంఖచక్ర గదాధర
దేవదేహిమమానుజ్ఞాం తవ తీర్థ నిషేవణే ||
నమస్తే విశ్వగుప్తాయ నమో విష్ణుమపాంసతే
నమోజలధిరూపాయ నదీనాంపతయే నమః ||
మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ
ప్రాతఃస్నానం కరిష్యామి నిర్విఘ్నంకురు మాధవ ||


స్నానం తరువాత ప్రార్థనాశ్లోకాలను చదువుతూ, ప్రవాహానికి యెదురుగా, వాలుగా తీరానికి పరాజ్ముఖముగా కుడిచేతి బొటనవ్రేలుతో నీటిని కదిలించి 3 దోసిళ్ల నీళ్లు తీరానికి జల్లి, తీరానికి చేరి కట్టుబట్టలను పిండుకోవాలి, తరువాత మడి/పొడి బట్టలను కట్టుకొని తమ సాంప్రదాయానుసారం విభూతి వగైరాలని ధరించి సంధ్యావందనం చేసుకోవాలి. తరువాత నదీతీరాన/గృహమున దైవమును అర్చించాలి. స్నానము చేయుచు క్రింది శ్లోకములను చదువుచు శ్రీహరికి - యమునికి అర్ఘ్యమునీయవలెను.


వైశాఖే మేషగే భానౌ ప్రాతఃస్నాన పరాయణః |
అర్ఘ్యం తేహం ప్రదాస్వామి గృహాణమధుసూదన ||
గంగాయాః సరితస్సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే |
ప్రగృహ్ణీత మయాదత్త మర్ఘ్యం సమ్యక్ ప్రసీదధ ||
ఋషభః పాపినాంశాస్తాత్వం యమ సమదర్శనః |
గృహాణార్ఘ్యం మయాదత్తం యధోక్త ఫలదోభవ ||

                               దానమంత్రం
ఏవం గుణవిశేషణ విశిష్టాయాంశుభతిథౌ అహం .....గోత్ర, .....నామధేయ ఓం ఇదం వస్తుఫలం(దానంయిచ్చే వస్తువుని పట్టుకొని) అముకం సర్వ పాపక్షయార్థం, శుభఫలావాప్త్యర్థం అముక ......గోత్రస్య(దానం పుచ్చుకొనేవారి గోత్రం చెప్పాలి) ప్రాచ్యం/నవీనందదామి అనేన భగవాన్ సుప్రీతః సుప్రసన్నః భవతు దాత దానము నిచ్చి అతని చేతిలో నీటిని వదలవలెను.

                         దాన పరిగ్రహణ మంత్రం
ఓం ఇదం, ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్ధాత్ అముకం ......గోత్ర, ....నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్ధం ఇదం అముకం దానం ఇదమితి దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిగృహ్ణామి స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును.

పురాణ ప్రారంభమున వైష్ణవులు చదువదగిన ప్రార్థనా శ్లోకములు


యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ||

యత్ర యోగీశ్వరః కృష్ణః యత్రపార్థో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయోభూతిః ధ్రువానీతిః మతిర్మమ ||
లాభస్తేషాం జయస్తేషాంకుత స్తేషాంపరాభవః
యేషా మిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ||
అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ
ఆ కర్ణపూర్ణ ధన్వానౌ రక్షతాం రామలక్ష్మణౌ ||
సన్నద్ధః కవచీఖడ్గీ చాపబాణధరోయువా
గచ్ఛన్ మమాగ్రతో నిత్యం రామః పాతుసలక్ష్మణః ||
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశమ్
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్ ||
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యమ్
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ||
ఉల్లాస పల్లవితపాలిత స్పతలోకీం నిర్వాహకోరకిత నేమకటాక్షలీలాం
శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః ||

పురాణము ముగించునప్పుడు చదువదగిన ప్రార్థనా శ్లోకములు


విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ ||
వందేలక్ష్మీం పరశివమయీం శుద్దజాంబూనదాభాం
తేజోరూపాం కనకవసనాం స్వర్ణ భూషోజ్జ్వలాంగీం ||
బీజాపూరం కనక కలశం హేమపద్మం దధానాం
ఆద్యాంశక్తీం సకలజననీం విష్ణువామాంకసంస్థాం ||
కుంకుమాంకితవర్ణాయ కుందేందు ధవళాయచ
విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః ||
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయాంతాం న్యాయ్యేన మార్గేణ మహీంమహీశాః
గోబ్రహ్మణేభ్యః శుభమస్తు నిత్యంలోకా స్సమస్తాస్సుఖినోభవంతు ||
కాలేవర్షతు పర్జన్యః పృధివీసస్యశాలినీ
దేశోయంక్షోభరహితో బ్రహ్మణాస్సంతు నిర్భయాః ||
స్వకాలే భవితావృష్టిః దేశోస్తునిరుపద్రవః
సమృద్ధా బ్రాహ్మణాస్సంతు రాజాభవతు ధార్మికః ||
సర్వేచ సుఖినస్సంతు సర్వేసంతునిరామయాః
సర్వేభద్రాణి పశ్యంతు నకశ్చిత్ పాపమాప్నుయాత్ ||
అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః
అధనాస్సధనాస్సంతు జీవంతు శరదాంశతం ||

పురాణ ప్రారంభమున శివ సాంప్రదాయము వారు చదవవలసిన ప్రార్థనా శ్లోకములు


అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే ||
వందే శంభు ముపాపతీం సురుగురం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాంపతిం ||
వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం ||
తప్త స్వర్ణవిభా శశాంకమకుటా రత్నప్రభాభాసురా
నానావస్త్ర విరాజితా త్రిణయనాభూమీరమాభ్యాం యుతా ||
దర్వీహాటక భాజనం చదధతీరమ్యోచ్చపీనస్తనీ
నృత్యంతం శివ మాకలయ్య ముదితాధ్యేయాన్నపూర్ణేశ్వరీ ||
భవానీ శంకరౌవందే శ్రద్దా విశ్వాసరూపిణో
యాభ్యాంవినాన పశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరం ||
ఉక్షం విష్ణుమయం విషాణకులిశంక రుద్ర స్వరూపంముఖం
ఋగ్వేదాది చతుష్టయంపద యుతం సూర్యేందు నేత్ర ద్వయం ||
నానాభూషణ భూషితం సురనుతం వేదాంత వేద్యంపురం
అండం తీర్థమయం సుధర్మ హృదయం శ్రీనందికేశంభజే ||

పురాణం ముగించునపుడు చదవదగిన ప్రార్థనా శ్లోకములు


సాంబోనః కులదైవతం పశుపతే సాంబత్వదీయా వయం
సాంబం స్తౌమిసురాసురోగగణాః సాంబేన సంతారితాః ||
సాంబాయాస్తు నమో మయావిరచితం సాంబాత్ పరంనోభజే
సాంబస్యామ చరోస్మ్యహం మమరతిః సాంబే పరబ్రహ్మణి ||
ఓంకార పంజరశుకీం ఉపనిషదుద్యానకేళి కలకంఠీం
ఆగమవిపిన మయూరీం ఆర్యామంతర్వి భావయే గౌరీం ||
యశ్శివోనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతోజయ మంగళం ||
నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక
మహాదేవస్య సేవార్థమనుజ్ఞాం దేహిమే ప్రభో ||
వేదపాదం విశాలాక్షం తీక్ష్ణ శృంగంమహోన్నతం
ఘంటాంగళే ధారయంతాం స్వర్ణరత్న విభూషితం
సాక్షాద్ధర్మ తనుందేవం శివవాహం వృషంభజే ||
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీంమహీశాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యంలోకా స్సమస్తాస్సుఖినోభవంతు ||
కాలేవర్షతు పర్జన్యః పృధివీ సస్యశాలినీ
దేశోయంక్షోభరహితో బ్రహ్మణాస్సంతు నిర్భయాః ||
స్వకాలే భవితావృష్టిః దేశోస్తునిరుపద్రవః
సమృద్ధా బ్రాహ్మణాస్సంతు రాజాభవతు ధార్మిక ||
సర్వేచ సుఖినస్సంతు సర్వేసంతునిరామయాః
సర్వేభద్రాణి పశ్యంతు నకశ్చిత్ పాపమాప్నుయాత్ ||
అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః
అధనాస్సధనాస్సంతు జీవంతు శరదాంశతం ||



          🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏


✍️ " సాంప్రదాయం "