Friday 27 July 2018

గురుపౌర్ణమి - వ్యాస పూర్ణిమ


                               గురుపౌర్ణమి


          మనందరిలోనూ పవిత్రమయిన హృదయం ఉంది.
కాని చీకటి అనే అజ్ఞానంతో మనసంతా చెడు ఆలోచనలతోనూ, దుర్గుణాలతోను నిండిపోవడం వల్ల
దానిని గుర్తించ లేకపోతున్నాము. మన అజ్ఞానం ఎంతంటే? దీపం వెలిగించ మన్నప్పుడు నీటికీ , నూనెకు తేడా తెలియనట్టు వంటి చీకటి స్థితిలో ఉన్నాము. మరి ఈ చీకటి స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలించు కోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం.


గురువు అంటే :-

గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకటై జన్మించిన రూపం అంటే సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపమే గురువు. గు అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని  గురువు అంటే అజ్ఞానాన్ని నశింప చేయువారు అని అర్ధము. గు శబ్దమంధకారస్యరుతన్నిరోధకః అని పెద్దల వచనం!గురువు చేయవలసినది తన శిష్యులను అంధకారంలోంచి వెలుగులోకి తీసుకు రావడం. ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడూ సంసారయాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు కర్తవ్యం.

ఆ గురువు సాన్నిధ్యంలో కామ క్రోధ,లోభ,మోహ, మద, మాత్సర్యాలు అనే దుర్గుణాలను, అహంకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం పవిత్రమవుతుంది. అప్పుడు ఆ పవిత్ర మైన హృదయంలో జ్ఞానమనే దీపం వెలిగించుకోవడం సాధ్యమవుతుంది.

విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఒకప్పుడు గురుకులాలుండేవి.వాటిలో చేరిని విద్యార్థులకు తల్లీ తండ్రీ అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే.

"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"

దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు.
"గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్త కబీర్ దాస్. అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.


గురు పూర్ణిమ విశిష్టత :-

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ !
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ !!

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే !
నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః !!

ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మ తిథి అయిన గురు పూర్ణిమ గా మనం జరుపుకుంటాం. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.

గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు.

సనాతన ధర్మంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయనను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.

లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిఅయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది. మామూలు రోజులలో కన్నా ఈ వ్యాస పూర్ణిమ నాడు గురువు నుండి వెలువడే ఆశీర్వచనాలు వేయి రెట్లు ఎక్కువగా పొంద వచ్చట.. అందుకే ఈ రోజు గురుపూజోత్సవం లో పాల్గొని గురువు కరుణా కటాక్షములను పొందవచ్చు..

గురు అనే పదంలో ’గు’ అనే అక్షరం అంధకారాన్ని ’రు’ అనే అక్షరం వెలుగును సూచిస్తాయి..

ఙ్ఞానశక్తి సమారూఢః తత్త్వమాలావిభూషితః |
భుక్తిముక్తి ప్రదాతా చ తస్మై శ్రీ గురవే నమః ||

శిష్యునిలో అజ్ఞానాంధకారాలను తొలగించే బాధ్యతను గురువు తీసుకుంటాడు.. కాబట్టి... గురువుకే ప్రథమ స్థానమునిచ్చారు.. మాతా, పిత, గురువులలో జన్మనిచ్చిన వారి ప్రక్కన గురువుకి అత్యంత విశిష్టమైన స్థానాన్ని కల్పించినది ఇందుకే...

అలానే ఈ రోజు తప్పకుండా ఈ శ్లోకం స్మరించుకోవాలి..

నమోస్తుతే వ్యాస విశాల బుద్దే పుల్లార వి౦దాయత పత్రనేత్ర |
వినత్వయా భారత తైల పూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమాయః ప్రదీపః ||

•  • •  • • •  • • • •  • • • • •  • • •

న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః ||
(’గురువును మించిన తత్వం తపస్సు జ్ఞానం వేరొకటి లేవు’)

గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వసిష్ఠులవారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి.

వ్యాస పూర్ణిమ :: గురుపూర్ణిమ


నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతీ ద్వాపరయుగం లోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపరయుగంలో2 పాదాలతో, ఈ కలియుగంలో 1 పాదంతో, నడుస్తుంది.
వసిష్ఠమహామునికి మునిమనుమడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరమునికి పుత్రుడు, శుకమర్షికి జనకుడైనట్టియు, నిర్మలుడైనట్టి, తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము. ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, అంటారు
నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు.

వ్యాసమహర్షి ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు. ప్రతి ద్వాపర యుగములోను ఒక సారి వ్యాసుడు ఉద్భవిస్తాడు. ప్రస్తుతం మనం ఉంటున్నది వైవస్వత మన్వంతరంలో ని 28 వ యుగంలోని వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు కాలంలో.

ఇంతవరకు వ్యాసపీఠాన్నధిరోహించిన వ్యాసులు పేర్లు 1. స్వాయంభువ 2. ప్రజాపతి3. ఉశన 4. బృహశ్పతి 5. సవిత 6. మృత్యువు 7. ఇంద్ర 8. వశిష్ఠ 9. సారస్వత 10. త్రిధామ 11. త్రివృష 12. భరద్వాజ 13. అంతరిక్షక 14. ధర్ముడు 15. త్రయారుణ 16. ధనుంజయుడు 17. కృతంజయుడు 18. సంజయ 19. భరద్వాజ 20 గౌతమ 21. ఉత్తముడు 22. వాజశ్రవ 23. సోమశుష్మాయణ 24. ఋక్షుడు 25 శక్తి 26. పరాశరుడు 27. జాతూకర్ణి ప్రస్తుతం 28 వ వేదవ్యాసుని పేరు కృష్ణద్వైపాయనుడు.
ఆయన జన్మించిన తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ గా జరుపుకుంటాం. లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది.

ఈరోజు  28 వ వేద వ్యాసుల వారి జయంతి. ఇతడు పరాశర మహర్షికి,మత్స్య గంధికి (సత్యవతి) కి కృష్ణ వర్ణం (నల్లని రంగు) తో ఒక ద్వీపంలో జన్మించారు కనుక కృష్ణద్వైపాయనుడు అని పిలవబడ్డాడు. పుట్టీ పుట్టగానే చేతిలో కమండలం,దండము చేతబట్టి  తపస్సు చేసుకోవటానికి వెళ్తానని తల్లి మత్ష్యగంధి అనుమతితో తపస్సుకు వెళ్ళిన తపోధనుడు కృష్ణద్వైపాయనుడు.

వ్యాస మహర్షి నాలుగు వేదాలను విభజించి లోకానికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం సోమకాసురుడు వేదాలను సముద్రంలో దాచేస్తే..  శ్రీ మహా విష్ణువు మత్స్యావతారంలో ఆ వేదాలను తీసుకొచ్చాడు. అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసి కలగాపులగం అయిపోగా.. వాటిని వ్యాస మహర్షి విడదీసి విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడు. వేదరాశి ని నిత్య కర్మలలో క్రతువుల్లో వాడే ఉపయోగాలను బట్టి ఋక్-యజుర్-సామ-అధర్వణ వేదాలుగా విభజించి వేదవ్యాసుడైనాడు.ఆతర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా ...వేదసారాన్నంతా చేర్చి పంచమవేదంగా ప్రసిద్ధికెక్కిన భారత ఇతిహాసాన్ని గ్రంధస్తం చేసాడు.అంతేకాక భాగవతాన్ని,అష్టాదశ పురాణాలను మనకు ప్రసాదించాడు. సాక్షాతు శ్రీ మహా విష్ణువు అవతారంగా భావించే వ్యాస భగవానుని గానూ ఆదిగురువుగానూ భావిస్తారు.


విష్ణు సహస్రనామ పీఠిక లో కూడా.....

"వ్యాసాయ విష్ణు రూపాయ-వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయ నమోనమ: !!

అని వ్యాసునికి విష్ణువుకు  అభేదం చెప్ప బడింది, వేదవ్యాసుడు అనంతంగా ఉన్న వేదాలని విభజించి  పైలుడను శిష్యునకు ఋక్సంహితను, వైశంపాయనునకు యజుస్సంహితను, జైమినికి సామసంహితను, సుమంతునకు అధర్వణ సంహితను భోధించి వానిని లోకములో  వ్యాప్తి చేయండని ఆదేశించాడు.  వ్యాసుడు వేదాలని విభజించటమే కాకుండా అష్టా దశ పురాణాల్ని,ఉపపురాణాలను రచించాడు. బ్రహ్మసూత్రాల్ని వివరించాడు, భారత, భాగవతాలని రచించాడు. తాను గ్రంథస్థం చేసిన పురాణేతిహాసములను సూతునకు తెలియజేసి ప్రచారం చేయమని చెప్పాడు.
వ్యాస భగవానుని అనుగ్రహం వలన జ్ఞానం విస్తరించి విశ్వవ్యాప్తం అయ్యింది. సూత మహాముని ప్రథాన ప్రచారకుడై విషయములు బహుళ ప్రచారం చేసాడు.

స్మృతి కర్తలలో వ్యాసులవారు ఒకరు.  రెండధ్యాయముల ఈ గ్రంథానికి లఘు వ్యాస స్మృతి అని పేరు. ఇందులో మానవులకు ఉపయోగ పడే ఆచార విషయములు ఉన్నాయి. ఇదే వ్యాస సంహిత గా విఖ్యాతి పొందింది.

వ్యాస మహర్షి సుపుత్రుని కోసం తపస్సు చేసి శివుని నుంచి వరాన్ని పొందాడు. ఆయనకు ఘృతాచి  అనే అప్సరస వలన బ్రహ్మ జ్ఞాని ఐన శుకుడు జన్మించాడు.

వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే, పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజమ్ వందే శుక తాతం తపోనిధిమ్ ||

తాత్పర్యం: వశిష్టుని మునిమనుమడైన కల్మష రహితుడైన శక్తికి మనుమడైన పరాశరుని కుమారుడైన, శుకమహర్షి తండ్రి అయిన ఓ వ్యాస మహర్షి నీకు వందనము.

" వ్యాసో నారాయణో హరిః " అన్నారు. వ్యాస భగవానులు సప్త చిరంజీవులలో ఒకరు.



మహాభారత రచన :-

మహాభారత రచనకు తనమనసులో ఒక ప్రణాళికను తయారుచేసుకొన్నాడు వేదవ్యాసుడు. తాను చెబుతుంటే..... అంత వేగంగా వ్రాసే వారు ఎవరు ఉన్నారూ అని విచారంలో ఉండగా..... బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి, అతని ఎదుట ప్రత్యక్షమయ్యి "వ్యాసా ! నీ కావ్యరచనకి, తగినవాడైన గణపతిని స్మరించు." అని తెలిపి అద్రుశ్యమయ్యాడు. అంతట వ్యాసుడు గణేశుని ప్రార్థించగా.... గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. నేను మనసులోనే రచించిన భారతాన్ని నేను చెబుతూ ఉంటే నీవు  వ్రాయాలి అని కోరాడు వ్యాసుడు. సరే అని ఒక షరతు పెట్టాడు గణేశుడు. నేను వ్రాసే ఘంటం ఆగకుండా నీవు చెప్పాలి. నా ఘంటం ఆగిన యెడల నేను వ్రాయను అని అన్నాడు. దానికి వ్యాసుడు అంగీకరించి నేను చెప్పిన శ్లోకాలను అర్థం చేసుకొని నీవు వ్రాయాలి అని అన్నాడు.... ఈ నియమానికి అంగీకరించాడు గణపతి. ఇలా వేద ధర్మాలను ప్రతిపాదిస్తూ వేదవ్యాసుడు చెబుతూ ఉంటే, నాలుగు వేదాల సారమైన పంచమవేదం అని మనం చెప్పుకొనే మహాభారతం అవతరించింది.

ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై దృతరాష్టుని, అంబాలికకు పాండు రాజుని, అంబిక దాసికి విదురుని ప్రసాదించినాడు.పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే! దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలుపొందాడు.కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా మూడు సంశ్ర…మించి జయం అనే పేరు మీద వారి గాథలు గ్రంథస్థం చేసాడు వ్యాసుడు. ఆ జయమే మహా భారతమైంది.
కలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయువులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా.... అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు. అర్థం చేసుకోలేరు.

వేదమంటే అసలు ఎవరూ తయారుచేసింది కాదు. స్వయం భగవానుని ముఖతః వేలువడినదే వేదము. అందుకే అతనిని "వేదపురుషుడు" అని అంటారు. వేదములో విషయాలు ఉన్నాయి. వేదములో లేనివి--- మరెక్కడా లేవు. ఇవన్నీ కలగాపులగంగా ఏక రూపంలో ఉంటాయి. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని, భగవానుడే ప్రతీ ద్వాపరయుగంలోనీ వ్యాసుడుగా అవతరించి, వేదాలను విభజిస్తాడు మందబుద్దుల కోసం వేదాధ్యాయానికి, అవకాశం లేనివారికోసం వేదంలోని విశేషాలను, ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందించాడు.  


ప్రాచీన గాథలు, గత కల్పాలలో జరిగిన చరిత్రలు, సృష్టికి పూర్వం అనేక సృష్టులలో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమయినాయి. ఎవరు వాటిని అర్ధం చేసుకోవాలన్నా, ఇతరులకి చెప్పాలన్నా అంతరార్ధాలతో బోధించాలన్న వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం. వ్యాస మహర్షి అంశ లేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేదు, చదవలేదు.అందుకే వ్యాసపూర్ణిమ నాడు వ్యాస పూజను తప్పక చేయాలంటారు. ఈ పర్వము యతులకు అతి ముఖ్యం! వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు.


పూజా విధానం (వ్యాస పూజ / గురు పూజా విధానం)...

కొత్త అంగవస్త్రం మీద (భూమి మీద పరచి) బియ్యం పోస్తారు. ఆ బియ్యంపైన నిమ్మ కాయలు ఉంచు తారు. శంకరులు, అతని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికిడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపు తారుట. బియ్యం, కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం. నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన. బియ్యం, నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. దక్షిణాదిన కుంభ కోణంలో, శృంగేరీలో శంకర మఠాలలో వ్యాసపూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు.

ఎంతో మంది ఋషులున్నా వ్యాసుని పేరిటే ఎందుకు జరుగుతుంది అంటే, ఈ పూజలో ప్రత్యేక పూజలు పొందే ఆది శంకరులు వ్యాసుని అవతారమని అంటారు. సన్యాసులంతా ఆది శంకరుని తమ గురువుగా ఎంచుకుంటారు. అయితే ఈ రోజున సన్యాసులంతా వ్యాసుని రూపంలో వున్న తమ గురువుని కొలుస్తున్నారన్న మాట! వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమనాడు విష్ణులోకం పొందుతారుట. వ్యాసుడు సకల కళా నిధి, సకల శాస్త్రవేత్త, శస్త్ర చికిత్సవేది, మేధానిధి, వైద్యవరుడు, ఆత్మవిద్యానిధి, వైద్య విద్యానిధి.ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి.

వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి.

శో: శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం
సూత్ర భాష్యవృతా వందే భగవంతౌ పునః పునః

అని పఠిస్తే బ్రహ్మత్వసిద్ధి కలుగును!


గురు సందేశము :-

వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.' పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది.

సర్వభూతముల యందు దయకలిగియుండుట, సత్యమార్గములో నడుచుట, శాంతగుణాన్ని కలిగియుండుట----ఈ మూడు గుణాలని అందరూ అలవరచుకోవాలి అని వ్యాసులవారు తెలియచేసారు.

మనందరికీ దేవరుణము, ఋషిరుణము, పితృఋణము---అని మూడు ఋణాలు ఉంటాయి. వీటితోపాటు వేదవ్యాసుడు మనుష్య ఋణము కూడా ఉంటుందని తెలియచెప్పాడు. సర్వప్రాణుల యందు దయతో ఉండటం, ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్య ఋణం తీర్చుకోవచ్చును అని చెప్పాడు.

ఇంతటి ఆది గురువుని పూజించుట మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తరవాత తరాలకి అందించుట మన ధర్మం.

మన పిల్లలకు ఇతిహాస, పురాణాల పట్ల, ప్రాచీన సంస్కృతీసాంప్రదాయాల పట్ల, అభిరుచి కలిగించుట మన కర్తవ్యం. వీటిలో కొన్నయినా సాధించగలిగితే వ్యాసులవారి ఋణం కొంతయినా మనం తీర్చుకున్నట్లు అవుతుంది. ఆ వ్యాసభగవానుని కృపకు మనము పాత్రులము కాగలము అని ఆశిద్దాం. అందుకే గురుపూజను చేసుకుందాం. సాటి గురువులో భగవంతుని దర్శిద్దాం.

Saturday 21 July 2018

తొలి ఏకాదశి



తొలి ఏకాదశి



శాన్తాకారం, భుజగ శయనం, పద్మ నాభం, సురేశం |
విశ్వాకారం, గగన సదృశం, మేఘ వర్ణం, శుభాంగం ||
లక్ష్మీ కాంతం, కమల నయనం, యోగి హృద్యాన గమ్యం |
వందే విష్ణుం, భవ భయ హరం, సర్వ లోకైక నాథం  ||

23-7-2018
ఆ రోజు తొలి ఏకాదశి.ఆషాడ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని తొలిఏకాదశి అంటారు.తొలి ఏకాదశి అంటే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అని.ఈ రోజున ఆ పరమాత్మ అయిన శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి జారుకుంటారు. జీవుల కర్మఫలాల గురించి ఆలోచించి, నిద్ర లేవగానే ఎవరి కర్మలను బట్టి వారికి ఏ జన్మను ప్రసాదించాలో నిర్ణయిస్తారు.కాబట్టి మనకు కావలసిన దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తం అన్ని ఎవరికి ఎన్ని ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తూ, మన తప్పుఒప్పులకు లెక్కలు వేయడానికి యోగనిద్రలోకి ఉపక్రమించే రోజు ఈ తొలిఏకాదశి.


ఆషాడే తు సితే పక్షే ఏకదశ్యా ముషోషిత: !
చాతుర్మాస్యవ్రతంకుర్యా ద్యత్కించి న్నియతో నరః !!

వార్షికాం శ్చుతురో మాసా న్వాహ యేత్కేనచి న్నరః !
ప్రవతేన నోచే దాప్నోతి కిల్బిషం వత్సరోద్భవమ్. !!

ఈ రోజున ప్రతి ఒక్కరు పాటించవలసిన నియమాలు:-

🌻 బ్రహ్మీ మూహుర్తంలో నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి.

🌻దగ్గరలో ఉన్న నదిలో నదీస్నానం ఆచరించాలి.లేదా కనీసం బావి స్నానం అన్నా చేయాలి.

🌻మనసా, వాచా అన్నింటిని శుద్ధి చేసుకుని, పూజగదిని శుభ్రం చేసుకుని భగవంతుని అలంకరించి శక్తి మేరకు ధూప, దీప, నైవేధ్యాలను, హారతిని సమర్పించి ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి.

అయ్యా! ఈ రోజు నేను ఉపవాస వ్రతం చేస్తూ, మౌనవ్రతం చేస్తాను.నీ నామసంకీర్తనం తప్ప నా నోట కానీ, మనస్సులో కాని వేరే అలోచన రానివ్వను అని భగవంతుని ధ్యానంలో కాలం గడపాలి.

🌻సాయంత్రం దీపారాధన చేసి రాత్రంతా కీర్తనలు చేసి జాగరణ చేసి మర్నాడు ఉదయం ఆరు గంటల లోపు ప్రసాదం స్వీకరించాలి.


ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్
వ్రతవర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్
దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః !!

భగవంతుడు యోగనిద్రలో ఉంటారు కదా, మనము చేసే పూజలు ఎవరికి చేరతాయి అనే అనుమానం మీరు పెట్టుకోనక్కరలేదు.
పరమాత్ముడికి ఐదు విభూతులు అని పేరు.

అందులో
🔹మొదటిది వైకుంఠంలో ఉండే ఆ శ్రీమహవిష్ణువుది పర అంటారు.ఈ స్వామి యోగనిద్రలోకి వెళ్ళి మన తప్పుఒప్పులను లెక్కలువేసి మన తదుపరి జన్మను నిర్ణయించేది.
🔹రెండోది క్షీరసాగరంలో వాసుకి మీద శయనించి ఉండే ఆ పరమాత్ముడిది, దీనినే వ్యూహం అంటారు.
🔹మూడోది అవతారాలలో ఉండే స్వామి అంటే రాముడు, కృష్ణుడు..వీరిని విభవము అంటారు.
🔹నాలుగోది, సర్వ జీవుల హృదయాలలో ఉండే స్వామిని అంతర్యామి అంటారు.
🔹ఐదోది మనము రోజు ఇంట్లో పూజించే స్వామి, అర్చ్యామూర్తీ అంటారు.

మనము విన్నవించే విన్నపాలు, మన పూజలు స్వీకరించేది మన ఇంట్లో ఉండే అర్చ్యామూర్తీ.కనుక నిస్సందేహంగా ఆయనను పూజించి మీరు తెలిసితెలియక చేసిన తప్పులకు ఆయనను క్షమించమని మనస్పూర్తిగా వేడుకుని, మంచి జన్మను ప్రసాదించమని వేడుకోండి.


అన్ని ఏకాదశుల్లోకి *తొలి ఏకాదశి *ఉత్తమోత్తమమైంది

ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. ఐతే.. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవ జాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారు.


ఏకాదశి మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైంది.స్వామి అలంకార ప్రియుడు కనుక మహావిష్ణువుకు జాజిపూలతో అలంకారం చేసి శాంతాకారం భుజగశయనం,పద్మనాభం అంటూ మహావిష్ణువును పూజించే ఈ ఏకాదశే తొలి ఏకాదశి.

ఆషాఢమాసాన వచ్చిన ఈ ఏకాదశికి ప్రత్యేకత ఉంది ఈ రోజు క్షీరాబ్దిలో మహావిష్ణువు శయనిస్తాడు కనుక ఈ ఏకాదశిని శయనైకాదశి అని సంభావిస్తారు.స్వామి యోగనిద్రకు ఉపక్రమిస్తాడనే జనులందరూ జనార్దనుని కోసం కటికోపాసం చేస్తారు కనుక నిర్జలైకాదశిని అనీ,హరి దగ్గరే వాసం చేస్తారు కనుక హరివాసరం అని శయనై కాదశిని వ్యవహరిస్తారు. ఉత్తరదిశగా ఉన్న సూర్యుడు నేటినుంచి దక్షి ణం వైపుకు వాలినట్లుగా కనిపిస్తాడు. కనుక ప్రత్యక్ష నారాయణునిగా తలిచే సూర్యుడు నేటినుంచి పడుకున్నట్లుగా భావించి ఈ ఏకాదశి శయనైకాదశిని పిలవడానికి కారణంగా చెప్తారు.శయనైకాదశి ఉపవాసవివరాలను భవిష్యోత్తర పురాణం చెబుతుంది.ఏకాదశీవ్రత ప్రాధాన్యం ఏమిటో బ్రహ్మవైవర్తన పురాణం చెప్తుంది.ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఘడియల్లో చేసే అన్న దానానికి అనంతకోటి పుణ్య ఫలాలు వస్తాయని చెప్తారు.శ్రీకృష్ణావతారంలో తాను భక్తితో ఇచ్చే నీటినైనా సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పిన భగవానుని తలుచుకుని అత్యంత అనురాగంతో కూడిన భక్తితో మహావిష్ణువును శోభాయమానంగా అలంకరించి పదకొండు వత్తులతో దీపారాధన చేస్తారు. హరికథలనే చెప్పుకుంటూ హరితో నివాసం చేస్తూ ఉపవాసం చేసిన శ్రీహరికి ఇష్టమైన పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు. ప్రతి వైష్ణవాలయంలోను స్వామికి పవళింపుసేవోత్సవం జరుపుతారు.

ఈ పర్వదినాన ‘గోపద్మ వ్రతం’ ఆచరిస్తారు. తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుటం ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు. గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి. గోముఖ భాగమందు వేదాలు,కొమ్ములందు హరిహరులు, నేత్రాలలో సూర్యచంద్రులు, జిహ్వనందు సరస్వతి, పూర్వభాగములో యముడు, పశ్చిమంలో అగ్ని, గోమయంలో లక్ష్మి,అరుపులో ప్రజాపతి ఇలా గోదేహమంతా సర్వదేవతలు సర్వతీర్థాలు సర్వదేవతా నివాసస్థానమైన గోవు ను కూడా ఈ ఏకాదశిన పూజిస్తారు.అధర్వణవేదం, బ్రహ్మాండ,పద్మపురాణం, మహాభారతం కూడా గోవిశిష్టత తెలుపుతాయ.


'తొలిఏకాదశి’ రోజున గోశాలను శుభ్రముచేసి అలికి చుట్టూ ముగ్గులు, మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపై ఉంచి, విధివిధానంగా పూజిస్తూ. గంధపుష్పాలతో అర్చించాలి.     ఒక్కొక్క పద్మముపై ఒక్కో అప్పడం ఉంచుతారు. ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులు బ్రాహ్మణులకిస్తారు. ఇలా గోమాతను పూజించిన వారికి సకల అభీష్టములు తప్పక తీరుతాయి. ఇలా సంవత్సరం రోజులు చేసి వాయనాలతో దక్షిణతాంబూలాలనిచ్చి వ్రత ఉద్యాపనచేయాలి. మహావిష్ణువుకు అత్యంత ప్రేమపాత్రమైన తులసమ్మ దగ్గర పద్మం ముగ్గువేసి దీపం వెలిగించి వివిధరకాల పండ్లను నివేదిస్తారు.ఏకాదశి వ్రతాన్ని రుక్మాంగదుడు,అంబరీషుడు కూడా పాటించారు.వాళ్లు పాటించడమే కాక వారి రాజ్యాల్లోని జనులందరి చేత కూడా ఏకాదశివ్రతాన్ని పాటించేలా చేశారు. ఏకాదశీ వ్రతం చేసేవారి యెడ సదా మహావిష్ణువు తోడునీడగా ఉంటాడు.సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశీ వత్రం చేసి భగవానుని అనుగ్రహం పొందిందని పండరిపురంలో తొలేకాదశి నాడు మహోత్సవాలు జరుపుతారు.


బంధుమిత్రులందరు కలసి సాయంత్రపుపూట సామూహిక విష్ణుసహస్రనామావళిని పఠిస్తారు.హరిభజన చేస్తారు. చాతుర్మాస వ్రతానికి ఆరంభం ఈరోజు.దీనిని గురించి బ్రహ్మవైవర్తన పురాణం వివరిస్తుంది.ఈ రోజున పిప్పల వృక్షాన్ని ప్రదక్షిణ చేయడం కూడా మంచిదని అంటారు. చాతుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు నిమ్మపండ్లు, అలసందెలు,ముల్లంగి, గుమ్మడికాయ,చెరకుగడలు వర్జించాలని అంటారు. మహావిష్ణువు నాలుగు నెలలపాటు క్షీర సముద్రంలో శేషశాయి పైన పవళిస్తాడని యతులు సన్యాసులు మహావిష్ణువును కీర్తించడంలో తమ జీవితకాలాన్ని వెచ్చిస్తుంటారు.దేశ సంచారులైన యతులు ఈ నాలుగునెలలూ ఒక్కచోటనే ఉండి విష్ణుకీర్తనలు చాతుర్మాస వ్రతాన్ని చేస్తుంటారు. బౌద్ధుల్లోను చాతుర్మాస వ్రతమున్నట్టు తెలుస్తుంది.


తొలి ఏకాదశి విశిష్టత :-
                                                                         
తిథుల్లో ఏకాదశి మంచిది. అందునా తొలి ఏకాదశి మరింత పవిత్రమైంది. ఆషాఢమాసం పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని, తొలి ఏకాదశి పర్వదినంలా జరుపుకుంటారు. తొలి ఏకాదశిని  ఆషాఢ ఏకాదశి అని,శయన ఏకాదశి అనికూడా అంటారు. చాతుర్మాస్యవ్రతం ఈ రోజే ఆరంభమౌతుంది. విష్ణుమూర్తిని కొలిచే వైష్ణవులకు తొలి ఏకాదశి ప్రీతికరమైన రోజు. ప్రతినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాస తొలిఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తిప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.



ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం,పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పండితులు అంటున్నారు.ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ,హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు.. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు  రుచి తెలుస్తుంది ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమేఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం,ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.

ఏకాదశి వ్రతం నియమాలు :-

🔸1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి.
🔸2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.
🔸3. అసత్య మాడరాదు.
🔸4. స్త్రీ సాంగత్యం పనికి రాదు.
🔸5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
🔸6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.
🔸7. అన్నదానం చేయాలి.

పురాణ కథనాలను అనుసరించి, విష్ణుమూర్తి క్షీర సాగరంలో శేషతల్పం మీద హాయిగా పడుకుని తొలి ఏకాదశినాడు నిద్రకు ఉపక్రమించాడట. అలా పడుకున్న విష్ణుమూర్తి నాలుగు నెలల తర్వాత ప్రబోధినీ ఏకాదశి నాడు మేల్కొన్నాడట. అందుకే ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలు అంటారు.


తొలి ఏకాదశి .. ఆరోజున ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయట

ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా వ్యవహరిస్తారు. హైందవులకు ఇది మహా పర్వదినం. ఈ పర్వదినాన ‘గోపద్మ వ్రతం’ ఆచరిస్తారు. ఈ రోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్ఠమైంది. నేటినుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు. అనేక వ్యాధులకు మూలమైన క్రిమికీటకాలు సంచరించే వర్షకాలం ఇది. ఈ కాలంలో శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది, ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి, మర్నాడు పారణ చేసి, ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు.

తొలి ఏకాదశి వ్రతకథ :-

హిందువులకు అతి ముఖ్యమైన, పవిత్రమైన తిథి ఏకాదశి. మేరు పర్వతమంత పాపాన్నికూడా ప్రక్షాళన చేయగల ప్రభావం కలిగింది ఏకాదశి వ్రతం. ఏకాదశినాడు చేసే పూజలు, జపతపాలు, స్నానం దానం ఇలా ఏ ఒక్క పుణ్యకార్యమైనా అఖండమైన ఫలితాన్నందిస్తుంది. వ్యాసమహర్షి అందించిన పురాణాలను శౌనకాది మునులందరికీ విశదపరచిన సూతుడే నైమిశారణ్యంలో ఏకాదశి గురించి కూడా చెప్పినట్టు నారద పురాణం తెలియజేస్తోంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ఏకాదశిని ‘హరివాసరము’ అని కూడా అంటారు.


పూర్వం కుంబుడు అనే రాక్షసుడు వాని కుమారుడు మృదుమన్యుడు అచంచలమైన శివభక్తితో అనేక వరములు సంపాదించుకున్నారు. అలాగే స్ర్తి, పురుషులనుండి గాని ఏ ఇతర ప్రాణినుండిగాని తనకు మరణం లేకుండా వరాన్ని కోరుకున్నారు. అయితే మరణం అనేది అనివార్యం కాబట్టి ఆ వరం కుదరదని, ఒక అయోనిజ అయిన స్త్రీ చేత తప్ప ఇంకెవరివల్లను మరణం లేకుండా వరాన్నిచ్చాడు శివుడు. అయోనిజ ఉద్భవించడం ఎలాగూ సాధ్యంకాదు. కాబట్టి ఇక తమకు మరణం లేదన్న గర్వంతో విర్రవీగుతూ సకల జనులను బాధపెట్టసాగారు. వారు చివరకు త్రిమూర్తులను కూడా జయించే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో త్రిమూర్తులు తమ భార్యలతో పాటు వెళ్ళి ఉసిరిక వృక్షం తొర్రలో దాక్కొనవలసి వచ్చింది. అందరూ ఆ తొర్రలోనే ఇరుక్కున్నందువలన ఆ రాపిడికి ఒక కన్య ఉద్భవించింది. ఇంతలోనే రాక్షసుడు త్రిమూర్తులను వెతుక్కుంటూ అక్కడకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో తొర్రలోనుండి వచ్చిన కన్య రాక్షసుని సంహరించింది. ఇలా దుష్ట సంహారం చేసి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగించింది కాబట్టి మహావిష్ణువుకు ఇష్టురాలయ్యింది. ఆ బాలికే ఏకాదశి అని ప్రతి పక్షంలోను పదకొండవ రోజు ఆమెను స్మరించుకొని శ్రీమన్నారాయణుని పూజిస్తే సకల పాపహరణమని పురాణాలు చెప్తున్నాయి.

మరో కథనం ప్రకారం, కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు ఎన్నో వరాలను సంపాదించి ఆ వరగర్వంతో మునులను, దేవతలను హింసిస్తూ చివరకు ఇంద్రుడు, బ్రహ్మలను కూడా వారి స్థానాలనుండి వెళ్ళగొట్టాడు. వారందరి బాధ తీర్చడానికి విష్ణువు మురాసురునితో తలపడ్డాడు. వెయ్యేళ్ళు యుద్ధం చేసినా రాక్షసుని నిర్జించలేకపోయాడు. మహావిష్ణువు చివరకు అలసటతో ‘సింహావధ’ అనే గుహలో దాక్కున్నాడు. విష్ణువును వెతుక్కుంటూ వచ్చాడు రాక్షసుడు. ఆ సమయంలో విష్ణువు తన శరీరం నుండి ఒక బాలికను ఉద్భవింపజేసి మురాసురునిపైకి వదిలాడు. ఆ బాలిక రాక్షసునితో యుద్ధం చేసి సంహరించింది. ఆమే ఏకాదశి.

తనకు ఈ విధంగా రాక్షస సంహారంతో సంతోషం కలిగించినందుకు ఫలితంగా వరం కోరుకొమ్మన్నాడు విష్ణుమూర్తి. దానికా బాలిక ఏకాదశి ‘‘శ్రీమన్నారాయణా! సర్వతిథులలోను నేను ప్రముఖంగా పూజించబడాలి. ఎల్లవేళలా నేను నీకు ప్రియమైనదానిగా ఉండాలి. నా తిథిలో ఉపవాసం ఉండి వ్రతం ఆచరించినవారు మోక్షాన్ని పొందాలి’’ అని అడిగింది. ఆ వరానిచ్చాడు విష్ణువు. ఇలా ఏకాదశి తిథి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్టు భవిష్యపురాణం చెప్తోంది. ఏకాదశులన్నింటిలోకి అత్యంత ప్రధానమయినది తొలి ఏకాదశికి. అప్పటి నుంచే ‘తొలి ఏకాదశి’ వ్యవహారంలోకి వచ్చిందని మరో పురాణ కథనం.

పురాణగాథ ప్రకారం.. యమభటులు తమ దుందుభుల కోసం చర్మం కావాలని కోరారు. చాతుర్మాస్య, గోపద్మ వ్రతాలు ఆచరించనివారి భార్యల నుంచి అది తెమ్మని ఆయన తన దూతల్ని పంపించాడట. నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు, ద్వారక లోని స్త్రీలందరితోనూ ఆ వ్రతం చేయించాడు. గంగ వంటి తీర్థం, తల్లి వంటి గురువు, విష్ణువు వంటి దైవం, నిరాహారం వంటి తపం, కీర్తి వంటి ధనం, జ్ఞానం వంటి లాభం, ధర్మం వంటి తండ్రి, వివేకం వంటి బంధువు, ఏకాదశి వంటి వ్రతం లేవని భవిష్య, స్కంద పురాణాలు తెలియజెబుతున్నాయి.


దూర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొందడానికి అంబరీష మహారాజు హరిభక్తి పరాయణుడయ్యాడు. ఏకాదశి వ్రతం ఆచరించి, నియమ నిష్ఠలతో ఉపవసించి, విష్ణు సాయుజ్యం పొందాడంటారు. అలాగే ‘సతీ సక్కుబాయి’ తొలి ఏకాదశి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వర్తించి, మహావిష్ణువులో ఐక్యం చెందిందట. దుర్భర దారిద్య్రంలో మగ్గిన కుచేలుడు ఈ వ్రతం చేసి వాసుదేవుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడని చెబుతారు. అందువల్ల అతడు సిరిసంపదలు, సకలసౌఖ్యాలు అనుభవించగలిగాడంటారు. రుక్మాంగదుడు స్వయంగా తాను ఏకాదశి వ్రతం ఆచరిస్తూనే, రాజ్యంలోని ప్రజలందరితోనూ చేయించాలని సంకల్పించాడు. దీని వల్ల యమలోకానికి చేరే పాపుల సంఖ్య తగ్గిపోతుందన్న ఆందోళనతో- వ్రతభంగం చేసి రమ్మని యముడు రంభను పంపాడు. ఆమె మోహిని రూపంలో వెళ్లి రుక్మాంగదుణ్ని ఆకర్షించింది. అదే పుణ్యదినాన అతణ్ని కోరిన రంభను, మరేదైనా అడగమన్నాడు రుక్మాంగదుడు. ‘నీ పుత్రుణ్ని వధించు’ అని రంభ పరీక్షపెడితే, అందుకు సిద్ధపడ్డాడట. విష్ణువు ప్రత్యక్షమై, రుక్మాంగదుడి వ్రతదీక్షను ప్రశంసించి, మోక్షం ప్రసాదించాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇలా పురాణ పురుషులు, స్త్రీలు ఎందరో ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మహోద్భుతమైన ఫలితాలు పొందారని పురాణాలు చెబుతున్నారు. ఈ వర్షరుతువు ఆరంభంలో, సరిపడని ఆహారాన్ని త్యజించి ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలన్నదీ పండుగ సంకేతమే. తెలుగువారి తొలి పండుగగానూ గుర్తింపు పొందిన తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే జన్మ జన్మల పాపం పోతుంది.


ఈ ఆషాడమాసంలోని ఏకాదశే తొలి ఏకాదశి ఎలా అయింది అంటే
పూర్వకాలంలో వర్షఋతువే ప్రథమ ఋతువుగా ఆషాఢమాసంతోనే సంవత్సరం ప్రారంభమయ్యేదట. అలా ఆషాఢంలో వచ్చిన ఏకాదశి తొలి ఏకాదశి అయింది. తొలి ఏకాదశినే శయనైకాదశి అనీ అంటారు. ఈ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో నిద్రకు ఉపక్రమిస్తాడు. దానివల్ల ఈ ఏకాదశి శయనైకాదశి గా పేర్గాంచింది.



ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. తొలి ఏకాదశి నాడు రైతన్నలు నాగలి, గునపము మొదలైన పరికరాలకు పూజ చేస్తారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. ఏకాదశి రోజున కర్షకులు పూజ పూర్తయిన తర్వాత పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు. ఈవేళ తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది. కొత్త కూలీలను మాట్లాడ్డం లాంటి పనులు ఏమైనా ఈవేళ చేస్తారు. వాళ్ళను ఈవేళ పనిలోకి రమ్మని ప్రత్యేకంగా చెప్తారు. కొత్త ఒప్పందాలు ఏవైనా ఈవేళ కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు. మరే మార్పుచేర్పులు అయినా ఈ తొలి ఏకాదశినాడు చేపడతారు.


తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు.సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగల్లాగే తొలి ఏకాదశిని ముఖ్యమైన పండుగ దినంగా భావించి, ఉపవాసం ఉంటారు. ఈవేళ ఉపవాసం కనుక గారెలు,బూరెలు లాంటి పిండివంటలు ఏమీ చేయరు. కొందరు నేతితో పాయసం వండి ప్రసాదంగా పంచుతారు. పండ్లు మాత్రమే సేవిస్తారు.

 
!! 🙏 ఓం నమో నారాయణాయ🙏 !!