Monday, 22 January 2018

మాఘ పురాణం : 6 వ అధ్యాయము


                                     మాఘ పురాణం


 6 వ అధ్యాయము :- 

శ్లో !!  శజ్ఖభృత్ నన్దకీ చక్రీ శార్ జ్గధన్వా గదాధరః !
          రథంగపాణి రక్షోభ్యః సర్య ప్రహరణాయుధః !!
         
          శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి !
          వనమాలి గదీ శార్ జ్గీ శంఖీ చక్రీ చ నన్దకీ !!
          శ్రీ మన్నారాయణో విష్ణుః వాసుదేవో  భిరక్షతు!!
         
కప్పరూపమును విడిచిన  స్త్రీ పూర్వకథ :-

  మునిశ్రేష్ఠా! నా వృత్తాంతమును తెలియజేయుదును గాన ఆల్కింపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము, నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరితీరవాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్ళకు మాఘమాసము ప్రవేశించినది.

ఒకనాడు నా భర్త "సఖీ! మాఘమాసము ప్రవేశించినది, యీనెల చాల పవిత్రమైనది, దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరమూ మాఘ స్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును యీ మాఘమాసమంతయు యీ కావేరీ నదిలో స్నానమాచరింపుము. ప్రతిదినము ప్రాతఃకాలమున నిద్రలేచి, కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికిపోయి నదిలో స్నానము చేయుదము. ప్రభత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోను, మంచి గంధము, అగరు, ధూప దీపములతోను పూజించి స్వామికి ఖండచెక్కర, పటిబెల్లం నైవేద్యమిచ్చి నమస్కరింతము, తరువాత తులసితీర్థము లోనికి పుచ్చుకొందుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠింతము. దీని వలన మనకు చాలా ఫలము కలుగును. నీ అయిదవతనము చల్లగా వుండును" అని హితబోధ జేసెను.

నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి, అతనిని నీచముగా జూచితిని, నా భర్త చాలా శాంతస్వరూపుడు. అయిననూ నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపము వచ్చి "ఓసీ మూర్ఖురాలా! నా యింటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషిణివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా, అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని, మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీతీరమందున్న రావిచెట్టు తొర్రలో మండూకమువై పడిఉందువుగాక" అని నన్ను శపించెను.

"అమ్మాయీ! భయపడకుము, నీకీశాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయును యేకాంతముగా చాలకాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యెను. అతడిప్పుడు వైకుంఠములోనున్నాడు. నీవు నీ పతిమాటలు విననందున యెంత కష్టపడినావో తెలిసినదికదా! మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్రసంతతి, ఆరోగ్యము కలుగుటయేగాక మోక్షసాధనము కూడ నీకీ మాఘమాస వ్రతము మించిన మరి యొక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతియైనది వ్రతము నీ భర్త దూరదృష్టి కలజ్ఞాని, అతని గుణగణాలకు అందరూ సంతసించెడి వారు నిన్ను పెండ్లి యాడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయుననెడి ఆశతో నుండెడివాడు. కానీ, నీ వలన అతని ఆశలన్నీ నిరాశలయిపోయినవి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళలో స్నానము చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టుతొర్రలో జీవించుమని శపించాడు.

ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నీ నిజరూపమును పొందగలిగినావు అందునా యిది మాఘమాసము కృష్ణానదీ తీరము కాన మాఘమాస వ్రత సమయము నీకన్ని విధములా అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివైరమ్ము. స్త్రీలుకాని, పురుషులుకాని యీ సమయములో ప్రాతఃకాలమున స్నానము చేసినయెడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఎవరైనా తెలిసి కాని, తెలియక కాని మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమి లయందునూ, పాడ్యమి రోజుననూ నదీ స్నానమాచరించినయెడల వారి పాపములు నశించును. మాఘ సుద్ధ పాడ్యమినాడునూ, అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినముల లోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి, పురాణ కాలక్షేపము చేసినయెడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునటుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతొ మాఘ పురాణము వినిన మోక్ష ప్రాప్తి కలుగును", అని గౌతమ ముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను. 

                🙏 ఓం నమో విష్ణువే నమః 🙏

Sunday, 21 January 2018

మాఘ పురాణం : 5 వ అధ్యాయము

                                    మాఘ పురాణం



5వ అధ్యాయము :-                                                 

 శ్లో !! యత్ర  యోగేశ్వవరః కృష్ణో యత్ర పార్థో థనుర్థరః
          తత్ర శ్రీ ర్విజయోభూతి ర్ధ్రువానీతిర్మతిర్మమ !!

కుక్కకు విముక్తి కలుగుట :-

దిలీప మహారాజా! సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావుకదా! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనగా మాఘమాసములో నదీస్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమానకాలమందు యెన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికిని మాఘమాసము మొదలైన తరువాత, వారి కష్టములు క్రమేపి సమసిపోవును. మాఘశుద్ద దశమినాడు నిర్మలమైన మనస్సుతో శ్రీ మన్నారాయణుని పూజించినయెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి -

"నాధా! శ్రీ లక్ష్మినారాయణుల వ్రతము చేసిన యెడల మనోవాంఛా ఫలసిద్ది కలుగునని చెప్పియుంటిరి గదా! ఆ వ్రత విధానమెట్టిదో, యెటుల ఆచరించవలెనో తెలియ పరచుడని" కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమినాడు ప్రాతఃకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నదిఒడ్డునగాని, ఇంటివద్ద కాని, మంటపము నుంచి ఆ మంటపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య యెనిమిది రేకుల పద్మము వేసి, అన్ని రకాల పుష్పములు, ఫలములు తీసుకువచ్చి లక్ష్మినారాయణులను మంటపపు మధ్యనౌంచి, ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవములు పూసి పూజించవలెను. రాగిచెంబులో నీళ్ళుపోసి మామిడిచిగుళ్లను అందులోవుంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్తవస్త్రము నొకదానిని కప్పి, లక్ష్మినారాయణుల ప్రతిమను ప్రతిష్టించి పూజించవలెను. ఆ మండపము మధ్యలో సాలగ్రామమునుంచి, ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారిచేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము పెట్టవలెను.

తరువాత రాగిపాత్రలో నీరుపోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాసస్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఏకపాత్రయందు వుంచికాని, క్రొత్తగుడ్డలో మూటగట్టికాని దానమియ్యవలయును. మాఘపురాణమును స్వయముగా పఠించునపుడుగాని, లేక వినునప్పుడు కాని చేతిలో అక్షితలు ఉంచుకొని, చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపైవేసుకొనవలయును గాన ఓ శాంభవీ! మాఘస్నానముచేసి మాఘశుద్ధ దశమినాడు లక్ష్మినారాయణులను నిష్ఠతో పూజించిన యెడల యెటువంటి మాహాపాపములైనను నశించిపోవును. ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసెదను, సావధానురాలవై వినుము. గౌతమమహర్షి, ఒకనాడు తన శిష్యులతోగూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములని దర్శించుచు మార్గమందున్న ముని పుణ్గవులతో యిష్టాగోష్ఠులు జరుపు కొన్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో గూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయములో స్నానము చేసి, తీరమున నున్న ఒక రావిచెట్టు వద్దకు వచ్చి

శ్లో. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే |
     అగ్రతశ్శివరూపాయ, వృక్షరాజాయతే నమో నమః ||

అని రావిచెట్టుకు నమస్కరించి, ఆ చెట్టు మొదట ఆసీనుడయి శ్రీహరిని విధియుక్తముగా పూజించెను. తరువాత శిష్యులందరికి మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశామినాడు ఆ చెట్టు మొదట మండపమేర్పరచి ముగ్గులు, బొట్లుపెట్టి, మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు. ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు

ఆ రావిచెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచటనుండి లేచి ఉత్తరం వైపు మళ్ళి మరల తూర్పునకు తిరిగి, రావిచెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క రావిచెట్టు చుట్టు తిరిగివచ్చినది. అప్పటికి మూడుసార్లు ఆ మండపము చుట్టు ప్రదక్షిణము చేసినందునా, అది మాఘమాసము అయివున్నందునా అది వెంటనే తన కుక్క రూపమును వదలి ఒక రాజుగా మారిపోయెను. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునులయెదుట నిలబడి వారందరికి నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుటచూచిన మునులూ, గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి. "ఓయీ! నీవెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి?" అని గౌతముడు ప్రశ్నించెను.

"మునిచంద్రమా! నేను కళింగరాజును, మాది చంద్రవంశము నాపేరు జయచంద్రుడు, నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ వున్నాను, దానధర్మములనిన నాకు అతిప్రేమ, నేను అనేక దానాలు చేసియుంటిని, గో, భూ, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసియున్నాను, ఎక్కువగా అన్నదానము, తిలదానము చేసియున్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రములునునెన్నో పుణ్యకార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి, దైవ విగ్రహాలను ప్రతిష్టించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను యెన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో వున్న ధర్మాలన్నియును చేసియున్నాను. కాని, నేనిలా కుక్కనయ్యాను, దానికి కారణము లేకపోలేదు. ఆ కారణము కూడా నేను విశరపరచెదను వినుడు.

ఒకానొక దినమున ఒకముని పుంగవుడు గొప్ప యఙ్ఞ మొకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్న సామాన్య విషయము కాదు కదా! దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావలెను గాన, ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. ముని సత్తముడు వచ్చిన వెంటనే యెదురేగి కాళ్ళుకడిగి ఆ నీళ్ళు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలడిగితిని ఆ మునియు  నా సత్కారమునకు మిక్కిలి సంతసించి, 'రాజా! నీకు గుప్త విషయములు తెలియజేయుదును, ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధ్లతో మాఘమాస మహత్మ్యమును చదువుట కాని లేక వినుట కాని చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేకాగ, అశ్వమేధయాగము చేసిన యెడల యెంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కాని, తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలముగాని లేక దానపుణ్యములు అనగా వందయాగాలు చేసినంత ఫలముగాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినగాని, దశమి ఆదివారం వచ్చిన కాని ఉదయమే స్నానము చేసిననూ మరియు మాఘపౌర్ణమిరోజు ఉదయమున స్నానము చేసిననూ మానవుడు యెటువంటి పాపములనైనను విడువగలడు.

ఒక వేళ యితర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీస్నానమాచరించి, దానధర్మాలాచరించి మాఘ పురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు, అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినటుల మాటలాడి యిట్లంటిని. అయ్యా! మునిసత్తమా! మీరు పలికిన విషయములు నాకు తెలియును, అన్నియు బూటకములు. వాటిని నేను యదార్థములని అంగీకరించెను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటికాదు గాన నేనుయే మాఘమాసములు చేయుటకాని, దాన పుణ్యాదులు చేయుటగాని, పూజా నమస్కారములు ఆచరించుటకాని చేయును. చలిదినములలో చన్నీళ్ళు స్నానము చేయుట యెంత కష్టము? ఇక నాకు యీ నీతిబోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని నా మాటలకు మునికికోపము వచ్చినది, ముఖం చిట్లించుకొని సరే, నేను చెప్పవలసినది చెప్పితిని. అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసికొనకుండానే వెడలిపోయినాడు. అంతట నేను ఆ మునిని చేతులుపట్టి బ్రతిమలాడగా, యెట్టకేలకు అంగీకరించి ధనమును తీసికొనిపోయెను, ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని, తరువాత నాకు వరుసగా యేడుజన్మలూ కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలమేమోగాని కుక్కగా యేడు జన్మలూ బాధపడితిని ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టు మూడు పర్యాయములు ప్రదక్షిణము జేసితిని కాన నా పూర్వజన్మస్మృతి నాకు కలిగినది. దైవ యోగమును యెవ్వరునూ తప్పించలేరు గదా! ఇటుల కుక్కజన్మలో ఉండగా మరల నాకు పూర్వ జన్మస్మృతి యెటుల సంక్రమించినదో వివరింపుడనివేడెదను అని రాజు పలికెను.

ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుటవలన యెంతటి విపత్తువాటిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నియు యదార్థములే నీవు కుక్కవై యెటుల పవిత్రుడనైతివో ఆ వృత్తాంతమును వివరించెదను సావధానుడవై ఆలకింపుము.

నేను నా శిష్యులతో కృష్ణవేణీ తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిని. మేమందరము ఈ వృక్ష రాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము. కుక్క రూపములోనున్న నీవు దారినిపోతూ యిచ్చట నైవేద్యమును చూసి తినవలయుననెడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు యెలాగున్నావో తెలుసా! నీ శరీరమున బురదమైల తగిలివున్నది. చూచుటకు చాలా అసహ్యముగా వున్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజచేయుచున్న సమయములో అచటకు జంతువు కాని, పక్షికాని, వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా! నీవు అసహ్యముగా వుంన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను
కొట్టబోవుటచే పారిపోయి, నైవేద్యమును తినవలెనను. ఆశతో తిరిగి యధాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళి వచ్చినావు. అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుటవలన మాఘమాస ఫలము  కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాస మంతయు నదిలోస్నానం చేసి భగవంతుని ధ్యానించి, పురాణపఠనము చేసినచో యెంతటి ఫలమువచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా, అంతలోనే ఆ రావిచెట్టునకున్న ఒక తొర్రనుండి ఒక మండూకము బయటకు వచ్చి, గౌతమఋషి పాదముల పైపడి బెకబెకమని అరచి, అటునిటు గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్ప రూపమును వదలి  మునివనితగా మారిపోయెను. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి, గౌతమఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమముని 'అమ్మాయీ! నీ వెవ్వరిదానవు? నీ నామధాయమేమి? నీ వృత్తాంతము  యేమి?' అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియ జేయుటకై యిట్లు చెప్పదొడంగెను.
             🙏 ఓం నమో శ్రీమన్నారాయణ నాయ 🙏

Saturday, 20 January 2018

మాఘ పురాణం : 4 వ అధ్యాయము

       

                                                                                                                                        మాఘపురాణం



 4వ అధ్యాయము :-

మేఘశ్యామం పీత కౌశేయవాసం - శ్రీ వత్సాజ్కం 
కౌస్తుభోద్భాసితాజ్గమ్ !

పుణ్యోపేతం పుణ్డరీకాయతాక్షం విష్ణుం వన్దే సర్వలోకైకనాథమ్ !!

సశంఖ చక్రం సకిరీట కుణ్డలం సపీతవస్త్రం సరసీరుహేక్షణమ్ !

సహారవక్ష స్థ్సలకౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుమ్ !!

కుత్సురుని వృత్తాంతము:

పులి ముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మహాత్మ్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండెను.
పూర్వకాలమున కుత్సురుడను పేరుగల విప్రుడొకడుండెను. అతడు కర్దమమునియొక్క కుమార్తెను వివాహమాడెను. కొంతకాలమునకా దంపతులకు ఒక కుమారుడు జన్మించెను.

కుమారునికి అయిదవ యేడు రాగానే ఉపనయనం చేసెను. ఆ బాలుడు దినదినాభివృద్ధి నొందుచు పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసముయెట శ్రద్దజూపుట, నీతి నియమాలను పాటించుట, దైవకార్యములయందు భక్తి కలిగియుండుట మొదలగు కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములనభ్యసించెను.

ఈవిధంగా కొంతకాలం గడచెను. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్తవయస్సు వచ్చెను. అతనికి దేశాటనకు బోవలయునని కోర్కె కలిగి తీర్థయాత్రలకు బయలుదేరెను. అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు, మాఘమాసం వచ్చునప్పటికి కావేరీ నదీ తీరమునకు చేరుకున్నాడు.

“నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించినది. ఇది నా భాగ్యం” అని ఆ విప్ర యువకుడనుకొని సంతృప్తి చెందెను.

మాఘమాసమంతయు ఇచటనేయుండి అధికఫలమును సంపాదించెదను” అని మనమున నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యమూ ఆ నదిలో స్నానము చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచటనే కాలం గడుపుచుండెను. ఆవిధముగా నదీ తీరమున మూడు సంవత్సరములుండి అత్యధిక పుణ్యఫలము సంపాదించెను. ఆ తరువాత అన్ని కోర్కెలను సంపాదించుటకు ఘోరతపమాచరించవలయుననీ తలంచి ఆ సమీపమందొక పర్వతముపై తపస్సు చేసికొన సంకల్పించి తపస్సుజేయ మొదలిడెను. అట్లు కొంతకాలము నిష్ఠతోనూ, నిశ్చల మనస్సుతోనూ, తపస్సు చేయుచుండెను. అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యెను.
ఆ విప్రయువకుడు కన్నులు తెరచి చూచుసరికి శంఖ, చక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశముతో వున్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు. అమితానందముతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు.

ఈవిధముగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తి భావమునకు శ్రీహరి సంతసమంది అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను.
ఓ విప్రకుమారా! నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నుని చేసుకొంటివి. అది ఎటులనగా నీవు నిడవకుండ అనేక పర్యాయములు మాఘమాసములో నదీ స్నానము చేసి తపశ్శాలురు కూడా పొందని మాఘమాస పుణ్య ఫలమును సంపాదించితివి. అందుచేతనే నీపై నాకు గాఢానురాగము కలిగినది. గాన నీకేమి కావలయునో కోరుకొనుము. నీ అభీష్టము నెరవేర్చెదను” అని శ్రీమన్నారాయణుడు పలికెను.

శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై – ప్రభూ జగద్రక్షకా! సర్వాంతర్యామీ! ఆపద్బాంధవా! నారాయణా! ఆ దివ్య దర్శనము వలన నా జన్మ తరించినది. నిన్ను చూచినది మొదలు నేను ఏవిధమైన సుఖాలు కోరుటకు నా మనస్సంగీకరించలేదు. మనుజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతము వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యము నాకిపుడు కలుగగా మరొక కోరిక కోరగలనా? నాకింకేమియు అవసరము లేదు. కానీ మీ దివ్యదర్శనము నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని వేళలయందు ఈ స్థలమందు భక్తులకు దర్శ మిచ్చుచుండవలెను. అదియే నాకోరిక” అని ప్రార్థించెను.

శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చెద గాక! అని పలికి నాటినుండీ అచటనే ఉండిపోయెను.

కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను. చాలా దినములకు కుమారుడు వచ్చెనని వృద్ధులై వున్నా తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలడిగిరి.
               
          🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏

Friday, 19 January 2018

మాఘ పురాణం : 3 వ అధ్యాయము

                       
                                                                                                                                   మాఘపురాణం

3 వ అధ్యాయము :- 


 శాన్తాకారం భుజగశయనం పద్మనాభం సురేశం !
 విశ్వధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం !!   

 లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ద్యాన గమ్యం       వందేవిష్ణుం భవభయహారం సర్వలోకైకనాథమ్ !!  





వింధ్య పర్వతము: 


దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరల ఇట్లు చెప్పదొడంగెను. భూపాలా! నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు. త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి జనులు, పశువులు, చాలా నష్టపడినవి. అందువలన యజ్ఞయాగాది కార్యములు గాని, దేవతార్చనలు గాని, చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకోను మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదలి వలస పోవుచుంటిరి. అప్పుడు భృగుమహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవానదీ తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరులేక బీడు పడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుట లేదు.

మహా తపస్వియగు భృగుమహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక పోయాడు. ఎన్నో సంవత్సరాలనుండి ఆ ప్రాంతమందుండుటవలన అచటినుండి కదలుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధిలేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు.

హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచరియ వున్నది. ఆ కొండచరియ అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా వున్నది. అది తెల్లగా కూడా వున్నది. ఆ కొండచరియయందు ఇంద్రనీలములు ఉండుట వలన ధగధగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండవద్దకు వచ్చి శ్రీమన్నారాయణు భక్తిభావముతో ప్రార్థించిరి. అంతియేగాక ఆ పర్వతమువద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుందురు” అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను.

“ఓ మహానుభావా! ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేసినవి. ఇంకను విశేషములున్న తెలుపగోరెదను” అని ప్రార్థించెను.
మరల వశిష్ఠులవారు ఇట్లు చెప్పిరి. “రాజా! నీయభీష్టం ప్రకారమే వివరింతును. సావధానుడవై ఆలకింపుము.

“ ఆ పర్వతరాజము కడు వింతయైనది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్య మృగములు, అనేక రకముల పక్షులతో నున్న ఆ అప్ర్వటం ముప్పది యోజనముల పొడవు కలిగి పది యోజనములు ఎత్తుగలదియై అలవారుచుండెను. అటువంటి పర్వతం వద్దకు భృగుమహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించాడు. తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొనుచుండెను” అట్లు కొంతకాలం గడచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించుకొనుచున్న భృగుమహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.


గంధర్వ యువకుని వృత్తాంతము:

“భృగుమహర్షీ! నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించిననూ పులిమొగం నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అటుల కలిగెనో బోధపడకున్నది. ఆమె ణా భార్య అతిరూపవతి, గుణవంతురాలు మాహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని. గాన ణా యీ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాదను తొలగింపజేయుడు” అని పరిపరి విధముల ప్రార్థించెను. భృగుమహర్షి గంధర్వుని దీనాలాపము నాలకించెను. ఆతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలచివేసినట్లయింది. ఆ గంధర్వుని కెటులైనను తన శక్తికొలది సాయము చేయవలయునని నిశ్చయించుకొని ఇట్లనెను.

“ఓయీ గాంధర్వ కుమారా! నీవు అదృష్టహీనుడవు. అదృష్ట హీనత వలననే నీకీ కష్టదశ కలిగింది. పాపం, పేదరికం, దురదృష్టం అను మూడునూ మనుజుని కృంగదీయును. ఈ మూడింటినీ నివృత్తి చేసుకొనవలెనన్న మాఘమాస స్నానమే పరమౌషధం. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమపావనమైన మార్గం. గావున నీవు నీ భార్యతో గూడ పర్వతం నుండీ ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము. అదియునుగాక యిది మాఘమాసము గదా! వెళ్ళబోయిన తీర్థమెదురైనట్లు అన్నియు సమకూడుతున్నవి. ఈరోజుతో నీ కష్టములు తొలగిపోవును. నీ మనోవాంఛ యీడేరును. భయపడకుమని మాఘస్నాన ఫలము గురించి వివరించెను.

ఆ గంధర్వుడు భృగుమహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములాలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆదాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసెను. వెంటనే తనకున్న పెద్దపులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గాంధర్వ దంపతులు అమితానందం నొందిరి.
అంత వారిద్దరూ భృగుమహర్షి కడకువచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి. భృగువు వారలను దీవించి పంపివైచెను.

ఈవిధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠులవారు దిలీపునకెరిగించి, “వింటివా రాజా! గంధర్వ కుమారుని వృత్తాంతం? మాఘమాసములో పుణ్యనదులయందు స్నానమాచరించిన యెడల ఎట్టి ఫలం కలుగునో ఊహించుకొనుము.
               🙏 ఓం నమో నారాయణాయ నమః 🙏

Thursday, 18 January 2018

మాఘ పురాణం : 2 వ అధ్యాయము


                                                                             
                                                                                                             
                                                                                                                                          మాఘపురాణం           
      


  2 వ అధ్యాయము :-

  వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
  నిర్విఘ్నం కురుమేదేవ సర్వ కార్యేషు సర్వదా !!

దిలీప మహారాజు వేటకు బయలుదేరుట:

దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులొనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రివలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలెననెడి కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైననూ నెరవేర్చుకొనుట సహజమే కదా! ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్యసమేతుడై వెడలెను.

దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి కౄరమృగములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను, మనుష్యులను చంపి నానా భీభత్సములు చేయుచున్నవి.

దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టు పెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకూ అడవియందు వుండి అనేక క్రూర జంతువులను జంపిరి. ఒకనాడొక మృగం పై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టు విడువక దాని వెంట పరుగెత్తెను. ముందు మృగం, వెనుక దిలీపుడు, ఆతని వెనుక పరివారము పరుగిడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎందిపోతున్నది. నీటికొరకు పరివారమంతా వెదుకుచుండిరి. అదృష్టం కొలదీ ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామరపువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడూ అతని పరివారమూ, తృప్తిదీర నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వట వృక్షం క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు, అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి, బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను.

అటుల ఇంటిముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు గలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడియుండెను. ఆ బ్రాహ్మణుడును క్షణమాగి, ఆ రాజును గాంచి “ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతునివలె నున్నాడు. ఈతని కేదయినా ఉపకారము చేయుట మంచిది” అని మనసులో తలచి – మహారాజా! శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్ననూ అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహాత్మ్యం నీకు తెలియదా!” అని ప్రశ్నించెను.

ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని జూచి – “విప్రోత్తమా! అటుల ప్రశ్నించారేమిటి?” అని ఆశ్చర్యంతో పలికెను.
“పరమ పావనమైన మాఘమాసం కదా!” అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను.

“చిత్తము స్వామీ! నాకు గుర్తులేదు. రాజప్రసాదమున నున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయావినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకా విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహాత్మ్యము నెరింగింప వలసినదిగా ప్రార్థించుచున్నా”నని దిలీపుడు వేడుకొనెను. ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి “రాజా! సూర్యవంశపు గురువైన వశిష్ఠులవారు అప్పుడప్పుడు మీకడకు వచ్చుచుండును గదా! ఆతని వలన మాఘమాస మహాత్మ్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదియు లేదు. గాన అటుల చేయుము” అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను.

దిలీపుడు వశిష్ఠుని కడకుబోవుట:

దిలీపుడు తన పరివారంతో నగరము జేరెను. పదేపదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులనో ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతఃకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు, సకలాభరణములు ధరించి, మంత్రి, సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను. ఆ సమయములో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును జూచి వారికి తపోభంగము కలుగనీయరాదనీ కొంతతడవు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సునుండి లేచి రాజును కుశల ప్రశ్నలడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని యడిగెను.

దిలీపుడు వశిష్ఠునితో “ఋషిసత్తమా! తమవలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహాత్మ్యముగాని,దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమనుండి తెలుసుకొన గోరి తమ వద్దకు వచ్చితిని. గాన పరమ పావనమూ మంగళప్రదమూ అయిన మాఘమాస మహాత్మ్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను” అనెను.
అవును మహారాజా. నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన యావశ్యకత ఎంతయినా గలదు.

మాఘమాసముయొక్క మహాత్మ్యమును వర్ణింప నాకుకూడా శక్యముగాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని, యాగములు గాని, ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయునదీస్నానమువలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలము నిచ్చు మాఘమాసము అన్నివిధముల శుభప్రదమైనది. గాన యీ మాఘమాసమునందు చేయు నదీ స్నానమువలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతియేగాదు. మాఘము అన్నివిధాలా పుణ్యప్రదమైనది.
అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గాని మాఘ మాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్న మహత్తుగలది మరొకటి లేదు.

                🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏

మాఘ పురాణం : 1 వ అధ్యాయము

                                    
                                          మాఘ పురాణం                                       


                                                                   



 1వ అధ్యాయము :-

                                   మాఘమాస మహిమ

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !!

వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ !!

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః !!

           ప్రపంచదేశములన్నిటిలోను భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశంలో హిమాలయాది  పర్వతములు, గంగాదినదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైనవానికి అనేకరెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాడం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బగణ్యమైనది అంటే యింత అని లెక్కకురానిది.

 పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి 'స్వామీ! స్నానానికీ, ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ, పావనమూ, సిద్దిప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షు లారా! నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ, అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట, ఆ మహావిష్ణువు యోక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసమేర్పరచుకొన్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూవుంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ చూడడానికి వస్తూవుండేవారు. అలగే రోమహర్షుణుడో, ఆయన కుమారుడు సూతమహర్షియో  అందరిలా ఆయాగాన్ని చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిశారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులూ లేనప్పుడు పుణ్యకథాప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పేంపొందించేవి.

ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలలనుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూతమహర్షి వున్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనం పై కూర్చుండబెట్టి అతిధి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు. సూతమహర్షి! మీ తండ్రిగారు రోమహర్షణులవారు పురాణప్రవచనంలో ధర్మవిషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల  సమర్థులు, రోమములకును హర్షము కలిగించువారు కనుగ రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు.

          సూతమహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద వున్న అభిమానానికి కృతజ్ఞణ్ణి, పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడ యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్నూ ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి, వ్యాసమహర్షుల వారి దయా విశేషం చేత, నాకు తెలిసిన విషయాన్ని, మీ అనుగ్రహం చేత స్పురింపజేసుకొని యధాశక్తి  వినిపించి మీ ఆనందాశీస్సులనీ, భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను, మీ ఆజ్ఞయేమిటి అని సవినయంగా అడిగెను. అప్పుడు మునులు 'సూతమహర్షి లోగడ వైశాఖమాసం, కార్తీకమాసం వైశిష్ట్వాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన, వ్రతానుష్టాలని వివరించి మాకానందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని' కోరారు.

 అప్పుడు సూతమహర్షి క్షణకాలం కళ్ళుమూసుకుని ధ్యానంలో ఉండి తండ్రిగారినిగురువులను తలచుకొని నమస్కరించి కనులుతెరచి మునులకు మరల నమస్కరించి యిలాప్రారంభించాడు. మహర్షిసత్తములారా! మీరుఅడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్యప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది.చదువుకొన్నవారు కొద్దిమంది అయినా,యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపంపోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పైవిధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈవిషయం బాగా ఉపకరిస్తుంది.పూర్వం ఒకప్పుడుజగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి యిదే విషయాన్ని అడిగింది.  గృత్నమదమహర్షిమొదలైనవారు చెప్పిన విషయాలని పార్వతీదేవికిపరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటుచెప్పెదను వినండి.

    పార్వతీదేవి పరమేశ్వరునితో "విశ్వాత్మకా! సర్వలోకేశ్వరా! సర్వభూతదయానిధీ! ప్రాణేశ్వరా! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత యింపుగానున్నవి. మాఘ మాస మహిమను వివరింప గోరుచున్నానని" ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు "కళ్యాణీ! జగన్మంగళా! నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది. గంభీరమైనది నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమియందును? తప్పక చెప్పెదను,  వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతఃకాలస్నానము చేసినవారు పాపవిముక్తులై ముక్తినందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వపాపములను పోగట్టును. రెండవస్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవస్నానం అతనికి శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి యివ్వాలని శ్రీమహవిష్ణువే ఆలోచనలోపడును. ప్రయాగలో మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ వుండదు. మాఘ మాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలోగాని సరస్సులో గాని స్నానం చేసినవారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు, నూయి, కాలువ మొదలైనవానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా, తెలిసికాని, తెలియకకాని, బలవంతంగాకాని మాఘ మాసమున ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నియును పోవును. భక్తి భావముతో నెలాంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును.

           మాఘస్నానమును మాని, విష్ణువునర్చింపక, దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లుపోవును? అతడు భయంకరమైన కుంభీపాకనరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు, నీచజన్మలను పలుమార్లుపొందును. చలికి భయపడి స్నానము చేయనివారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మలనందుదురు సుమా, దరిద్రులైనను, బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయనుపొందెదరు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.

       ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను, మాఘమాస ప్రాతఃకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసినవానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకుగాని, భయముచే గాని, బలవంతముగాగాని, మాఘస్నానము చేసినవాడు పాపవిముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి వానినుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానముగాని కంబళదానముగాని చేసిన స్నానఫలమునంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని, చేయించిన వారికిని పుణ్యముకల్గును. ఈ స్నానమును అన్ని వర్ణములవారును చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను, నివారించినను మహాపాపములు కలుగును.

     పార్వతీ! మాఘస్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని, ఆచమనముచేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్నిమాసములలో మాఘమాసముత్తమము. శ్రీవారిదేవతలందరిలో ఉత్తముడు. అన్నిమాసములలో మాఘమాసముత్తమము. వృక్షములలో అశ్వత్తవృక్షముత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడుత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములుత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని, నిందించినను, నివారించినను మహాపాపములు కలుగును. నాలుగువర్ణముల వారిలో బ్రాహ్మణుత్తముడు. పర్వతములలో మేరుపర్వతముత్తమము. కావున మాఘమాస స్నానమనంత పుణ్యప్రదము సుమా.

     దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకుపోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను.మనోహరమైన సరస్సునొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు 'మహారాజా! పరమపవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండపోవుచున్నానేమి. మాఘమాసమున చేయు నదీస్నానముకాని, సరస్స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగువా? యని ప్రశ్నించెను. రాజు మాఘస్నానమహిమను చెప్పుడని కోరగానతడు. రాజా నీ విప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠమహర్షివలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.
  దిలీపమహారాజు మాఘమాసస్నానమహిమ తెలిసికొనవలయునని తమ కులగురువైనవశిష్టమహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువునుదర్శించి నమస్కరించి మాఘమాసస్నానమహిమను తెలుపగోరెను. వశిష్టమహర్షి దిలీపునియాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా!నీకోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలావిశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములుయితర దినములలో చేసిన పుణ్యకార్యములకంటేఎక్కువ పుణ్యము నిచ్చును.మాఘమాసమునప్రాతఃకాలమునచేసిన స్నానమే సర్వపాపములనుపోగట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును.స్నానమేయింత అధికమైనపుణ్యము నిచ్చునోపూజ పురాణ శ్రవణాదులవలన నెంతటిఫలముండునో యూహించుకొనుము.మాఘస్నానము వలన సర్వ దుఃఖములనుపోగట్టుకొని శుభలాభములను పొందిన కొందరివృత్తాంతములను వివరింతును. దానిని బట్టిమాఘమాస వైశిష్ట్యమును తెలిసికొనయత్నింపుము.
      పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము (వానలు లేకపోవుట పంటలుపండకపోవుట మొదలైన లక్షణముగల కరువు)వింధ్య-హిమాలయపర్వతముల మధ్యనున్నభూమిలో కలిగెను. దీనివలన సామాన్యజనులు,ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు,పక్షులు, సర్వప్రాణుల మిక్కిలి బాధపడినవి,అట్టివారిలో భృగుమహర్షి యొకడు అతడును ఆప్రాంతమును విడుచుటకు యిష్టములేకున్ననుకైలాస పర్వత ప్రాంతముకడకు చేరి తనకునచ్చినప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొనితపమాచరించు కొనుచుండెను. పవిత్రముమనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకుగంధర్వులు యక్షులు, కిన్నరులు మున్నగుదేవజాతులవారును వచ్చుచుండిరి అచటవిహరించి ఉత్సాహమును పొందుచుండిరి.

   ఒకనాడు గంధర్వుడోకడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగుమహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమైవిచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులిమొగమై యుండును. ఇందువలన అతడుయెంత చక్కగానున్నను పులిమొగమువలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగుమహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా! నాకు భోగభాగ్యములన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరికదా! ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు, నేను గంధర్వుడను మానవులకంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగనున్నది. దీనిని పోగట్టు కొనుటయెట్లో తెలియరాకున్నది. ఈ వికారమువలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయయుంచి నాకీ వికారరూపము పోవునుపాయమును చెప్పుడని ప్రార్థించెను.

  భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికిజాలికలిగినది వానికిసాయపడవలయుననుకొన్నాడు. నాయనాపురాకృతకర్మము యెవనిని విడువడు. గతజన్మలోచేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము,దురదృష్టము, పేదరికమూ ఇవి మూడునుజీవినిబాధించును. ఇట్టి వానిని పోగట్టుకొనిశుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందుస్నానము, పవిత్రక్షేత్రములందు దేవపూజచేసినకొనవలయును.ఇట్టి వానిని పవిత్రమైనకాలమున చేసినచో సద్యఫలము కలుగును.కాలమంతయు మంచిదే అయిననుమాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసినస్నానము, పూజ, జపము, తపము జీవికి గలపాపమునుపోగట్టి శుభమును వెంటనే కలిగించును.అన్ని పుణ్యనదులలో స్నానాదికముచేసినచోవచ్చుఫలితము, మాఘమాసములో నదిలోగాని,సముద్రములోగాని, కాలువలోగాని,సెలయేరులోగాని యే స్వల్పజల ప్రవాహమైననుఅందు స్నానము చేసినచో వచ్చును. అనగామాఘస్నానమును యేప్రవాహమున చేసిననుసర్వతీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చునంతగొప్పది. నీ జాతివారికైనను అనంతపుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిదిమాఘమాస ప్రారంభముకావున నీ భార్యతో బాటుప్రతిదినము ప్రాతఃకాలమున మాఘస్నానమును యిష్టదేవతా పూజను అచటనున్న నదిలోచేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకుచెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటినదిలో మాఘస్నానమును, తీరమునయిష్టదేవతాపూజను విడువకమాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమునవాని పులిమొగము పోయి వానికి సుందరమైనముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడిమాఘమాసమహిమను కీర్తించును. కృతజ్ఞడై,మునికి భార్యతోబాటు నమస్కరించెను. అతనియాశీర్వాదమునంది తన భార్యలో బాటుతనలోకమున కరిగెను. దిలీపమహారాజామాఘస్నాన మహిమను గమనించితివా?మరియోక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడుమరలనిట్లు పలికెను.

#మాఘమాస_శుభాకాంక్షలు

Wednesday, 17 January 2018

మాఘమాసం విశిష్టత

 
                              మాఘమాసం

     మాఘమాసం ప్రత్యేకత ఏమిటి? మాఘమాసం విశిష్టత

మన హిందూ సాంప్రదాయాల్లో ప్రతి మాసం పవిత్రమైనదే. ప్రతి మాసానికి ఓ ప్రత్యేకత ఉన్నది. మన తెలుగు కాలెండర్ ల ప్రకారం మాఘమాసం 11 వ నెల. త్రి మూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురికి సంబంధించిన మాసం. ఈ నెల లో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు లింగ రూపం ధరించింది ఈ మాసం లోనే. అంతే కాదు చదువులతల్లి సరస్వతి జన్మించింది కూడా వసంత పంచమి అయిన మాఘ మాసం లో నే. అంతే కాదు ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడు తన రధం పై సంచారానికి బయలు దేరుతాడు అని ప్రతీతి. మాఘ మాసం లో పుణ్యస్నానాలకు ప్రతీతి.
ఈ మాసం లో మకర లగ్నం లో సూర్య భగవానుడు ఉండే సమయం లో చేసే స్నానాలకు విశేషం ఉన్నది. ఆ జలం అంతా హరి పరిపూర్ణుడై ఉంటాడు అని, ఆ విధంగా విష్ణుమూర్తి కృపకు పాత్రులమవుతామని చెప్పబడింది. స్నానం అయిదు రకాల విధానాలు కలిగి ఉంటుంది అని పురాణాలు చెప్పబడ్డాయి. ఈ అయిదు విధానాలు పాటించేటట్లు అయితే ఆ స్నానం పరిపూర్ణమైనది అవుతుంది. సూక్తము, సంకల్పము, మార్జనము, అఘవర్షనము, తర్పణము. తెల్లవారు ఝామున స్నానం చేయటం చాలా విశేషము 4 నుంచి 5 లో పల స్నానం చేస్తే అది ఋషిస్నానం అంటారు. 5 నుంచి 6 లోపల చేస్తే దైవ స్నానం, 6 నుంచి 7 లోపల చేసేది మానుష స్నానం, ఆ తరువాత చేసేది రాక్షస స్నానం అంటారు. ఇవి కూడా నదీ స్నానాలు చేయాలి.
నదీ స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమం ఒకటి ఉన్నది. భార్యా భర్తలు అయితే ఇద్దరూ కొంగును ముడివేసుకుని స్నానం చేయాలి. అంతే కాదు స్నానం చేసిన తరువాత నాలుగు గుప్పెళ్ళ మట్టిని నదిలోనుంచి తీసిబయటవేయాలి. ఎందుకంటే మనం చేసిన స్నాన ఫలం ఆ నది తవ్వించిన వారికి కొంత పోతుంది, మనం మళ్ళీ నదిని త్రవ్వలేము కాబట్టి కొంత మట్టి తీయటం వలన పూడిక తీసిన ఫలితం మనకు దక్కుతుంది.

మాఘమాసం విశిష్టత
చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. 'మఘం' అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది.

మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. మఘం అంటే యజ్ఞం. కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.

మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20నుంచి మార్చి 30వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.         

                                                 

మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో 'ప్రయాగ'ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.
మాఘ పూర్ణిమను 'మహామాఘం' అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు.చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. 'మఘం' అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది.

మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. మఘం అంటే యజ్ఞం. కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.


మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20నుంచి మార్చి 30వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.

మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో 'ప్రయాగ'ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.
మాఘ పూర్ణిమను 'మహామాఘం' అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు.

మాఘమాసం మహిమ
అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు. శివుడైనా, విష్ణువైనా, ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతుంటాయి.
మాఘ విశిష్టతను గురించి, ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం.

తిథులు:-

1. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది.  2. శుద్ధ విదియ 3. శుద్ధ చవితి  4. శుద్ధ పంచమి  5. శుద్ధ షష్టి  6. శుద్ధ సప్తమి  7. అష్టమి  8. నవమి 9. ఏకాదశి  10. ద్వాదశి 11. త్రయోదశి  12. మాఘ పూర్ణిమ  13. కృష్ణపాడ్యమి  14. కృష్ణ సప్తమి 15. కృష్ణ ఏకాదశి 16. కృష్ణద్వాదశి  17. కృష్ణ చతుర్దశి 18. కృష్ణ అమావాస్య  ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.

మాఘస్నానానికి సంబంధించిన కథ :-

మాఘమాసంలో ప్రతిరోజూ అంటే ముఫ్పై రోజులపాటు నియమ నిష్టలతో స్నానాలు, వ్రతాలు చేయటం పలు ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ప్రతి రోజూ స్నానం, పూజ, మాఘ పురాణ పఠనం కానీ, శ్రవణం కానీ చేస్తే పాపహరణం అని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. రఘువంశంలో సుప్రసిద్ధుడైన రాజు దిలీపుడు ఆయన ఓ రోజున వేట కోసం హిమాలయ పర్వత ప్రాంతాలలో ఓ సరస్సు సమీపానికి వెళ్ళాడు. అక్కడ ఒక అపరిచితుడైన ముని ఎదురయ్యాడు. ఆయన ఆ రాజును చూసి ఈ రోజే మాఘమాసం ప్రారంభమైంది. నీవు మాఘస్నానం చేసినట్టు లేదు త్వరగా చెయ్యి అని చెప్పాడు. మాఘస్నానం ఫలితాన్ని గురించి రాజగురువు వశిష్టుడిని అడిగితే ఇంకా వివరంగా చెబుతాడని ఆ ముని చెప్పి తన దోవన తాను వెళ్ళిపోయాడు. దిలీపుడు ముని చెప్పినట్టే స్నానం చేసి ఇంటికి వెళ్ళాక వశిష్ట మహర్షిని మాఘస్నాన ఫలితం వివరించమని వేడుకొన్నాడు.

అప్పుడు వశిష్టుడు మాఘస్నాన ఫలితానికి సంబంధించిన విషయాలన్నీ వివరించాడు. మాఘంలో ఒకసారి ఉషోదయ స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం. ఇక మాసం అంతా చేస్తే ప్రాప్తించే ఫలం అంతా ఇంతాకాదు. పూర్వం ఓ గంధర్వుడు ఒక్కసారి మాఘస్నానం చేస్తేనే ఆయన మనస్తాపం అంతా పోయింది. ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా ముఖం మాత్రం పూర్వజన్మ కర్మ వల్ల వికారంగా ఉండేది. ఆ గంధర్వుడు భృగుమహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకొన్నాడు. తనకు అన్ని సంపదలు, అన్ని శక్తులు ఉన్నా ముఖం మాత్రం పులి ముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని, ఏం చేసినా అది పోవటంలేదని అన్నాడు. గంధర్వుడి వ్యథను గమనించిన మహర్షి అది మాఘమాసం అయినందువల్ల వెంటనే వెళ్ళి గంగానదిలో స్నానం చేయమని.. పాపాలు, వాటి వల్ల సంక్రమించే వ్యథలు నశిస్తాయని అన్నాడు. వెంటనే గంధర్వుడు సతీసమేతంగా వెళ్ళి మాఘస్నానం చేశాడు. మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి ఆ గంధర్వుడికి ముఖం అందంగా తయారయింది.

మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ :-

పరస్త్రీ వ్యామోహం పరమ పాపకరమన్న సూక్తికి ఉదాహరణగా ఉన్న ఈ కథ మాఘ పురాణం తొమ్మిదో అధ్యాయంలో కనిపిస్తోంది. మాఘస్నాన పుణ్యఫలం వివరించటం ఈ కథ లక్ష్యం. ఆ పుణ్య ఫలాన్ని పొందటంతో పాటు తెలిసీ తెలియక కూడా పరస్త్రీ వ్యామోహాన్ని ఎవరూ ఎప్పుడూ పొందకూడదని హెచ్చరిక చేస్తోంది ఈ కథ. పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు. తుంగభద్రా నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మారుమోగుతూ ఉండేది. మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులను, శూరులైన దేవతలను వెంట పెట్టుకొని దేవేంద్రుడు బయలుదేరాడు. రాక్షస సంహారం చేసి ధర్మ రక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు. అప్పటికి అవకాశం లేక దేవతలు, దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరిస్తూ ముందుకు వెళ్ళాడు.
కాని ఆ ఇంద్రుడి మనసు ముని పత్ని మీదనే లగ్నమై ఉంది. తిరిగి ఓ రోజున తెల్లవారే వేళ మిత్రవిందుడి ఆశ్రమం దగ్గరకొచ్చాడు. ఆ సమయానికి మిత్రవిందుడొచ్చి ఎవరు నీవు? ఏం కావాలి? అని గట్టిగా ప్రశ్నించటంతో తాను దేవేంద్రుడినని గొప్పగా చెప్పుకున్నాడు. ఆ వేళ ఏం కోరుకొని ఇక్కడకు వచ్చావు? అని ముని మళ్ళీ అడిగాడు. ఆ ప్రశ్నకు ఇంద్రుడు తలదించుకోవటం తప్ప మరేమీ చేయలేక పోయాడు. ముని తన దివ్యశక్తితో అంతా గ్రహించాడు. వచ్చింది సాక్షాత్తూ దేవేంద్రుడే అయినా, దేవతలకు ప్రభువే అయినా ఉపేక్షించ దలచుకోలేదు. ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని, స్వర్గానికి వెళ్ళే దివ్య శక్తులు కూడా నశిస్తాయని ముని తీవ్రంగా శపించాడు. కొద్ది సమయంలోనే ఆ శాపం ఫలవంతమైంది. ఇంద్రుడికి మిగిలిన శరీరమంతా బాగానే ఉన్నా ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది. చెవులు నిక్కబెట్టుకొని భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తడిమి చూసుకొని ఇంద్రుడు సిగ్గు పడ్డాడు. దివ్య శక్తులు నశించి అందవిహీనమైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధ పడ్డాడు. ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి, ఆకులు తినటం మీదకు మనసు మళ్ళింది. ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూనే సమీప అరణ్యంలో ఉన్న కొండ గుహలోకి వెళ్ళాడు. ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా ఆ కొండ గుహలోనే దాదాపు 12 సంవత్సరాల కాలం పాటు గడిపాడు దేవేంద్రుడు. ఇంద్రుడు స్వర్గంలో లేడని ఎటో వెళ్ళిపోయాడని దేవతలంతా వెతుకుతూ ఉండటాన్ని దేవతలకు శత్రువులైన రాక్షసులు గమనించారు. వెంటనే ఎక్కడెక్కడి రాక్షసులు అంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. స్వర్గవాసులంతా చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు.

కొంతమంది స్వర్గవాసులు శ్రీ మహా విష్ణువును గురించి తపస్సు చేసి తమ కొచ్చిన బాధనంతా వివరించారు. అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరం, దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దాని వల్లనే దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయన్నాడు. ఒక్కడు తప్పు చేసినా అతడిని అనుసరించి ఉండే ఎందరికో కష్టాలను అనుభవించాల్సి రావటం అంటే ఇదేనని దేవతలకు విడమరచి చెప్పాడు. ఇంద్రుడికి ఈ శాపం పోయి దేవతలంతా సుఖం పొందాలంటే ఏదైనా ఉపాయం చెప్పమని వారు కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘ మాసస్నాన వ్రత మహాత్మ్యాన్ని వారికి వివరించాడు. మాఘమాసంలో ఒక్కరోజున నియమంగా నదీ స్నానం చేసినా ఎంతో పుణ్య ఫలమని, సర్వపాపాలు నశిస్తాయని స్పష్టం చేశారు. ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న పర్వత గుహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి ఈ శచీపతిని తెచ్చి తుంగభద్ర నదిలో మాఘమాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు. కాకతాళీయంగా అది మాఘమాసం కావటంతో వెనువెంటనే దేవతలంతా గాడిద ముఖంలో ఉన్న ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చి తుంగభద్రలో స్నానం చేయించారు. ఆ పుణ్య ఫలంతో ఇంద్రుడి పాపం నశించి మళ్ళీ మామూలు రూపం వచ్చింది.

మాఘస్నాన పుణ్య ఫలితాలను వివిరించే కథ :

పూర్వం ఆంధ్రదేశంలో సుమంతుడు అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతడి భార్య పేరు కుముద. ఆమె ఎంత ధర్మాత్మురాలో సుమంతుడు అంత అధర్మపరుడు. అడ్డదారుల్లో ధనం సంపాదించటమే తప్ప ఏనాడూ దానధర్మాలు చేసేవాడు కాదు. సంపాదించిందంతా లోభ గుణంతో దాచి పెడుతూ ఉండేవాడు. ఓ రోజున సుమంతుడు ఏదో పనిమీద గ్రామాంతరం వెళ్ళాడు. ఆ రోజున బాగా మబ్బులు పట్టి వర్షం కురవటం ప్రారంభించింది. అర్ధరాత్రి సమయానికి వయసు మళ్ళిన ఓ సాధువు వానలో తడుస్తూ సుమంతుడి ఇంటి ముందుకు వచ్చాడు. ఇంట్లో సుమంతుడి భార్య కుముద ఒక్కటే ఉంది. ఆ సాధువు ఆమెను బతిమాలుకొని ఆ రాత్రికి ఆ ఇంటిలోనే ఉంటానన్నాడు. కుముద పెద్దలను, వృద్ధులను గౌరవించటం, అతిథి మర్యాదలు చెయ్యటం తెలిసిన ఉత్తమురాలు. కనుక ఆ సాధువును లోపలికి ఆహ్వానించి పరిచర్యలు చేసింది. సాధువు వాన, చలి బాధలను పోగొట్టుకొని హాయిగా నిద్రించాడు. కుముద కూడా వేరొక గదిలోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజాము సమయానికి సాధువు మేల్కొని హరినామ సంకీర్తనం చెయ్యటం ప్రారంభించాడు. ఈ సంకీర్తనలు విన్న కుముద కూడా నిద్ర లేచింది. అనంతరం ఆ వృద్ధుడు బయటకు వెళ్ళే ప్రయత్నం చెయ్యసాగాడు. కుముద సాధువును అంత పొద్దున్నే ఎక్కడకు వెళుతున్నావు? అని అడిగింది.

తాను మాఘమాస స్నాన వ్రతం చేస్తున్నానని సమీపంలోని నదికి స్నానం కోసం వెళుతున్నానని అన్నాడు సాధువు. మాఘస్నాన వ్రతం మీద ఆ ఇల్లాలికి ఆసక్తి కలిగి వ్రతానికి సంబంధించిన విషయాలన్నింటినీ అడిగి తెలుసుకుంది. ఆ వ్రతం వల్ల కలిగే పుణ్యఫలాన్ని తానూ పొందాలనుకుంది. సాధువుతో తాను కూడా మాఘస్నాన వ్రతం ప్రారంభించింది. ఆ తరువాత కొద్ది రోజులకు ఆమె భర్త తిరిగి వచ్చాడు. ఉదయాన్నే అతడిని కూడా నిద్ర లేపి మాఘ స్నానానికి రమ్మనమని కోరింది కుముద. దైవ ద్వేషి ఆయిన సుమంతుడు భార్య మాటలను హేళన చేసి అవమానించి తాను స్నానానికి వెళ్ళకుండా ఉండటమే కాక భార్యను కూడా వెళ్లవద్దని అదుపు చేశాడు. కానీ కుముద సద్భక్తి నిండిన మనస్సుతో మెల్లగా నదీ స్నానానికి వెళ్ళింది. అందుకు కోపగించిన భర్త ఒక కర్రను తీసుకుని ఆమె వెంటపడ్డాడు. అప్పటికే ఆమె నదిలో హరినామ స్మరణతో మునుగుతూ స్నానం చేయసాగింది.

సుమంతుడు కూడా నదిలోకి దిగి ఆమెను కర్రతో కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె ఆ కర్రను పట్టుకొని గుంజుతూ తప్పించుకోనే ప్రయత్నం చేస్తున్నపుడు ఆ భర్త కూడా నది నీళ్ళల్లో మునుగుతూ లేస్తూ ఉండటంతో అతడు కూడా స్నానం చేసినట్టయింది. చివరకు ఎలాగోలాగా భార్యను గట్టిగా పట్టుకొని ఇంటికి లాక్కు వచ్చాడు సుమంతుడు. ఆ తర్వాత చాలాకాలం గడిచింది. అంత్యకాలంలో దైవికంగా ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి మరణించారు. మాఘస్నాన పుణ్యఫలం, దానధర్మాల ఫలితంగా కుముదను తీసుకు వెళ్ళటానికి వైకుంఠం నుంచి విష్ణుదూతలు వచ్చారు. దైవదూషణ, అధర్మ వర్తనులతో కాలం గడిపిన నేరానికి సుమంతుడిని యమదూతలొచ్చి యమలోకానికి తీసుకువెళ్ళారు. అక్కడ చిత్రగుప్తుడు సుమంతుడి పాపాలన్నీ లెక్కగట్టి ఘోర నరక శిక్షను విధించాడు. అయితే తన భార్యను మాఘస్నానం నుంచి విరమింప చేసే ప్రయత్నం చేస్తూ ఆమెతో కొట్లాడుతూ పెనుగులాడుతున్న వేళ అనుకోకుండానైనా సుమంతుడు నదిలో మునిగి లేచాడు. అలా చేసిన మాఘస్నాన పుణ్య ఫలితమే అతడికి దక్కింది. ఆ ఒక్క పుణ్యం ఫలితంగా అతడిని నరక శిక్ష నుంచి తప్పించి వైకుంఠానికే పంపమని చిత్రగుప్తుడు ఆదేశించాడు.

మాఘమాస గౌరీవ్రత మహాత్మ్యం :-

మాఘమాసంలో ఉదయాన్నే నదీ స్నానం చేయటం, ఆ తర్వాత ఇష్టదైవాన్ని భక్తిగా కీర్తించటం, మాఘపురాణ పఠన శ్రవణాలనేవి ముప్ఫై రోజులపాటు జరిపే వ్రతంలో భాగాలు. ఈ వ్రత విశేషమేమిటంటే వ్రత కథలో మనిషి ఎలాంటి తప్పులు చేయకూడదో, తప్పులు చేసినందువల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలియచెప్పటమేకాక ఆ పాపం నుంచి ఎలా విముక్తి పొందాలో వివరించటం కనిపిస్తుంది. తెలిసో తెలియకో పాపాలు చేయటం మానవ నైజం. పాపం చేశావు కనుక ఈ నరకాలు అనుభవించి తీరాల్సిందేనంటే ఇక మనిషి జీవితాంతం కుంగి కుమిలిపోతూనే ఉంటాడు. అమూల్యమైన జీవితం అలా వృథా అవుతుంది. తప్పు చేశావు, పశ్చాత్తాపం పొంది ఇక మీదట అలాంటి తప్పులు చేయకుండా జీవితమంతా మంచి వ్రతాలు చేస్తూ భక్తితో కాలం గడుపు అని అంటే ఏ మనిషైనా ఎంతో కొంత మంచిగా మారేందుకు వీలు కలుగుతుంది.

ఇలా మాఘస్నాన వ్రతం అనే సులభ సాధనంతో మానవాళికి సన్మార్గాన్ని చూపించటమే మన సనాతన సంప్రదాయంలోని రుషుల లక్ష్యంగా కనిపిస్తుంది. దానికి మాఘపురాణంలోని రెండు, మూడు అధ్యాయాలలో ఉన్న సారాంశం ఉదాహరణగా నిలుస్తుంది. రెండో అధ్యాయంలో చెయ్యకూడని పాపాలేమిటో, వాటివల్ల జన్మజన్మలకు కలిగే నష్టమేమిటో వివరంగా ఉంది. రెండో అధ్యాయం చివర, మూడో అధ్యాయంలో మాఘస్నాన ఫలితంతో ఆ పాపాలను పోగొట్టుకోవచ్చన్న సూచన కనిపిస్తుంది. ఈ సూచనను సమర్ధిస్తూ సుదేవుడు అనే ఒక వేదపండితుడి కుమార్తె కథను సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినట్లుగా ఉంది.
పూర్వం సౌరాష్ట్ర దేశంలో బృందారకం అనే ఓ గ్రామం ఉండేది. అక్కడున్న వేదవేదాంగ పండితుడైన సుదేవుడు అనే గురువు దగ్గర చాలామంది విద్య నేర్చుకుంటూ ఉండేవారు. ఆ గురువుకు గొప్ప సౌందర్యవతి అయిన ఓ కుమార్తె ఉండేది. ఆమెను తగిన వరుడుకిచ్చి వివాహం చేయాలని సుదేవుడు ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఆ గురువు దగ్గర సుమిత్రుడు అనే ఒక శిష్యుడుండేవాడు. గురుపుత్రిక అధర్మ మార్గంలో సుమిత్రుడిని కోరుకుంది. సుమిత్రుడు గురుపుత్రిక అంటే సోదరితో సమానమని, అధర్మవర్తనం కూడదు అని చెప్పినా ఆమె వినలేదు. చివరకు సుమిత్రుడే ఆమె మార్గంలోకి వెళ్ళవలసి వచ్చింది. కొంతకాలం తర్వాత సుదేవుడు తన కుమార్తెను కాశ్మీర దేశవాసికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం అయిన కొద్ది రోజుల్లోనే ఆ కాశ్మీర దేశవాసి అకాలమరణం పొందాడు. తన కుమార్తె దురదృష్టానికి సుదేవుడు ఎంతగానో విలపించసాగాడు. అలా మరికొంత కాలం గడిచింది. ఓ రోజున దృఢ వ్రతుడు అనే ఓ యోగి సుదేవుడి ఆశ్రమం వైపు వచ్చాడు. సుదేవుడు ఆ యోగికి అతిథి పూజా సత్కారాలు చేసి తన కుమార్తెకొచ్చిన కష్టాన్ని వివరించాడు. తాను ఏనాడూ పాపం చేయలేదని, తన కుమార్తెకు మరి అంతటి కష్టం ఎందుకొచ్చిందో తెలియటం లేదన్నాడు. యోగి దివ్య దృష్టితో చూశాడు. సుదేవుడి కుమార్తె గత జన్మలో భర్తను హింసించటం, కూడని పనులు చేయటంలాంటి పాపాలు చేసిందని, అయితే ఓ రోజున అనుకోకుండా మాఘమాసంలో సరస్వతీ నదీతీరంలో గౌరీ వ్రతం జరుగుతుండగా ఆ వ్రతాన్ని చూసిందని, ఆ కారణం చేతనే మరుసటి జన్మలో ఉత్తముడైన సుదేవుడి ఇంట జన్మించటం జరిగిందన్నాడు. అయితే పూర్వ జన్మ పాపం ఇంకా వదలకుండా వెన్నాడుతూ ఉండటం వల్లనే ఈ జన్మలో అధర్మబద్ధంగా సుమిత్రుడునే శిష్యుడి సాంగత్యం పొందిందన్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకొని సుదేవుడు ఎంతో బాధపడ్డాడు. ఇక మీదట ఆ పాపం అంతా పోయి తన కుమార్తె పుణ్యం పొందటానికి మార్గం ఏదైనా చెప్పమని యోగిని కోరాడు సుదేవుడు. అప్పుడు ఆ యోగి మాఘశుద్ధ తదియనాడు గౌరీవ్రతం, సుహాసినీ పూజ చేస్తే ఇక మీదట పాపం అంతా నశిస్తుందని చెప్పాడు. వెంటనే ఆ గురువు తన కుమార్తెతో గౌరీవ్రతం (కాత్యాయనీ వ్రతం) చేయించాడు. మాఘశుద్ధ తదియనాడు జరిపిన ఆ వ్రత ఫలితంగా అనంతరకాలంలో ఆమె పుణ్యఫలితంగా సుఖాలను పొందింది.
పవిత్రంగా