Friday, 2 February 2018

మాఘ పురాణం :- 16 వ అధ్యాయము



                                     మాఘ పురాణం



 16వ అధ్యాయము :-

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః !
శ్రీ వత్స వక్షాః శ్రీ వాసః శ్రీ పతిః శ్రీ మతాం వరః !!

శ్రీదశ్ర్శీశః శ్రీనివాసః శ్రీ నిధిశ్ర్శీవిభావనః !
శ్రీధరశ్ర్శీకరశ్రేయః శ్రీ మాన్ లోకత్రయాశ్రయః !!

  విద్యాధరపుత్రిక కథ :-

రాజా! మాఘమాసస్నాన మహిమను తెలుపు మరియొక కథను వినుమని మరల యిట్లు పలికెను. పూర్వమొక విద్యాధరుడు సంతానము కావలయునని బ్రహ్మనుద్దేశించి గంగాతీరమున తపము చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్దలతో చిరకాలము తపమాచరించెను. అతడిట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యెను, వరములనిత్తును కోరుకొమ్మనెను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ "నయనా! నీకు పుత్ర సంతానయోగము లేదు. అయినను నీ తపముంకౌ మెచ్చి పుత్రిక ననుగ్రహించుచున్నానని" యంతర్దానమునందెను. ఆమె పెరిగి పెద్దదయ్యెను, మిక్కిలి సుందరమై సద్గుణాన్వితయై కన్నవారికిని, తనను చూచినవారికిని, సంతోషమును కలిగించుచుండెను. విద్యాధరుడును ఆనందమును కలిగించు నీమెను యెవరికోయిచ్చి అత్తవారింటికి పంపజాలను. వివాహము చేసినను అల్లుని కూడ నా యింటనే యుంచుకొందునని  నిశ్చయించుకొనెను. ఒకనాడొక రాక్షసుడామెను చూచెను, ఆ రక్షసుడు దేవీ భక్తుడు ఎన్నియో దివ్యశక్తులను సంపాదించెను, కోరిన రూపము ధరింపగల  శక్తిని కూడ సంపాదించెను. ఆ రక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరులుకొనెను. ఆమె నెట్లైన వివాహము చేసికొనవలయునని తలచెను. ఆ రక్షసుడు మిక్కిలి శక్తిమంతుదు, శివును తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందెను. శివుడును వానికి శూలమునిచ్చుచు "ఓయీ! ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణింతువని" చెప్పి యిచ్చెను. వరగర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువెవ్వడు నా ఆయుధము శత్రువునెట్లు చేరును అని తలచి వర గర్వితుడై యెవరిని లెక్కచేయక ప్రవర్తించుచుండెను.

అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి "సుందరీ! నన్ను వరించుమని యడిగెను, ఆమెయు నా తండ్రినడుగుమని చెప్పెను. రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తె నిచ్చి వివాహము చేయమని కోరెను. విద్యాధరుడు వానికి తన కుమార్తె నిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయునది లేక మరల వచ్చెను, విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితముగ సముద్రము క్రిందనున్న తన యింట ఉంచెను. శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలచెను, విద్యాధరుడును తన పుత్రికయేమైనదో యని విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని యడుగగా బ్రహ్మ యెనిమిది మాసముల తరువాత మంచి ముహూర్తమున్నది అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తరువాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును, ఈ లోపుననిన్నేమియు బాదింపను. నీవు కోరిన వస్తువులను తెచ్చి యిత్తుననగా నామెయేమియు మాటలాడలేదు, రాక్షసుడు మరల మరల నడుగగా 'నాకిప్పుడేమి అక్కరలేదు, ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతమున్నది, దర్శించి పూజించుటకు శివలింగమెచటనున్నదో చూపూ మని అడిగెను. ఆ రాక్షసుడు పాతాళములో వున్న హటకేశ్వరుని చూపెను. విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడామె పాతాళలోకమున నున్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్లెను. అప్పుడఛటకు త్రిలోకసంచారియగు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింప వచ్చి యామెను జూచెను. ఆశ్చర్యపడి 'అమ్మాయి! నీవిచటనున్నావేమని అడిగెను. ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను. రాక్షసుడు తనను సముద్రము క్రింద నున్న గృహమున నిర్భంధించెననియు చెప్పెను.

నారదుడామె చెప్పినదంతయును వినెను. అమ్మాయీ! భయపడకుము విష్ణుభక్తుడై నీకు భర్తయగు వానిని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త విచారింపకుము. నా మాటను నమ్ముము. నీకొక ఉపాయమును చెప్పెదను వినుము. ఇచట శివునకెదురుగ మానస సరోవరము కలదు. మాఘమాసమున నీవీ సరస్సు స్నానమాచరింపుము. గంధపుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసమంతయు ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘస్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును. నా మాటను నమ్ముమని చెప్పి నారదుదు తన దారిన పోయెను.

విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగ నమ్మెను. మాగమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్లి స్నానము చేసి పూజ మున్నగు వానిని చేయుచుండెను. నారదుని మాట యధార్థమగుటకై ఎదురు చూచుచుండెను. మాఘమాసమును వ్రతముతో గడపెను. నారదుడును లోకసంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీమహావిష్ణు భక్తుడగు హరిద్రధుడను మహారాజును జూచెను. ఆరాజు సర్వకాల సర్వా వస్థలయందును శ్రీమహావిష్ణువును స్మరించుచుండును. అందరియందును శ్రీమన్నారాయణునే దర్శించును. వారిని హరీయని ఆహ్వానించును. విష్ణువాయని పిలుచును. గోవిందాయని మాటలాడును. శ్రీకృష్ణాయనుచు వస్తువును స్వీకరించును. దామోదరాయనుచు భుజించును, కేశవాయనుచు నిద్రించును. నరసింహాయని స్మరించును, హృషీకేశాయని మేల్కొనును, వామనాయనుచు తిరుగును, ఏపని చేయుచున్నను యెవరితో మాటలాడుచున్నను యేదో ఒక విధముగ శ్రీమన్నారాయణుని తలుచును. ఇట్లు విష్ణు భావనాతన్మయుడైన హరిద్రధుని వద్దకు నారదమహర్షి వెళ్లెను.

హరిద్రధుడును నారదమహర్షిని జూచి యెదురువచ్చి గౌరవించెను. తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. నారదుడును రాజా విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారముగ నపహరించి సముద్ర గర్భమున దాచియుంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోకసుందరి, సద్గుణశీల నీవామెను భార్యగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలయును. అని వానికి తగినరీతిలో వివరించి నారదుడచట నుండి లోక సంచారార్థముపోయెను. హరిద్రధుడును సముద్రము వద్దకు పోయెను, నారదుడు చెప్పినట్లుగ సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గము నొసగెను. హరిద్రధుడును ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడింట లేడు. అతదు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతదు పోవుచు శూలము ఇంటిలో వుంచి వెళ్లెను. రాజు రాక్షసుని యింట నున్న శివుని శూలమును గ్రహించియుండెను. రాక్షసుడింటికి వచ్చునప్పటికి తన శూలము పరహస్తగతమగుటను గమనించెను. ఆ రాజును చూచి యిట్టివానితో యుద్ధము చేసి మరణించినను మంచిదేయని తలచి హరిద్రధునితో యుద్ధము చేయసిద్ధపడెను. రాక్షసుడు హరిద్రధుడు చాలా కాలము యుద్ధము చేసిరి, హరిద్రధుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను, వానిని భర్తగా వరించెను. హరిద్రధుడును ఆమెను వివాహమాడెను. ఆ దంపతులును విష్ణుభక్తులై విష్ణుపూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి. చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి, అని వశిష్టుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను.


               🙏 ఓం జనార్ధనాయ నమః 🙏


✍️ " సాంప్రదాయం "

Wednesday, 31 January 2018

మాఘ పురాణం :- 15 వ అధ్యాయము


                                    మాఘ పురాణం






 15వ అధ్యాయము :-

విశ్వ మూర్తిర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్ !
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తి శ్శతాననః !!

ఏకోనైక స్సవః కః కిం యత్తత్పద మనుత్తమమ్ !
లోకబన్దు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః !!

 
జ్ఞానశర్మకథ – మాఘపూర్ణిమ :-


గృత్నృమదుడుజహ్నువుతో నిట్లనెను. తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యెను, బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి యుండెను. అప్పుడు శ్రీహరి ఓయీ నీవు మరల నారాకను గోరి తపమచరించితిని యెందులకు? నీ మనస్సులో నేమియున్నది చెప్పుమని యడిగెను. అప్పుడా విప్రుడు 'స్వామీ! నాకు పుత్రవరము నిచ్చి సంతోషము కలిగించితిని, నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను, కాని నారదమహర్షి వచ్చి యీ బాలుడు పండ్రెండు సంవత్సరముల తరువాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరమిట్లయినది, నా దుఃఖమును పోగొట్టుకొనగోరి తపమాచరించితినని శ్రీహరికి విన్నవించెను.

అప్పుడు శ్రీహరి 'ఓయీ! ఉత్తముడైన నీ పుత్రునకు పండ్రెండవ సంవత్సరమున గండము కలుగుటకు కారణమును వినుము. నీ భార్య పూర్వ జన్మమున చేసిన దోషమే యిప్పుడీ  గండమునకు కారణము. పూర్వజన్మమున గూడ మీరిద్దరును భార్యాభర్తలే అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే.ఆమె ఉత్తమశీలము, గుణములు కలిగియుండినది.ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెయు అట్లేయని అంగీకరించెను. వ్రతము నారంభించెను. మాఘపూర్ణిమ యందు వ్రతమాచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషము వలన నీ భార్యపుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘ వ్రతము నాచరించినందున యీ జన్మయందును విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమనాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటయును రెండు దోషముల వలన పండ్రెండు సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండదోషముపోయి నీ పుత్రుడు చిరంజీవియగును.

ఓయీ! మాఘ స్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును యిచ్చును. మాఘస్నానము చేయనివరికి, వారి సంతానమునకు ఆపదలు కల్గును, అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస వ్రతము నాచరింపవలయునని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వపాపదోషహరము. నేను(శ్రీ హరి) మాఘ మాస ప్రియుడను. మాఘస్నాన మాచరించిన వారు దీర్ఘాయువులు, బుద్దిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తినందుదురు. మాఘమాసస్నాన వ్రతము కోరిన కోరికల నిచ్చును. మాఘ వ్రత బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్టుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగ తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరుగరు, మాఘవ్రత మహిమ కొంతయే తెలిసినవారు పూర్తిగా తెలియువారు కలరు. దీని మహిమ అందరికిని తెలియదు. నా భక్తులు, మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమనెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే మాఘవ్రతము ఆచరింప వలయునను బుద్ధి కలుగును, నీ పుత్రుని మాఘమాస ప్రాతఃకాలమున గంగాజలముతో తడుపుము. వాని గండ దోషము తొలగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యెను.

బ్రాహ్మణుడును శ్రీహరి యనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యెను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలముచే తడిపెను, బాలునకును శ్రీహరి దయ వలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యుభయము తొలగెను. బ్రాహ్మణుదును ఆ బాలునకు మూడవ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరములయందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. పండ్రెండవ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు వాని భార్యా, పుత్రుడు అందరును సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుదు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరమును విదిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.

జహ్ను మునివర్యా! మాఘవ్రతమునకు సాటియైనది మరొకటిలేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును గూడనిచ్చును. ఈ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి యిహలోక సౌఖ్యములను, నిశ్చలమగు హరి భక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సౌఖమును గూడ పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని గృత్నృమద మహర్షి జహ్నుమునికి వివరించెను.

    🙏 ఓం నమో లక్ష్మీనారాయణ నాయ నమః 🙏


✍️ " సాంప్రదాయం "

Tuesday, 30 January 2018

మాఘ పురాణం :- 14 వ అధ్యాయము


                               మాఘ పురాణం




14వ అధ్యాయము :-

సర్వాగమనా మాచారః ప్రథమం పరికల్పితః !
ఆచారః ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః !!

ఋషయః పితరో దేవాః మహాభూతాని ధాతవః !
జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవమ్ !!



 విప్రుని పుత్రప్రాప్తి  :-

గృతృనమద మహర్షిని జూచి జహ్నముని యిట్లనెను.మహర్షీ! మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా? నా సందేహమును తీర్చుమని యడూగ జహ్నమహర్షి యిట్లనెను. జహ్నమునీ! వినుము మాఘమాస వ్రతము నాచరించుటచే ప్రాణికి యిహలోక సుఖములు, పరలోక సుఖములు కలుగును. వారి కష్టములు తీరును, అందుచే సంతుష్టుడైన మానవుడింకను హరి ప్రీతికరములగు వ్రతముల నాచరించి జ్ఞానియై సత్కర్మల నాచరించి ముక్తినందును. అట్టి కథనొక దానిని చెప్పెదను వినుము అని యిట్లు పలికెను.

పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడొకడుండెను. అతడు వేదవేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతిదయజ్ఞానము యింద్రియ జయము కలిగినవాడు. అతని భార్యయునుత్తమురాలు. వారికి సంతానము లేదను లోటు తప్ప మరి దేనికిని లోటులేదు. పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడొకనాడు భార్యతో "గుణవంతుడైన పుత్రుడొక్కడు అయినను మనకు కలుగలేదు, అట్టి పుత్రుడొకడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగునాయని విచారపడెను". అప్పుడామె నాధా! నీవు తగిన పూజను చేయలేదేమో? అందువలన మనకు సంతానము కలుగలేదనుకొందును, అని సమాధానము ఇచ్చెను. అప్పుడా బ్రాహ్మణుడు ప్రియా కష్టతరమైన తపము నాచరించి అయినను, శ్రీమన్నారాయణుని సంతుష్టిపరచెదను. పుత్ర వరమును కోరుదునని చెప్పెను. కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపముచేసి మృకండు మహామునివలె ఉత్తమ పుత్రవరమును కోరెదననియు పలికెను. ఆ దంపతులిద్దరును తపమాచరించ వలెనని గంగాతీరమునకు పోయిరి.

బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరినిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించెను. కొంత కాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు నాలుగు చేతులయందును శంఖమును, చక్రమును, గదను ధరించియుండెను. వరమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టను కట్టెను. కౌస్తుభమను మణిభూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యులకాంతితోనుండెను. శాంత భూషితమై ప్రసన్నతకల శ్రీహరి ముఖము మకరమండలముల కాంతితో మరింత శోభాయమానముగ నుండెను. నారదమహర్షి స్తుతించుచుండగా అప్సరకాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీసమేతుడై గరుత్మంతుని పైనెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయవచ్చెను.

తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై యున్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వు నవ్వుచు "విప్రా! నేను నీకు వరమునీయవచ్చితిని, నీ తపమునుమెచ్చితిని" అని పలికెను. శ్రీహరి యిట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై, బాహ్యజ్ఞానము లేని స్థితిలోనుండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో నతడు చేయుతపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. అతనికెట్టి వరమునైన యీయవలయునని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్యప్రపంచమునకు మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా నా బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే యెడుట నిలచియుండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని జూచెను. ఆనందపరవశుడైన అతడు శ్రీమన్నారాయణ మూర్తినిట్లు స్తుతించెను.

విప్రకృత విష్ణుస్తుతి

నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల |
నమస్తే కరుణాంశే నమస్తే నందవిక్రమ ||

గోవిందాయసురేశాయ అచ్యుతాయ వ్యయాచ |
కృష్ణాయవాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే ||

లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః |
అనంతాయాది బీజాయ ఆధ్యాయాఖిలరూపిణే ||

యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే |
జలస్థాయ స్థలస్థాయ సర్వగాయా మలాత్మనే ||

సచ్చిద్రూపాయ సౌమ్యాయ సమస్స్ర్వఘనాశినే నమః |
కాలాయ కలయే కామితార్థ ప్రదాయచ ||

నమోదాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః |
విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవాసినే ||

సురాధ్యక్షాయ సిద్దాయ శ్రీధరాయ నమో నమః |
హృషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే ||

పురుషోత్తమాయ పుణ్యాయపద్మనాభాయభాస్వతే |
ఆగ్రేసరాయ తూలాయ ఆగ్రేసరాయాత్మనే నమః ||

జనార్థనాయ జై త్రాయ జితామిత్రాయ జీవినే |
వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయతే నమః ||

జ్ఞానాయజ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే |
ధురంధరాయధుర్యాయ ధరాధారాయతే నమః ||

నారాయణాయశర్వాయ రాక్షసా నీకవైరిణే |
గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే ||

కారుణ్యాయ శరణ్యాయకాంతాయామృత |
కేశవాయ నమస్తేస్తు నమోదామోదరాయచ ||

సంకర్షణాయ శర్వాయ నమస్ర్తైలోక్యపాలినే |
భక్తప్రియాయ హరయే సమస్సర్వార్తి నాశివే ||

నానాభేద విభేదాయ నానారూప ధరాయచ |
నమస్తే భగవాన్ విష్ణో పాహిమాంకరుణాకర ||

(శ్రీ మన్నారాయణుని ప్రత్యక్షముగ చూచిన బ్రాహ్మణుడు భక్తితో ఆశువుగ చెప్పిన యీ స్తోత్రము అందరు చదువుట శ్రేయస్కరము)

జహ్నుమునీ! ఆ బ్రాహ్మణుడు అష్తోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించి ఆనంద పరవశుడై నమస్కరించుచు నిలిచియుండెను, భగవంతుడు వరమును కోరుకొమ్మనెను శ్రీహరి మాటలను విన్ ఆ విప్రుడు 'స్వామీ! నీ పదములయందు నాకు నిశ్చలమైన భక్తినిమ్ము, ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్రసంతానమునిచ్చి, నాకు ముక్తినొసగుమని కోరెను. శ్రీహరి నీవు కోరినట్లే వరము నిచ్చితిని, నీవు

చెప్పిన యీ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివినవారికి నేను శీఘ్రముగ ప్రసన్నుడనగుదునని పలికి యంతరాథనము నుండెను. బ్రాహ్మణుడు నష్టద్రవ్యమిక్కి లాభము నందినవానివలె సంతసింసించు తన యింటికి చేరెను. కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను.

కొంతకాలమునకు నారద మహర్షి వాని యింటికి వచ్చెను. బాలుని జూచి వీని ఆయుర్దాయము పన్నెండు సంవత్సరములని చెప్పెను. తన దారిని తాను పోయెను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలచుకొని విచారమగ్నుడయ్యెను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని వానినినిమురుచు కన్నీరు కార్చుచు నిట్టూర్పులు విశచుచుండెను. విచారవదనముతో ఆహారమును తీసికొనక విచారించుచుండెను. "నాధా నీవు త్రీవ్ర తపమొనర్చి వరముగా నీ పుత్రుని పొందితిని చంద్రుని వలె సంతాపమును కలిగించు నీ కుమారుడు పండ్రెండు సంవత్సరములు జీవించి విధ్యాభ్యాసము చేయుచు మరణించును కదా! నేనీ పుత్రశోకము నెట్లు సహింపగలను?" అని భర్తతో పలికెను.

ఆ విప్రుడును భార్య మాటలను విని బాధపడుచు నామెనోదార్చి నిశ్చయించెను. ఆమె నూరడించుచు యిట్లనెను. ప్రియా దుఃఖింపకుము, దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది అది యెవరిని విడువదు. మన పుత్రుడు పదుమూడవయెట మృతినందునని యిప్పుడు దుఃఖించుచుంటివా? నీకు నాకును యెప్పటికైనను మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరిణించిన తరువతనైన మరణింపక తప్పదు కదా! మరి యీ ముందు వెనుకలు వయస్సులకు కలదు కాని మృత్యువునకు లేదు. కావున నీవును శోకింపకుము జరుగవలసినది జరుగక తప్పదు. అట్టిచో నీకు విచారమేల? నీవు దుఃఖించినను కనున్నది కాక మానదు. అనగా నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతిప్రాణియు తాని చేసిన కర్మననుసరించి జన్మించును, మరణించును, కనిపించినది నశింపక నిలుచునా? కావున శోకింపుము అని యామనూరడించెను మరియు నిరర్థకమైన దుఃఖమును విడుపుము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగ నుండుము అని పలికి మరల గంగాతీరమున చేరి నియమనిష్టలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజించుచుండెను. శ్రీహరి అష్టాక్షరీ మంత్రమును జపించెను. శ్రీహరి వానిని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచియుండెను.


                    🙏 ఓం లక్ష్మీ ప్రియాయ నమః 🙏

✍️ " సాంప్రదాయం "

Monday, 29 January 2018

మాఘ పురాణం : 13 వ అధ్యాయము


                                     మాఘ పురాణం


13వ అధ్యాయము :-

ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితాదమః !
అపరాజిత స్సర్వసహో నియన్తా నియమోయమః !!

సత్త్యవాన్ సాత్విక స్సత్యః సత్యధర్మ పరాయణః !
అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః !!

   సుశీలుని కథ :-

రాజా! మాఘమాసస్నానము వలన వైకుంఠప్రాప్తిని యెట్టి వానికైనను కలిగించును. దీనిని తెలుపు మరి యొక కథను వినుము. పూర్వము గోదావరీ తీరమున సుశీలుడను కర్మిష్ఠి అయిన వేదపండితుడు కలదు. అతనొకనాడు ప్రయాణము చేయుచు త్రోవ దప్పి భయంకరారణ్యమును ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోను, ఉన్నతములగు వృక్షములతోను, పులి మొదలగు భయంకర జంతువులతోను కూడియుండెను. అతడా అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెడకుచు అటు నిటు తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్రచెట్టు వలెనున్నవి. పాదములు మాత్రము చెట్టుగా నుండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగియుండెను. అచటి కొమ్మలు ముళ్లు గాలికి కదలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను. వానికి కదలునట్టి యవకాశములేదు. ఆహారపానీయాదులను తీసికొను అవకాశములేదు. ఇట్టి దురవస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడెను. ధైర్యమునకై వేదమంత్రములను చదువనారంభించెను. హరినామ సంకీర్తనము చేయసాగెను.

కొంత సేపటికి సుశీలుడు స్తిమితపడెను. ఓయీ! నీవెవరవు? నీకీ పరిస్థితియేమి? చెప్పుమని అడిగెను. అప్పుడా రాక్షసుడు మహాత్మా! నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవన్నియు పాపకర్మలే గోకర్ణ తీరమున మధువ్రతమను గ్రామమున గ్రామాధికారిగనుంటిని. అందరితో అన్ని విషయములను మాటలాడెడి వాడను, ఎవనికిని యేపనియు చేసెడి వాడనుకాను. అసత్యములు పలికెడివాడను పరులసొమ్ము నపహరించుచుండువాడను. ఎంతయో ధనమును కూడబెట్టితిని. ఎవరికిని యేమియు నీయలేదు. స్నాన, దాన పూజాదికములను వేనిని ఆచరింపలేదు. దైవపూజయన నేమోయెరుగను. ఇట్లందరిని బాదించుచు చివరకు మరణించితిని. నరకములో చిరకాలముంటిని తరువాత కుక్క, గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలందితిని. ప్రస్తుతము నా పాదములు చండ్రచెట్టుగా దాని ముళ్ల కొమ్మలు భాధింపగా ఎచటికి కదలలేని యీ జన్మలోనుంటిని. నీవంటి పుణ్యాత్ముని చూచుట వలన, నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు యీ మాత్రము పూర్వస్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలయును అని సుశీలుని బహువిధములుగ ప్రార్థించెను.

సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలచెను. ఓయీ! యిచట సమీపమున నీరున్నదాయని అడిగెను. పన్నెండు యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానము ఉన్నదాయని సుశీలుడడిగెను. అప్పుడా రాక్షసుడు అయ్యా! నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటివారే, వారి సంతానము అటువంటిదే. ప్రస్తుతము నా వంశము వాడు భాష్కలుడను వాడు గ్రామాధికారిగ నున్నాడని చెప్పెను. సుశీలుడు ఓయీ ధైర్యముగ నుండుము. నేను నీ వంశము వానితో మాటలాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదునని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశములోనున్న వానిని భాష్కలుడను వానిని వెదకుచుపోయెను.

సుశీలుడను రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాష్కలుని వద్దకు పోయెను. వానికి తాను చూచిన భాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పెను. అతడును రాక్షస రూపమున నున్న నా పూర్వీకునకు రాక్షసరూపము పోవలెనున్న యేమి చేయవలయునో చెప్పునని అడిగెను. అప్పుడు ఓయీ! నీవు మాఘమాసమున నదీస్నాన చేయుము. శివునిగాని, కేశవునికాని నీ యిష్టదైవమును పూజింపుము. పురాణమును చదువుము లేదా వినుము. దీని వలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక, పూర్వులైన నీ పితృదేవతలును పాపక్షయము నంది పుణ్యలోకముల నందుదురు.

స్నానము యేడు విధములు:-

1. మంత్రస్నానము :-
మంత్రములను చదువుచు చేయు స్నానము.

2. మృత్తికాస్నానము :-
మట్టిని రాచుకొని చేయు స్నానము.

3. ఆగ్నేయస్నానము :-
భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము.

4.వాయువ్యస్నానము :-
గోవులు నడుచునప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడునటుల చేసిన స్నానము.

5. వరుణస్నానము :-
నదులు, చెరువులు మున్నగువానిలో చేయు స్నానము.

6. దివ్యస్నానము :-
ఎండగనున్నప్పుడు వానలో చేయు స్నానము.

7. మానసస్నానము :-
మనస్సులో శ్రీహరిని స్మరించుచు చేయు స్నానము.

ప్రాతః కాలమున స్నానము చేయలేని అశక్తులు, వృద్ధులు, రోగిష్ఠివారు మున్నగువారు తడి వస్త్రముతో శరీరమును తుడుచుకొనుట చేయ వచ్చును, జుట్టుముడి వేసికొని స్నానము చేయవలెను.

స్నానము చేయునప్పుడు :-

కౌపీనముము(గోచి)ఉండవలయును. తుమ్ము, ఉమ్ము, ఆవలింత, మాలిన్యము దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరీయినచో ఆచమనము చేయవలయును. భగవంతుని స్మరించుచు కుడిచెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానముత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానము చేయుట పవిత్రస్నానమగును. స్నానము చేయునప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలములు, పుష్పములు నదిలో లేదా చెరువులో నుంచవలెను. శ్రీహరిని లేదా యిష్టదైవమును స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో నుంచవలయును. బొడ్డులోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట, జపతర్పణాదులను చేయుట చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి, ఒడ్డునకు చేరి మూడు దోసిళ్ల నీటిని తీరమున నుంచి నదిని లేదా చెరువును ప్రార్థింపవలెను, ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను, నదీ స్నానము చేసిన పిమ్మట తడివస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును, పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యము నిచ్చును.
స్నానము చేయునప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని వారు యిష్టదైవమును స్మరించుచు నీటిలో మరల మునగవలయును. సూర్యుని, గంగను, దేవతలను తలచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలెను. గంగా, యమునాది నదులను తలుచుకొని నీటిని వ్రేళ్లతో గీయవలెను. స్నానము దిగంబరుడై చేయరాదు. శరీరము పై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్థమి, ఏకాదశి, శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడ తలచుకొని నమస్కరింపవలయును. అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానములను వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయములను, దైవిక విషయములను వివరించెను. తరువాత తన దారిన పోయెను. భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘస్నానమును, పూజాదులను నిర్వహించెను. స్నానాంతమున రాక్షసరూపము నన్ను పూర్వుని ఉద్ధేశించి తర్పణము కూడ చేసెను. ఇట్లు మాఘమాసమంతయు చేసెను. రాక్షస రూపమున ఉన్న తన పూర్వీకునకు రాక్షసత్వము పోయి పుణ్యలోకములు కలిగెను.


                    🙏 ఓం వైకుంఠాయ నమః 🙏

✍️ " సాంప్రదాయం "

Sunday, 28 January 2018

మాఘ పురాణం : 12 వ అధ్యాయము


                           


                                  మాఘ పురాణం





12వ అధ్యాయమ :-

మనోజవ స్తీర్ధకరో వసురేతా వసుప్రదః !
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః !!

సద్గతి స్సత్క్రతిస్సత్తా సద్భూతి స్సత్పరాయణః !
శూరసేనో యదుశ్రేష్టః సన్నివాస స్సుయామునః !!


శూద్రదంపతుల కథ :-

వశిష్ఠమహర్షి దిలీపునితో మహారాజా మరియొక కథను వినుము. సుమందుడను శూద్రుడొకడుండెడి వాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి యిష్టము కలవాడు, వ్యవసాయము చేయును. పశువులవ్యాపారము చేయును. ఇవి చాలక వడ్డీ వ్యపారమును గూడ చేయును. ఎంత సంపాదించుచున్నను యింకను సంపాదించ లేకపోవు చున్నానని విచారించెడివాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని యింటికి వచ్చెను. "అమ్మా నేను బాటసారిని అలసినవాడను, చలి, చీకటి మిక్కుటములుగ నున్నవి. ఈ రాత్రికి నీ యింట పండుకొను అవకాశమిమ్ము. ఉదయముననే  వెళ్లిపోదునని" యింట నున్న కుముదను అడిగెను. ఆమెయు వానిస్థితికి జాలిపడి యంగీకరించెను. ఆమె యదృష్టమో ఆ బ్రాహ్మణుని యదృష్టమో యజమానియగు సుమనందుడు వడ్డీని తీసికొనుటకై గ్రామాంతరము పోయియుండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్లసావిడిలో ఒక చోట బాగుచేసి కంబళిమున్నగు వానినిచ్చి, పాలను కూడ కాచియిచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరి నామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలపాడుచుండెను.

కుముద "ఓయీ నీవెచటినుండి వచ్చుచున్నావు యెచటికి పోవుచున్నావని యడిగెను. అప్పుడా విప్రుడు "తుంగభద్రాతీరము నుండి శ్రీ రంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును, అందులకై యిట్లు వచ్చితిని సమాధానమునిచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను, కుముదయు మాఘస్నానము చేయుటకైన నదికి పోవలయునని యనుకొనెను. తానును వానితో నదికి పోయి స్నానము చేసిరావలెననుకొనెను. తన యభిప్రాయమును చెప్పగ బ్రాహ్మణుడును సంతోషముతో నంగీకరించెను. సుమందుడింటికి వచ్చెను. కుముద నదీస్నానమునకు పోవుచుంటినని భర్తకు చెప్పెను. సుమందుడు నదీస్నానము వలదు అనారోగ్యము కలుగును. పూజకు, అనారోగ్యమునకు, ధనవ్యయమగును వలదు అని యడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండ బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి. నదిలోస్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధముగా నా దంపతులకు మాఘమాస నదీ స్నానమైనది. పుణ్యము కూడ కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచుకొట్టుచు యింటికి తీసికొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడును స్నానము చేసి దేవతార్చన చేసికొని తన దారిన పోయెను. కొంతకాలమునకు సుమందుడు వాని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు గొనిపోయిరి. ఈ లోపున విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను విమానమెక్కించి ఆమె భర్తను యమభటులకు విడిచిరి.

అప్పుడామె విష్ణుదూతలారా! నామాటలను వినుడు నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమ లోకమునకు తీసికొనిపోబడుచున్నాడు. అతని భార్యనగు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో బాటు యమలోకమునకు పోవలసియున్నది మరి నన్ను విష్ణులోకమునకు ఏలగొనిపోవుచున్నారని యడిగెను. అప్పుడు విష్ణుదూతలు  అమ్మా నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగ నరకమునకు పోవలసియున్నను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమును లేదు. నీ భర్త చేయు చెడుపనులు నీ కిష్టము కాకున్నను, భయమువలన గాని, పతిభక్తి వలన గాని నీ భర్తకు యెదురు చెప్పలేదు. కాని మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివికావు. ఇంతే గాక మాఘమాస స్నానమును కూడ మనః పూర్వకముగ భక్తితో చేసితివి. కావున నీవు పుణ్యము నందితివి. నీ భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి.అప్పుడామే నన్ను లాగుచు నా భర్తయు నీటిలో మునిగెను కదా!  మా పెనుగులాటలో మూడుసార్లు ఆయనయు నీటమునిగి లేచెను కదా! బలవంతముగ చేసినను యిష్టము లేక చేసినను మాఘస్నానము పుణ్యప్రదమందురు కదా! ఆవిధముగా జూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగిలేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను. ఆయనయు నాతోబాటు విష్ణులోకమునకు రావలెను కదా యని విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమునడిగిరి.

అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్యపాపముల పట్టికను జూచెను. సుమందుడుని పట్టికలో నన్నియును పాపములే కాని మాఘమాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయిన నదీజలమున పడుట, నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసికొని రావలయునను ప్రయత్నమున, నీటిలో పలుమార్లు మునిగి తేలుటవలన నితడు యిష్టములేకున్నను. బలవంతముగ మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణు లోక ప్రాప్తిని పొందవలసియున్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి. కుముదను ఆమె భర్తను విష్ణులోకమును గొనిపోయిరి. రాజా! బలవంతముగ నొక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగ పూర్వము చేసిన పాపములుపోయి, విష్ణులోకమును చేరు పుణ్యమువచ్చిన దన్నచో మాఘమాసమంతయు నదీస్నానము చేసి, యిష్ట దేవతార్చనము చేసి మాఘపురాణమును చదువుకొని, యధాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంత యుండునో ఆలోచింపుము.

మానవుడు తెలిసికాని, తెలియకకాని బలవంతముగ దుష్కార్యములు చేసి పాపమునందును. అట్లే పై విధముగ చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును. విచారింపుగా కర్మ పరంపరాగతమైన మానవజన్మ దుఃఖ భూయిష్టము పాపబహుళము. ఇట్టివారికి చెడు కార్యములయందాసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగుట సహజము. తప్పని సరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు యత్నింపవలయును, తన పనులను నూరింటినైనను వదలి మాఘమాస స్నానమును చేయవలెను. అట్లుకాక స్నానము, పూజాదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును. మాఘమాసమున ఒకదినమైనను స్నానము పూజా, పురాణశ్రవణము, దానము యధాశక్తికిగ పాటించినవాడు పైన చెప్పిన కుముదా సుమందులవలె విష్ణులోకమును పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసినవానికి పునర్జన్మ వుండదు. వానికి మోక్షము కలుగును. ప్రయాగయందే కాక మాఘమాసమున కావేరి, కృష్ణవేణి, నర్మద, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, కోణభద్ర, గౌతమీ యిత్యాది నదులయందు స్నానము చేసినను, కూడ యింతటి పుణ్యమే కలుగును. మానవులందరును వారెట్టి వారయినను మాఘస్నానము పూజ, పురాణశ్రవణము, దానము వీనినన్నిటినిగాని, కొన్నిటిని యధాశక్తిగ చేయుటయే వారికి పాపతరణోపాయము, మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠమహర్షి దిలీపునకు వివరించి చెప్పెను.
     

                       🙏 ఓం జగన్నాథాయ నమః 🙏


✍️" సాంప్రదాయం "

Saturday, 27 January 2018

మాఘ పురాణం : 11వ అధ్యాయము



                                      మాఘ పురాణం

11వ అధ్యాయము :-

అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శ్శిష్టకృచ్ఛుచిః !
సిద్ధార్థః స్సిద్ధసజ్కల్పః సిద్ధిద స్సిద్ధిసాధనః !!

వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః !
వర్దనో వర్దమానశ్చ వివిక్త శ్ర్శుతిసాగరః !!





 భీముని ఏకాదశివ్రతము :-

సంవత్సరములో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలోగాని, నదిలేనిచోట తటాకమందుగాని, తటాకము కూడా అందుబాటులో లేనియెడల నూతివద్దగానీ స్నానము చేసినచో పాపములన్నియు హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునానదీ తీరమందున్న అగ్రహారములో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దానధర్మములు చేసి కీర్తి పొందినవారై యున్నారు.

అతడు చిన్నతనములో గడుసరి, పెంకివాడు, అతడు తల్లితండ్రుల భయభక్తులవలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్టసహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్యమాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొను చుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్దుడయ్యెను, తనకున్న ధనమును తాను తినడు, యితరులకు పెట్టడు, ఒకనాటి రాత్రి పరుండబోవునపుడిట్లు ఆలోచించెను. "అయ్యో! నేనెంతటి పాత్ముడనైతిని ధనము, శరీరబలము వున్నదను మనోగర్వముతో జీవితాంతమూ ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియు చేయలేక పోయినానుగదా" అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయెను. అన్ని రోజులు ఒకే విధముగా నుండవు కదా! ఆ నాటి రాత్రి కొందరు చోరులు అనంతుని యింటిలో ప్రవేశించి ధనమూ, బంగారమూ యెత్తుకొని పోయిరి.

అనంతుడు నిద్రనుండి లేచి చూడగా, అతని సంపదంతా అపహరింపబడినది అన్యాయముగా ఆర్జించిన ధనము. అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దలనీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడచుచున్నందున యమునా నదికి వెళ్ళి సానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీస్నాన ఫలముదక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడ వణికి బిర్రబిగసిపోవుచూ 'నారాయణా' అని ప్రాణములు విడచినాడు. ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానము చేయుట వలన అతడు చేసియున్న పాపములన్నియు నశించిపోయి వైకుంఠ వాసుడయ్యెను, అని వశిష్టుడు తెలియజేసెను.

పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు, భోజనప్రియుడు, ఆకలికి యేమాత్రమూ ఆగలేనివాడు బండెడన్నమయినను చాలదు. అటువంటి భీమునకు యేకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలము పుట్టినది. కాని ఒక విషయములో బెంగతోయుండెను. అదేమందువా! "ఏకాదశీనాడు భోజనము చేయకూడదు కదా! భోజనము చేసినచో ఫలము దక్కదుకదా! అని విచారించి, తన పురోహితుని కడకు బోయి, ఓయీ పురోహితుడా అన్ని దినములకంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అనెదరుగదా దాని విశిష్టత యేమి", అని భీముడు అడిగెను.

అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు "అవును భీమసేనా! ఆరోజు అన్ని దినములకంటెను ప్రశస్తమైనది. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది. కనుక, అన్ని జాతులవారును యేకాదశీ వ్రతము చేయవచ్చును" అని పలికెను. సరే నేను అటులనే చేయుదును. గాని, "విప్రోత్తమా! నేను భోజన ప్రియుడునన్న సంగతి జగధ్విదితమే గదా! ఒక ఘడియ ఆలస్యమైననూ నేను ఆకలికి తాళజాలను, కనుక, ఏకాదశినాడు ఉపవాసముండుట ఎటులా అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి యెక్కువగా నుండెను. కావున ఆకలి దాహము తీరులాగున, యేకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహానీయుము", అని భీముడు పలికెను.

భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి "రాజా! ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనేకార్యము చేసినను కష్టము కనిపించదు, కాన, నీవు దీక్ష బూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ద ఏకాదశి మహాశ్రేష్ఠమైనది, దానిని మించిన పర్వదినము మరియొకటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశిరోజు పుష్యమి నక్షత్రముతో కూడినదైయుండును. అటువంటి ఏకాదశీ సమాన మగునది మరి ఏమియులేదు. సంవత్సరమునందు వచ్చు యిరువదినాలుగు ఏకాదశులలో మాఘశుద్ద ఏకాదశి మహాపర్వదినముగాన, ఆ దినము ఏకాదశీ వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును. ఇందు యేమాత్రమును సంశయములేదు. కాన, ఓ భీమ సేనా! నీవు తప్పక మాఘశుద్ద ఏకాదశి వ్రతము నాచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము, దీక్షతోనున్న యెడల ఆకలి యేమాత్రమునూ కలుగదు, నియమము తప్పకూడదు" అని వివరించెను.

ధౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసముండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని "భీమ ఏకాదశి" అని పిలుతురు. అంతియేగాక, ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును. కాన మహాశివరాత్రి మహత్మ్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళువువై ఆలకింపుము అని వశిష్టులవారు దిలీపమహారాజుతో నిటులపలికిరి. ఏకాదశి మహావిష్ణువునకు యెటుల ప్రీతికరమైనదినమో, అదేవిధముగా మాఘ చతుర్దశి అనగా, శివచతుర్దశి. దీనినే 'శివరాత్రీ యని అందురు. అది యీశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసమందలి అమావాస్యకు ముందురోజున వచ్చెడి దీనినే 'మహాశివరాత్రి" అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చును. ప్రతి మాసమందువచ్చు మాస శివరాత్రి కన్నా మాఘ మాస కృష్ణపక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలోగాని, తటాకమందుగాని లేక నూతివద్దగాని స్నానము చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్ఠోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజించవలయును. అటుల పూజించి, అమావాస్య స్నానము కూడా చేసినయెడల యెంతటి పాపములు కలిగియున్ననూ, అవన్నియు వెంటనే హరించిపోయి, కైలాసప్రాప్తి కలుగును. శివపూజా విధానములో శివరాత్రి కంటె మించినది మరియొకటి లేది. కనుక మాఘమాసపు కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతిభేదముతో నిమిత్తము లేక, అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయవలయును.

మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు వేటకు బోవుట, జంతువులను చంపి, వానిని కాల్చి, తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరేదియు తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు గలవాడు క్రూరమృగములు సైతం ఆ బోయవానిని చూచి భయపడి పారిపోయేడివి, అందుచేత అతడు వనమంతా నిర్భయముగా తిరిగేవాడు. ప్రతిదినము వలెనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమియు కంటబడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో యింటికి వెళ్ళుటకు మనస్సంగీకరించనందున ప్రొద్దుకృంగిపోయినన అక్కడున్న మారేడుచెట్టుపైకెక్కి జంతువులకొరకు యెదురు చూచుచుండెను. తెల్లవారుతున్నకొలదీ చలి ఎక్కువై మంచుకురుస్తున్నందున కొమ్మలను దగ్గరకులాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న యెండుటాకులు రాలి చెట్టుక్రింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండితినక రాత్రంతా జాగరణతో వున్నాడు. తనకు తెలియక పోయిననూ మారేడు పత్రములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట, తిండిలేక ఉపవాసముండుట యివన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి.

జరామరణములకు హెచ్చుతగ్గులుగాని, శిశువృద్ధ భేదములుగాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములనుబట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే, మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసికొనిపోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమధూతల చేతిలోనున్న బోయవానిని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునదిలేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు-పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర, నారదాది గణములతో కొలువుతీరియున్న సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యముని దీవించి, ఉచితాసనమిచ్చి కుశలప్రశ్నలడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను. అంతట యముడు, "మహేశా! చాలా దినములకు మీ దర్శనభాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శనకారణమేమనగా, ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి వున్నాడు. ఒకదినమున అనగా మహాశివరాత్రినాడు తాను యాదృచ్చికముగా జంతువులు దొరకనందున తిండితినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి యంతయు మెలకువగానున్నాడేగాని, చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా అంతమాత్రమున అతనికి కైవల్యము దొరకునా" అని యముడు విన్నవించుకున్నాడు. "యమధర్మరాజా! నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండిలేక జాగరణతోనున్న యీ బోయవాడుకూడా పాప ముక్తుడు కాగలడు. ఏ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినవే గనుక, ఈ బోయవాడు పాపాత్ముడైనను, ఆనాటి శివరాత్రి మహిమవలన నా సాయుజ్యము ప్రాప్తమైనది"

     🙏 నారాయణః పరబ్రహ్మ నారాయణ నమోస్తుతే 🙏


✍️" సాంప్రదాయం "

Friday, 26 January 2018

మాఘ పురాణం : 10 వ అధ్యాయము

       

                                        మాఘ పురాణం





10వ అధ్యాయము :- 

ఆదిదేవ సకలాగమ పూజిత యాదవకుల మోహనరూప !
వేదోథ్దర  శ్రీ వేంకటనాయక నాదప్రియ తే నమో నమో !!


ఋక్షకయను బ్రాహ్మణ కన్య వృత్తాంతం :-

పూర్వము భృగుమహాముని వంశమునందు ఋక్షకయను కన్య జన్మించి, దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు, పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి, విరక్తితో యిల్లువిడిచి గంగానది తీరమునకుపోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుటవలన అనేక మాఘమాస స్నానములు ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ తీరు సమయము దగ్గర పడినది. ఒకనాడామె తపస్సు చేసుకొనుచూ ప్రాణములు విడిచెను. ఆమె చాల సంవత్సరములు వైకుంఠమందేవుండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా జేసి "తిలోత్తమ" అను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలములో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోరతపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై "ఓయీ! మీకేమి  కావలయునో కోరుకొనుము" అని అనగా, "స్వామీ మాకు యితరుల వలన మరణము కలుగకుండునట్లు వరమిమ్ము" అని వేడుకొనగా, బ్రహ్మ అటులనే యిచ్చితిని అని చెప్పి అంతర్ధానమయ్యెను.

బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ యిద్దరు రాక్షసులును మహాగర్వము కలవారై దేవతలను హింసించిరి. మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచుండిరి. యజ్ఞయాగాదిక్రతువులలో మల మాంస రక్తాదులు పడవేసి, ప్రజలను నానా భీభత్సములు చేయుచుండిరి. దేవలోకమునకు దండెత్తి, దేవతలందరినీ తరిమివేసిరి, ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని "మహానుభావా! సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపశ్శాలురను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో బెట్టి నానాభీబత్సము జేతుచున్నారు. కాన వారి మరణమునకు యేదైనా ఉపాయమాలోచించు" మని ప్రార్థించిరి. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి  "అమ్మాయి ఈ సుందోపసుందులను రాక్షసులకు యితరులెవరి వల్లను మరణము గలుగదని వరము నిచ్చియున్నాను. వారు వర గర్వముతో చాల అల్లకల్లోలము చేయుమన్నారు. కాన, నీవుపోయి నీచాకచక్యముతో వారికి మరణము కలుగునటుల ప్రయత్నించుము" అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు వున్న యరణ్యమును ప్రవేశించెను. ఆమె చేత వీణపట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధురగానమునూ విని ఆ దానవసోదరులు అటు నిటు తిరుగునట్లామెననుసరిస్తూ ప్రేక్షకులవలె వెంటాడుచుండీరి, నన్ను వరింపుము నన్ను వరింపుమని తిలోత్తమను యెవరికి వారు బ్రతిమలాడసాగిరి. అంతట నా తిలోత్తమ ఓ రాక్షసాగ్రేసురులారా! మిమ్ములను పెండ్ళియాడుట నాకు యిష్టమే. మీరిద్దరూ నాకు సమానులే నేను మీ యిద్దరియెడల సమాన ప్రేమతోనున్నాను. కాని యిద్దరిని వివాహమాడుట సాధ్యము కానిది కాని నాకోరిక యొకటి యున్నది అది ఏమనగా మీ యిద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను  స్వంతముకాగలను అని చెప్పెను.

ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి నేను బలవంతుడననగా నేను బలవంతునని ఇద్దరూ తొడలు కొట్టుకొనిరి, గ్రుద్దుకొనిరి. మల్లయుద్దము చేసిరి, ఇక పట్టుదల వచ్చి గదలు పట్టిరి, మద్దరాలనెత్తిరి, దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి. వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా అరచుచు భయంకరంగా యుద్ధము చేసిరి గదాయుద్ధము తరువాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధములో ఒకరిఖడ్గము మరొకరికి తగిలినందున యిద్దరి తలలూ తెగి క్రిందపడినవి, ఇద్దరూ చనిపోయిరి.

తిలోత్తమను దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మకడకు పోయి జరిగినందా తెలియపర్చగా బ్రహ్మ సంతోషించి,"తిలోత్తమా! నీవు మంచికార్యము చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకీ బలము వచ్చుటకు కారణము నీవు చేసియున్న మాఘమాస వ్రతఫలమే గాన, నీవు దేవలోకమునకు వెళ్ళుము, దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచట అప్సరసలందరికంటే నీవే అధికురాలవగుదు"వని పంపెను.


                    🙏 నారాయణతే నమో నమో 🙏

✍️" సాంప్రదాయం "